టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సొంత జిల్లా మెదక్ కు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ముందుగా వర్గల్ లోని సరస్వతి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ తో పాటు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు. అనంతరం ప్రజ్ఞాపూర్ లో జరిగే బహిరంగసభలో పాల్గొనడానికి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కేసీఆర్ కు మహిళలు బతుకమ్మలతో ఎదురురాగా, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు డప్పులతో స్వాగతం పలికారు.
సభావేదికపైకి ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే ప్రజలంతా హర్షధ్వానాలు చేశారు. కేసీఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల తర్వాత తెలంగాణ వచ్చింది. ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే అరుదైన ఉద్యమంగా నిలుస్తుంది. రెండవ దశలో జరిగిన ఉద్యమం ప్రపంచ ఉద్యమాల చరిత్రకు ఆదర్శంగా నిలుస్తుంది’. అన్నారు.
తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని, బంగారు తెలంగాణను సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వసతులు, వనరులు లభిస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారని, వారి కలలు నెరవేరుస్తానని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని, దళితులు, బీసీలు, మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. దళితులకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, వృద్ధులు, వితంతువులకు త్వరలోనే పెన్షన్లు ఇస్తామని, రాజకీయ అవినీతిని అంతం చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అవినీతికి పాల్పడినవారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ రైతుల రుణాలు పది పన్నెండు రోజుల్లో తప్పకుండా మాఫీ చేస్తామని, 23 లక్షల రైతుల ఖాతాల్లో ఉన్న 12వేల కోట్లు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, హార్టీకల్చర్ హబ్ ఏర్పాటు చేసి విత్తనాలు పండిస్తామని, కూరగాయల సాగుకు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీల జల్లు కురిపించారు కేసీఆర్.
జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. ఆమె మంచి వ్యక్తిత్వం ఉన్నవారని, మంచి అధికారిణి తమ జిల్లా కలెక్టర్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. గతంలో కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులను ఆమె ఆధునీకరించారని, అందువల్ల ప్రసూతి స్త్రీలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ళకుండా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్తున్నారని గుర్తుచేశారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో 24 జిల్లాలు ఉంటాయని, తెలంగాణలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడానికి జిల్లాకో నిమ్స్ చొప్పున 24 నిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తనను గెలిపించిన గజ్వేల్ ప్రజలకు రుణపడి ఉంటానని, గజ్వేల్ లో త్వరలోనే 5వేల ఇళ్ళు నిర్మిస్తామని, రేపటినుండి అర్హులైన వారిని గుర్తిస్తామని, తెలంగాణలో గజ్వేల్ ను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని, గజ్వేల్ కు రింగ్ రోడ్ నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు.