By: కట్టా శేఖర్‌రెడ్డి
ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖ ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నది. హైదరాబాద్‌లో అరాచకం ఉందట. అభద్రత ఉందట. ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారట. ఇంత స్వేచ్ఛగా అబద్ధాలను చెలామణి చేసే నాయకుడు మరొకరు కనిపించరు. నడిస్తే రాజభోగం, నడవకపోతే గందరగోళం. సాగితే తన గొప్పతనం, సాగకపోతే ఎదుటివాడి అరాచకం. చంద్రబాబు మారడు. మారలేడు. ఆయన జీవితంలో తప్పులు ఒప్పుకున్న సందర్భంగానీ, తప్పులు గుర్తించిన సందర్భంగానీ, పశ్చాత్తాపపడిన సందర్భంగానీ ఇంతవరకు చూడలేదు. నిన్న కొందరు బాధితులు వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. రేవంత్‌రెడ్డి గోపనపల్లిలోని తమకు చెందిన 4000 గజాల భూమిని ఎలా కబ్జా చేశాడో వివరించారు. విషాదం ఏమంటే ఆ బాధితులు గుంటూరు జిల్లా వారు. కబ్జాలు యథేచ్ఛగా జరిగింది సమైక్య పాలనలోనే. కబ్జాకోరులంతా ఉంది టీడీపీ, కాంగ్రెస్‌లలోనే. హైదరాబాద్‌లో నిజమే అరాచకం ఉండేది.
హైదరాబాద్‌ను అరాచకాల రాజధానిగా మార్చిన చరిత్ర టీడీపీదే. ఇక్కడ ఫ్యాక్షనిస్టు హత్యలు జరిగింది టీడీపీ హయాంలోనే. ఉన్నట్టుండి మనుషులు మాయమైంది టీడీపీ పాలనలోనే. రాయలసీమకు బయలుదేరినవారు మహబూబ్‌నగర్ హైవే వెంట శవాలుగా తేలింది చంద్రబాబు రాజ్యంలోనే. విచిత్రంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలోనే ఎమ్మార్వో కార్యాలయాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. భూమి రికార్డులు దగ్ధం చేయడం, కొత్త రికార్డులు సృష్టించడం, ప్రభుత్వ స్థలాలకు పత్రాలు తయారు చేయడం, వందల ఎకరాల భూములు కబ్జా చేయడం ఇదంతా బాబు పాలనలోనే మొదలయింది. రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబు స్టైలు పాలనను కొత్త పుంతలు తొక్కించారు. ఇద్దరిదీ క్విడ్ ప్రోక్వోనే. ఇద్దరిదీ ఇచ్చి పుచ్చుకునే పద్ధతే. చంద్రబాబు స్మార్టుగా చేశాడు. రాజశేఖర్‌రెడ్డి నేకెడ్‌గా చేశాడు. చంద్రబాబు దొరకలేదు. రాజశేఖర్‌రెడ్డి దొరికేట్టు చేశాడు. భవనాలు, లేఅవుట్లు, భూముల క్రమబద్ధీకరణ పేరిట చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన జీవోలు, కొల్లగొట్టిన భూములపై విచారణ వేయడానికి ఒక్క కమిషను చాలదు. చంద్రబాబు అన్యాక్రాంతం చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులపై విచారణ చేస్తే ఆయన హైదరాబాద్‌కు చేసిన ద్రోహం బట్టబయలవుతుంది. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి పాలనలో నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతాయి. హంతకులెవరో దేశానికి తెలుస్తుంది. పత్రికల్లో వస్తుంది. కానీ విచారణలో నిర్దోషులుగా బయటపడతారు. అరాచకం అంటే ఇదీ.
ఇప్పుడు చంద్రబాబు ఇరుక్కునటువంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రో, మంత్రులో ఇరుక్కుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వారి చానెళ్లు ఎలా వ్యవహరించేవి? భూమ్యాకాశాలు ఏకం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవాలని కత్తికట్టి నాట్యం చేసేవి. ఉన్నవీ లేనివీ పోగేసి అన్ని గుదిగుచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతగా నగుబాటుపాలు చేయాలో అంతగా నగుబాటుపాలు చేసేవి. చూశారా తెలంగాణ వాళ్లకు పరిపాలించుకోవడం రాదు. తెలంగాణ విఫలమవుతోంది చూడండి అని ప్రచారం చేసేవి. నిన్న మొన్న కూడా కొందరు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల మీద చిన్న చిన్న విషయాలకే రోజంతా పేరిణి శివతాండవం చూపించిన ఈ పత్రికలు, చానెళ్లు ఇంత పెద్ద నేరం జరిగితే ఎందుకు తేలుకుట్టిన దొంగల్లా, కుడితిలో పడిన బల్లుల్లా వ్యవహరిస్తున్నాయి. ఆ పత్రికలు ఇప్పుడు చంద్రబాబు పక్షాన రోజూ డిఫెన్సు ఆడుతున్నాయి. చంద్రబాబును సమర్థించడానికి, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి.
కానీ చంద్రబాబుది ఇప్పుడు దొరికిపోయిన దొంగ మానసిక స్థితి. తన మీదికి వస్తున్న ప్రమాదపు రైలును ఎటో మళ్లిద్దామని ఢిల్లీదాకా వెళ్లి లడ్డూలిచ్చి లాబీయింగ్ చేసి వచ్చాడు. వారేమీ కరుగలేదు. చలించలేదు. ఈయన కథలు బాగా అర్థం చేసుకున్నవారు కదా. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని తెలుసు. ఈయన ఎంత గాలివాటం మనిషో కూడా వారికి తెలుసు. ఈయన ఎప్పుడెప్పుడు ఏం నాటకాలు ఆడారో రికార్డులతో సహా నరేంద్ర మోదీకి తెలుసు. అందుకే వారు విన్నారు కానీ కనికరించలేదు. బీజేపీకి చంద్రబాబు వ్యవహారం అర్థం అయింది. అందుకే రాష్ట్రంలో కూడా ప్రతిచిన్న విషయానికీ గళమెత్తే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఇతరులు కొద్ది రోజులుగా మీడియా ముఖం చూడడం మానేశారు. చంద్రబాబును సమర్థించడానికి వారి వద్ద మాటలు లేవు. కనీసం వారు రేవంత్‌రెడ్డి కూతురు నిశ్చితార్థంలో కనిపిస్తారేమోనని అందరూ చూశారు. అంటే వారికి ఇది బురద అని అర్థమయింది. బురదకు దూరంగా ఉండాలనీ అర్థమయింది. ఢిల్లీ పెద్దలకూ అదే నివేదించారని తెలుస్తున్నది. మోడీ ఎటువంటి హామీలు ఇవ్వలేదు కాబట్టే చంద్రబాబు ఇక్కడికి రాగానే లేఖాస్త్రం సంధించాడు. చంద్రబాబు తన దుఃఖాన్ని ఆంధ్ర ప్రజలందరి దుఃఖంగా, తన నేరాన్ని అందరి నేరంగా మల్చాలని చూస్తున్నారు. గవర్నర్ నిన్ననే ఢిల్లీలో ఒక మాట చెప్పి వచ్చారు.
అంతా ప్రశాంతంగా ఉంది. విభజన విద్వేషాలు లేవని చెప్పారు. గవర్నర్ అక్కడ ఈ మాట చెప్పి వచ్చిన మరుసటిరోజు చంద్రబాబు ఇక్కడ అరాచకం కొనసాగుతున్నదంటూ లేఖ రాశాడు. ఈ రెండు అభిప్రాయాల మధ్య దూరమెంతో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఢిల్లీ పెద్దలు. హైదరాబాద్‌లో అరాచకం ఉందంటూ చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాస్తున్న సమయానికి హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో తెలంగాణ పారిశ్రామిక విధానం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. వందలాది మంది పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలు అందులో పాల్గొన్నారు. వారు కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెబుతున్నారు. హైదరాబాద్ తమ పెట్టుబడులకు అనువైన కేంద్రమని ప్రకటించారు. ఐటీసీ దేవేశ్వర్ వంటి వారు అక్కడికక్కడే 8000 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించారు. రుయా గ్రూపు రైల్వే బోగీల కోచ్ ఫ్యాక్టరీని ఆంధ్రలో కాకుండా తెలంగాణలో పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబాబు లేఖారాతలకు, వాస్తవికతకు మధ్య ఎంత అంతరం ఉందో దీన్నిబట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబునాయుడు ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేవంత్‌రెడ్డితో తనకు సంబంధంలేదని, ఆయనంతట ఆయన ఈ ఆపరేషను చేశారని, తనకు తెలియకుండా తన పేరు వాడుకున్నారని చెప్పడానికి ఒకింత అవకాశం ఉండె. కానీ మరుసటిరోజే బాబుగారు మాట్లాడిన ఫోను సంభాషణ బయటికి వచ్చింది. అందుకే ఇప్పుడు మింగలేని కక్కలేని బాధ. ఇప్పుడయినా రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి వెలివేసి, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పార్టీలో కొందరు పెద్దలు సలహాలిస్తున్నారు. అది ఇంకా ప్రమాదకరమని చంద్రబాబుకు తెలుసు. రేవంత్‌రెడ్డిని పార్టీకి దూరం చేస్తే, ఆయన ఊరుకుంటాడా? రేవంత్‌రెడ్డి అప్రూవరుగా మారి బాబే ఈ పని చేయించడానికి న్యాయస్థానం ముందు చెబితే, చంద్రబాబు కటకటాలు చూడాల్సి వస్తుంది. అందుకే దొరికిపోయి, కేసుల పాలు చేశాడని రేవంత్‌రెడ్డిపై ఎంత కోపం ఉన్నా, దానిని అదిమి పట్టుకుని ఆయన బిడ్డ నిశ్చితార్థానికి మంత్రివర్గాన్నంతా తరలించారు. పెదబాబు, చినబాబు ఏకచ్ఛత్రాధిపత్యంపై ఇంతకాలంగా గుర్రుగా ఉన్న టీడీపీ సీనియర్లు, సీనియర్ మంత్రులు చంద్రబాబుకు వచ్చిన కష్టం పట్ల కాస్త సంతోషంగా ఉన్నారు. భలే ఇరుక్కున్నాడు. తగిన శాస్తి జరిగింది. ఈయనకు కేసీఆరే మొగుడు వంటి వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులున్నారు. చంద్రబాబు ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటాడని జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఊహించలేదు. ఇరుక్కున్నదే తడవుగా ఆయన ఆంధ్రలో విజృంభిస్తున్నారు.
ఇంతకాలం తనొక్కడే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అటువంటి కూపంలోనే చిక్కుకున్నారు. చంద్రబాబు ఎందులో గొప్ప అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దొంగతనం గురించి ప్రచారం చేస్తూ ఊరూవాడా కలియదిరుగుతున్నాడు. జనం నమ్ముతారా లేదా అన్నది తర్వాత. కానీ ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు. ఇదే అదనుగా జగన్‌కు, కేసీఆర్‌కు పొత్తు పెట్టి ఆంధ్రలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చంద్రబాబు, ఆయన చెంచా మీడియా ప్రచారం చేస్తున్నది. చంద్రబాబు పాపాలకు అండగా అక్కడ జనాన్ని సమీకరించాలని వారంతా తాపత్రయపడుతున్నారు. జగన్ కు తెలంగాణకు సంబంధం లేదు. జగన్ పార్టీ తెలంగాణలో ఇర్రిలవెంట్ అయిపోయింది. జగన్ ఇక్కడ ఏమీ పుల్లలు పెట్టడడం లేదు. ఆయన సోదరి యాత్రలు చేసినా, ఆయన యాత్రలు చేసినా ఇక్కడ జనం పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. జగన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం తెలంగాణకు గానీ, టీఆర్ఎస్‌కు గానీ రాలేదు. జగన్‌తో పొత్తు పెట్టుకోవలసిన అవసరం కానీ, పంచాయితీ పడవలసిన అవసరం కానీ తెలంగాణకు లేదు.
