mt_logo

ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుంది అని విమర్శించారు.

ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి.. తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం అని తెలిపారు.

కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి.. రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారు. బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరం.. బతుకును ఆగం చేశారు.. బతుకమ్మను మాయం చేశారు అని కవిత మండిపడ్డారు.

తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలి అనుకుంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాయాలి. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు అని దుయ్యబట్టారు.