– దుప్పల రవికుమార్
[వ్యాసకర్త ఉత్తరాంధ్రకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, రచయిత. ప్రస్తుతం టెక్కలిలో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు]
—
మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యానికి తల్లివేరు అనదగ్గ గ్రామ ప్రంచాయతీ ఎన్నికలను మన రాష్ట్రప్రజలు ఎంతో స్ఫూర్తిమంతంగా తీసుకున్నారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా కేవలం ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి మంచిచెడ్డలను మాత్రమే బేరీజు వేసుకుని ఓటుద్వారా బుద్ధి చెపారు. కానీ కళ్లకు రాజకీయ గంతలు కట్టుకున్న తెలుగు మీడియా మాత్రం రాజకీయాలకు అతీతంగా జరగవలసిన గ్రామపంచాయతీ ఎన్నికల స్ఫూర్తిని నేలపాలు చేసింది. ఆ పార్టీకి ఇన్ని ఈ పార్టీకి అన్ని అని వార్తలు రాయలేదు, ప్రసారం చేయలేదు సరికదా… మా పార్టీకన్ని, ఇతర పార్టీలకిన్ని అంటూ నిస్సిగ్గుగా దైవమిచ్చిన బట్టలతో ప్రజలముందు నిల్చున్నాయి. ఈసారి పార్టీలు ఓవరాక్షన్ చేయలేదు (మొదట్లో బొత్స కొంచెం బడాయి పోయినప్పటికీ, హైకమాండ్ ఆదేశాల మేరకు బాగా తగ్గాడు). గానీ పత్రికలు, టీవీ చానెళ్లు మాత్రం విలయతాండవం చేసేశాయి. ఇదే ఊపుతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం బయలుదేరబోతున్న సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం ప్రజలందరినీ విస్మయపరుస్తూ తెలంగాణ విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి ప్రయత్నిస్తున్న రాజాకీయ నాయకులకు మరో అవకాశం చిక్కింది. అందునా నిలువెల్లా స్వప్రయోజనాలు తప మరోటి పట్టని మన తెలుగు మీడియాకు దీంతో పందికి బురద దొరికినట్టయింది.
మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదాన్ని భారత ప్రభుత్వం మన్నించింది. 1956లో జరిగిన ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని ఆరు దశాబ్దాల తరువాత అదే ప్రభుత్వం సరిదిద్దుకుంది. ఎంత వద్దవద్దని వారించినా, మద్రాసు రాష్ట్రం నుంచి విడివడిన ఆంధ్రరాష్ట్రంతో ప్రత్యేకమైన హైదరాబాద్ స్టేట్ ప్రెసిడెన్సీని కలిపేసి ఆంధ్రప్రదేశ్ ను జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటుచేశారు. అప్పుడు మొదలైన ఆందోళన సుదీర్ఘంగా సాగిసాగి అరవై ఏళ్లు అయిన తరువాత, దాదాపు వెయ్యిమంది యువత బలిదానాల తరువాత, ఇరుప్రాంతాల ప్రజల నడుమ వైమనస్యం పెరిగి పెట్రేగిపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పటికైనా ఇరుప్రాంతాల రాజకీయ నాయకులు తమ ప్రజలకు వాస్తవాలను వివరింఛాలి. ఉద్వేగాలతో ఆటలాడుకోవడం మాని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని అడుగు ముందుకేసేందుకు ప్రజాశ్రేణులను సన్నద్ధం చేయాలి.
నాలుగు వందల ఏళ్ల ఘనమైన చరిత్ర, స్వాతంత్ర్య పూర్వం నాటికే అరుదైన సాంస్కృతిక, చారిత్రక కట్టడాలతోపాటు ఇతర ప్రత్యేకతలు కలిగివున్న హైదరాబాద్ ను పదేళ్లపాటు ఇమ్మడి రాజధానిగా ఎందుకు చేస్తునారో అర్థంకాదు. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ తన కొత్త రాజధానిని సిద్ధం చేసుకోవాలి.
కోస్తా, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాలలో ఉవ్వెత్తున ప్రజలు వీధుల్లోకొచ్చి రాష్ట్రం రెండు ముక్కలు కావడాన్ని వ్యతిరేకిస్తున్న స్వరంలోగాని, వారి నిజాయితీలోగాని మనకెవరికీ ఎటువంటి సంశయం ఉండనక్కరలేదు. కాని, ఆ కోపం అకారణమని చెప్పే నాధుడు లేకపోయాడు. ఉద్వేగపూరితం (ఎమోషన్ డ్రివెన్)గా సాగుతున్న ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించే నాయకుడు లేడు. మొన్నటికి మొన్న నిర్భయ విషయంలో దేశవ్యాప్తంగా వీధుల్లోకొచ్చిన యువతరం ఆవేశం ఎలా వృధాపోయిందో మనం కళ్లారా చూశాం. తెలంగాణలో నాయకులు పిలిచినప్పుడు సభలకు హాజరైన లక్షలాది జనం మాత్రమే ఉద్యమమనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమానికి ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. అక్కడి మేధావులు, ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు, కళాకారులు, వాగ్గేయకారులు తదితరులు తమతమ రంగాలలో ప్రజలకు ఆలోచనలు పంచి, ఉద్యమానికి సమాయత్తం చేయడంలో ఒక క్రమముంది. ఆ క్రమం (ప్రాసెస్)లో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాలలో జరిగిన పునరుజ్జీవన ఉద్యమాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ క్రమాన్ని అధ్యయనం చేస్తేనే విముక్తి పోరాటాలకు దారి మరెవరికైనా లభ్యమయ్యేది.
దూరదృష్టి, దేశభక్తిలేని రాజకీయ నాయకులు కొందరు తమ పాలనలో తెలంగాణ వెనకబాటుతనాన్ని కప్పిపుచ్చడానికి హైదరాబాద్ కే ఏకోన్ముఖంగా నిధులు ప్రవాహంలా మళ్లించి పొరపాటు చేశారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు ప్రదర్శిస్తున్న ఆగ్రహం ఆ పొరపాటుపైనే. కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పుడు డేరాలలో అధికారిక కార్యాలయాలు ఏర్పాటుచేసుకున్న మనం గడిచిన ఆరు దశాబ్దాలుగా నిజాము కాలంనాటి భవనాలనే వాడుకున్నామని మర్చిపోకూడదు. వెయ్యి రూపాయలున్న చోట ఐదు వందలు (కాకపోతే మరో వెయ్యి రూపాయలు) పెట్టుబడి పెట్టి మొత్తం తీసేసుకోవాలనుకుంటే దానిని దోపిడీ అనికాక మరేమని పిలవాలి?
రాష్ట్రమంతటికీ విస్తరించాల్సిన విశ్వవిద్యాలయాలు, కర్మాగారాలు, ఆసుపత్రులు, ఇతర ప్రజోపయోగ సంస్థలు కేవలం హైదరాబాదులోనే ఏర్పాటుచేసినప్పుడు పెగలని గొంతులు, ఇప్పుడు కోసుకుంటే మాత్రం ఎవరికి లాభం? తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సెక్రెటేరియేట్ లో విధులకు డుమ్మాకొడుతున్న ఉద్యోగులలో సీమాంధ్రులు జోనల్ నిబంధనల శాతానికి మించి ఎలావున్నారో బుర్ర చించుకున్నా పాలుపోదు. సీమాంద్ర్హ పదమూడు జిల్లాలలో కలిపి ఎంతమంది తెలంగాణ ఉద్యోగులు ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? మరి ఆరోజోనుకు ప్రత్యేకమైన చోట ఇన్ని వేలమంది సీమాంధ్రులు ఉద్యోగాలు ఎలా సంపాదించారు? పెద్దమనుషుల ఒప్పందం నుంచి శ్రీభాగ్ ఒప్పందం మీదుగా ఇందిరాగాంధీ వరకు మనమిచ్చిన వాగ్దానాలన్నింటిని తుంగలో తొక్కి పారేశామని తెలుస్తోంది కదా. ఆదినుంచి తెలంగాణవాదులు చేస్తున్న తమవాటా ఉద్యోగాలను కొందరు కొల్లగుడుతున్నారన్న వాదన నిజమని తేటతెల్లమవుతోంది కదా.
భాగ్యనగరం ఎవరికీ చెందకుండా కేంద్రపాలిత ప్రాంతం కావాలని కోరడంలో ‘నాకు దక్కకూడనిది ఎవరికీ దక్కకూడదన్న’ విపరీత మనస్తత్వం తప్ప మరోటి కనిపించదు.
ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియడానికి విస్తృతంగా ప్రజాసమూహాలతో సభలు, సమావేశాలు జరపాలి గాని వీధుల్లోకెక్కి వీరంగం చేయడం ద్వారా సాధించేది ఏమీలేదు. రోడ్లెక్కి బస్సులాపి ప్రయాణీకులను వేధించడం ద్వారా సిద్ధించేది ఏమీలేదు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు బలవంతంగా మూయించి చదువులు ఆపించడం ద్వారా సమకూరేది ఏమీలేదు. పిచ్చిచేష్టలాగా టైర్లు కాల్చడం ద్వారా ఒనగూడేది ఏమీలేదు. కేవలం మన ప్రజాజీవనాన్ని మనమే స్తంభింపచేసుకోవడం తప్ప. ఎదుటివారిని హింసించి తాను ఆనందం పొందేవాడిని శాడిస్టు అని, తనను తాను హింసించుకొని ఆనందం పొందేవాడిని మాసోచిస్టు అని అంటారని మనస్తత్వశాస్త్రం చెప్తోంది. అన్నట్టు మనస్తత్వశాస్త్రం తెలంగాణది కాదు.