రంజాన్ సందర్భంగా మంగళవారం డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ కుటుంబ సభ్యులకు, ముస్లిం మతపెద్దలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ మాట్లాడుతూ, రంజాన్ పండుగ త్యాగానికి ప్రతీక అని, ఇస్లాం ప్రకారం ముస్లింలు తమ ఆస్తిలో పేదవారికి 2.5శాతం దానం చేయాలని, హిందూ, ముస్లింలంతా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం తెలంగాణలోనే సాధ్యమని అన్నారు.
తెలంగాణ మహాత్మ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రప్రభుత్వం అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలోని అన్ని మసీదుల్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని మహమూద్ అలీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ కవిత, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.