mt_logo

పసుపు బోర్డు సాధించే సత్తా కేవలం ఎంపీ కవితకే- నిజామాబాద్ రైతులు

పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ రోజుకో మాట మారుస్తూ భారతీయ ఝూఠా పార్టీ అనే పేరును సార్ధకం చేసుకుంది. గత ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ నిజామాబాద్ కు వచ్చినప్పుడు పసుపుబోర్డుపై హామీ ఇచ్చి కూడా మాట నిలబెట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటును మ్యానిఫెస్టోలో పెడతామని చెప్పి ఎప్పట్లాగే రైతులను మరోసారి దారుణంగా వంచించారు. బీజేపీ మ్యానిఫెస్టోలో పసుపు బోర్డు ఊసే లేకపోవడంతో నిజామాబాద్ రైతులు మండిపడుతున్నారు. ఏప్రిల్ 11 న జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు.

ఇదిలాఉండగా కేంద్రంలో ఈసారి వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనని, ఖచ్చితంగా పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత స్పష్టం చేశారు. పసుపుబోర్డు ఏర్పాటుకోసం ఎంపీ కవిత అహర్నిశలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. పసుపు బోర్డు ఆవశ్యకతపై దాదాపు ఐదేళ్లుగా అటు పార్లమెంటులో, ఇటు బయటి వేదికలపై వివరిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో ఆమె కలువని కేంద్రమంత్రి లేరు. తన సహచర ఎంపీల మద్దతు కూడగట్టడంతో పాటు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను అనేకసార్లు కలిసి చర్చించారు. మొదట్లో కేంద్రమంత్రి విముఖత చూపించినా ఎంపీ కవిత పట్టుదల చూశాక, ఆమె చివరికి పసుపు బోర్డు ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అందుకోసం అవసరమయ్యే ఆర్ధికసాయం కూడా అందిస్తామని ముందుకు వచ్చారు. కానీ మళ్ళీ కథ మొదటికే వచ్చింది.

ఎంపీ కవిత అనేకసార్లు ప్రధాని మోడీని కలిసి పసుపు బోర్డు ఏర్పాటును విడమరిచి చెప్పినా ఫలితం లేదు. మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ పార్టీకి పసుపు బోర్డు విషయం గుర్తుకొచ్చింది. నిజామాబాద్ లో సభలు పెట్టి మరీ పసుపు బోర్డు తమవల్లే సాధ్యమవుతుందని, మానిఫెస్టోలో ఈ అంశం పెడతామని చెప్పింది. కానీ బీజేపీ విడుదల చేసిన 2019 ఎన్నికల మానిఫెస్టోలో ఆ ఊసే లేదు. దీంతో ఆగ్రహించిన రైతులు బీజేపీ అగ్రనేతల దిష్టిబొమ్మలు తగలపెట్టారు. ఈ విషయంపై ఎంపీ అభ్యర్థి కవిత స్పందిస్తూ కేంద్రం మోసపూరిత మాటలతో ప్రజలని మభ్యపెడుతున్నది. పసుపు బోర్డు ఇవ్వడానికి ముందుకురాని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు నిజామాబాద్ కు వచ్చి ఆ అంశాన్ని మానిఫెస్టోలో పెడతామని చెప్పింది. కానీ వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది. అందుకే బీజేపీ మానిఫెస్టోలో పసుపు బోర్డు అంశమే లేదు. మేము మాత్రం ఈ విషయంలో ఎంతో చిత్తశుద్ధితో ఉన్నాం. పసుపు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 30 కోట్లు వెచ్చించి వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద పసుపు బోర్డు నెలకొల్పుతామని కవిత హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *