-వరద బాధితులకు రక్షిత మంచినీటి సరఫరా
-80 నీటిశుద్ధి యంత్రాలను పంపిన ప్రభుత్వం
-ఆరు లక్షల మంది బాధితులకు ఆ నీరే ఆధారం
-చేతులెత్తి మొక్కుతున్న కశ్మీరీ ప్రజలు
ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అనే సామెతకు నిలువెత్తు నిదర్శనమయ్యారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. కనీవినీ ఎరుగని వరదలతో త్రాగడానికి చుక్క మంచినీరు లేక అవస్థలు పడుతున్న కాశ్మీర్ ప్రజలకు ఆర్వో (రివర్స్ ఆస్మోసిస్) రక్షిత మంచినీటి పరికరాలను పంపి ఆపద్భాంధవుడయ్యారు. మంచినీళ్లు, ఆహారంకోసం అవస్థలు పడుతున్న కశ్మీరీలను ఆదుకొనేందుకు వెంటనే స్పందించిన కేసీఆర్ సైనిక విమానం ద్వారా రూ. ఏడుకోట్ల విలువైన ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్లను శ్రీనగర్‌కు పంపారు. అవి అందిస్తున్న నీరే ఇప్పుడు ప్రజలకు జీవనాధారమైంది.
మంచినీళ్ల రూపంలో ప్రాణదానం చేసిన కేసీఆర్‌కు కాశ్మీర్ వరద బాధితులు చేతులెత్తి మొక్కుతున్నారు. కశ్మీరీలకు తాగటానికి చుక్క నీరు కూడా పనికిరాని పరిస్థితుల్లో రక్షిత మంచినీటిని అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. సైన్యం కొన్ని ప్రాంతాల్లో వాటర్ బాటిళ్ళను హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్నా అవి కొద్దిమందికి మాత్రమే అందాయి. ఆహార పొట్లాలు అన్ని ప్రాంతాలకు చేరుతున్నా తాగడానికి మాత్రం నీరు దొరకలేదు.
ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ నీటిసరఫరా ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్‌తో మాట్లాడి మొదట 25 వాటర్ ప్లాంట్లను గంటల వ్యవధిలోనే శ్రీనగర్‌కు చేర్చారు. ఆ తర్వాత మరో 30 ప్లాంట్లను పంపారు. ఇటీవల మరో 25 ప్లాంట్లను తరలించి శుద్ధమైన నీటిని అందిస్తున్నారు. రూ.15 లక్షల విలువైన ఒక్కో ప్లాంటు గంటకు వెయ్యి లీటర్ల నీటిని శుద్ధిచేయగలదని స్మాట్ సంస్థ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి టీ మీడియాకు తెలిపారు.
రేయింబవళ్ళు డీజిల్ జనరేటర్ ద్వారా నీటిని ఉత్పత్తి చేస్తూ బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. సుమారు వెయ్యి కాటన్ బాక్సుల వాటర్ బాటిళ్లు, రెండులక్షల వాటర్ ప్యాకెట్లను బాధితులకు పంపిణీ చేశామని తెలిపారు. త్రాగడానికి మాత్రమేకాక వంటలకు కూడా నీటిని అందిస్తున్నామన్నారు. బక్కెట్ నీళ్ళు దొరికితే రూ.వెయ్యి ఇవ్వడానికైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరికీ ఉచితంగా పరిశుభ్రమైన నీటిని ఇవ్వగలిగాం.
ఆ నీటిని బాటిళ్ళలో నింపుకుని వెళ్తున్న ప్రజలు మా ఇంజినీర్లు, టెక్నీషియన్ల కాళ్ళకు దండం పెట్టి మీరు దేవుళ్ళు సాబ్ అని కీర్తించారు. మా సిబ్బందికి ఆహారం ఇచ్చి కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. మొదట మన ప్లాంట్ల ద్వారా మంచినీరు దొరకగానే అక్కడికక్కడే తాగాలన్న వారి ఆరాటాన్ని చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యమేసింది. ఎన్ని రోజుల నుంచి నీటికోసం పడిగాపులు కాస్తున్నారో. నీళ్లు తీసుకెళ్లేటప్పుడు వారి ముఖంలో ఆనందాన్ని చూస్తే మా కండ్లు చెమర్చాయి అని కరుణాకర్‌రెడ్డి వివరించారు. సుమారు ఆరు లక్షల కుటుంబాలకు తెలంగాణ అందించిన వాటర్‌ప్లాంటే ప్రాణాధారంగా మారాయని తెలిపారు.
ప్రాణాలు కాపాడే దేవదూతల్లా వచ్చారు: స్థానికులు
రోజుల తరబడి ఆకలి, దప్పులతో అలమటిస్తున్న సమయంలో స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు దేవదూతల్లా వచ్చారని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వరదనీటిలో చిక్కుకుపోయిన మాకు దిక్కు లేదనుకున్నాం. కానీ తెలుగు అక్షరాలతో ఒక వ్యాన్ కనుచూపు దూరంలో కనిపించింది. అది ఏ భాషో కూడా మాకు తెలియదు. మమ్మల్ని కాపాడటానికి ఏ సైనికులో, ప్రభుత్వ సిబ్బందో వచ్చారనుకున్నాం. కానీ కొద్దిసేపటి తర్వాత బాటిళ్ళలో నీటిని నింపి ఇస్తున్నప్పుడు అది మంచినీటి యంత్రమని అర్థమయ్యింది.
అర్థంకాని భాషలో రాసిన అక్షరాలున్న ట్రక్కు కనిపించినప్పుడల్లా అది మా ప్రాణాలను కాపాడడానికి వచ్చిన ఒక దైవదూత అనే భావిస్తున్నాం. ఏ బ్రాండ్ వాటర్‌బాటిలైనా ఇంత స్వచ్ఛమైన నీటి ముందు దిగదుడుపే అని మజీద్ అనే స్థానికుడు తన స్వీయానుభవాన్ని వివరించాడు. పద్‌షాహీబాగ్ కాలనీలో ప్లాంట్‌ను నడుపుతున్న ఇంజినీర్ అజీజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సకాలంలో మంచి నిర్ణయం తీసుకొని బాధితులకు ప్రాణసమానమైన మంచినీటిని అందించిందన్నారు. మొబైల్ ఫోన్లు, ఎమర్జెన్సీ లైట్లలో చార్జింగ్ లేక అవస్థలు పడుతున్న స్థానికులు ప్లాంటువద్ద ఉన్న జనరేటర్ సహాయంతో రీఛార్జింగ్ చేసుకొనేవారని, కేవలం నీరు మాత్రమే కాకుండా బాధితుల విద్యుత్ అవసరాలను కూడా కొంతమేరకు తీర్చగలిగామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వయంగా తమ ప్లాంట్ దగ్గరకు వచ్చి అభినందించారని, ఆ వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. అంటువ్యాధులు, నీటిద్వారా వ్యాధులు సోకకుండా చూసేందుకు మరింత మంది పారిశుద్ధ్య సిబ్బంది అవసరమని, అందుకోసం హైదరాబాద్ నుంచి కొందరిని రప్పించి నాలుగైదు నెలలు సేవలందించాలనుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, గ్రామీణ నీటిసరఫరాశాఖ కార్యదర్శి రేమాండ్ పీటర్, ఇంజినీర్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి, సైనిక విమానం కెప్టెన్ గోపీనాథ్ తదితరుల సహకారంతోనే వరద బాధితులకు సేవ చేయగలిగామని చెప్పారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..