తెలంగాణకు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్నది, గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నది, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నది చంద్రబాబు ఒక్కరే. కొందరు రోగ్ నేతలను పోషించి నిత్యం అడ్డగోలు కూతలతో తెలంగాణ ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నది చంద్రబాబే. తెలంగాణ ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఉండనీయనిది చంద్రబాబే. చంద్రబాబు తెలంగాణ ఏర్పడడాన్ని, సమస్యలు లేకుండా ముందుకు సాగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. కరెంటు లేక అల్లకల్లోలం అవుతుందని ఊహించారు. అది జరుగలేదు. తమ చెంచా మీడియాను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వంపై కృత్రిమ ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. తెలంగాణ విఫలమవుతుందని, కేసీఆర్ నిభాయించుకోలేరని, 2019లో మళ్లీ మనమే గెలుస్తామని ఒక ఎండమావిని ప్రచారంలో పెట్టి హైదరాబాద్‌లో నిత్యం కుంపటిని రాజేయాలని చూశారు. చంద్రబాబు స్వయంగా చెంచా మీడియాకు చెబుతున్నారో లేక చెంచా మీడియానే చంద్రబాబుకు చెబుతున్నదో, అదీగాక ఇద్దరూ ఒకే అజ్ఞానపు వేవ్‌లెన్త్‌తో ఆలోచించి మాట్లాడుతున్నారో తెలియదు. అవేవీ జరుగలేదు. జరిగే అవకాశం లేదు. చంద్రబాబును సమర్థించే పత్రికల్లో ఒక పత్రికాధిపతి మరో పత్రికాధిపతి గురించి చెప్పినట్టుగా ఒక మాట వాడుకలోకి వచ్చింది. ఆయన సలహాలు విన్నోడెవడూ బాగుపడలేదు అని పెద్ద పత్రికాధిపతి అన్నట్టు చెబుతున్నారు. అది నిజమో కాదో తెలియదు. కానీ విద్వేషోన్మాదం ఎప్పుడూ ఎవరికీ మేలు చేయలేదు, చేయదు. వాళ్లు ఎవరికయినా భష్మాసురులవుతారు. చంద్రబాబు వదిలించుకోవాల్సింది ఇంట్లో పనిచేసే తెలంగాణ పనిమనుషులను, సిబ్బందిని, పోలీసులను కాదు, ఎప్పుడూ వంకర ఆలోచనలు చేసే సలహాదారులను. చంద్రబాబుకు సంకటం వచ్చింది బయటివాళ్లవల్ల కాదు, తన మనుషులు అనుకున్న తమ్ముళ్ల నుంచి.
మరొక్క అంశం… ఇప్పుడు చంద్రబాబు ఇరుక్కునటువంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రో, మంత్రులో ఇరుక్కుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వారి చానెళ్లు ఎలా వ్యవహరించేవి? భూమ్యాకాశాలు ఏకం చేసి టీఆరెస్ ప్రభుత్వం దిగిపోవాలని కత్తికట్టి నాట్యం చేసేవి. ఉన్నవీ లేనివీ పోగేసి అన్ని గుదిగుచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతగా నగుబాటుపాలు చేయాలో అంతగా నగుబాటుపాలు చేసేవి. చూశారా తెలంగాణ వాళ్లకు పరిపాలించుకోవడం రాదు. తెలంగాణ విఫలమవుతోంది చూడండి అని ప్రచారం చేసేవి. నిన్న మొన్న కూడా కొందరు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల మీద చిన్న చిన్న విషయాలకే రోజంతా పేరిణి శివతాండవం చూపించిన ఈ పత్రికలు, చానెళ్లు ఇంత పెద్ద నేరం జరిగితే ఎందుకు తేలుకుట్టిన దొంగల్లా, కుడితిలో పడిన బల్లుల్లా వ్యవహరిస్తున్నాయి. ఆ పత్రికలు ఇప్పుడు చంద్రబాబు పక్షాన రోజూ డిఫెన్సు ఆడుతున్నాయి. చంద్రబాబును సమర్థించడానికి, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. టాపింగ్ ఎలా తప్పో వాదిస్తున్నాయి. తెలంగాణ పోలీసులు చేసిన ఆపరేషనులో తొర్రలు కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. దొంగతనం చేసిన వారిని వదిలేసి, దొంగను పట్టుకున్నవారి గురించి వేలెత్తి చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ ఆంధ్ర అనుకూల స్వభావాన్ని ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శిస్తున్నాయి. ఈ పత్రికలు ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి తమ వార్తలను వండుతున్నాయనడానికి ఇంతకంటే నిదర్శం ఏముంటుంది? నిజానికి ఎవరేం చేసినా తెలంగాణ ఏర్పాటు ఎన్నటికీ విఫల ప్రయోగం కాజాలదు. స్వరాష్ట్ర ఫలితాలను ఇప్పటికే చవిచూస్తున్నది. భవిష్యత్తంతా తెలంగాణదే.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..