ఫొటో: కరీంనగర్ లో బతుకమ్మను పేర్చుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
—
కరీంనగర్ లో పూల జాతర పోటెత్తింది. వందలాది రంగు రంగుల బతుకమ్మలతో జిల్లా కేంద్రం పూల వనమై పులకించింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు తలలపై బతుకమ్మలు ఎత్తుకుని నగరాన్ని పూల వాకిళ్ళుగా మార్చారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. మైదానం మధ్యలో బతుకమ్మలను పెట్టి వలయాకారంగా మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ తోటి మహిళలతో పాడించారు.
బతుకమ్మ ఆట పాటల సంబురాలు ముగిసిన అనంతరం కవిత మాట్లాడుతూ అంతరించిపోతున్న తెలంగాణ సాహితీ, సాంస్కృతిక, కళారంగాలను పునరుజ్జీవింపచేయడానికి తెలంగాణ జాగృతి నిరంతర కృషి చేస్తుందన్నారు. బతుకమ్మకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించేందుకే తెలంగాణలోని 10 జిల్లాల్లో బంగారు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రాంతంలో పీరీలు, దసరా, గణపతి, ఉగాది, దీపావళి పండుగలను సామూహికంగా జరుపుకుంటామని వివరించారు.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నల్లికుట్లోడని కవిత వ్యాఖ్యానించారు. సీమాంధ్రులు ఉద్యమాలు చేస్తే ఒక్కరిపై కూడా లాఠీ దెబ్బ పడకూడదని సీఎం హుకుం జారీ చేసారని, స్వయంగా డీజీపీ కిరణ్ ఆయన బండారం బయట పెట్టారని తెలిపారు. కానీ తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులపై లాఠీలు విరిగాయని ఆవేదన వ్యక్తం చేసారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ లో చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరంగా వుందని, ఇప్పటికైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడవద్దని జగన్, చంద్రబాబు, సీఎం కిరణ్ లకు ఆమె విజ్ఞప్తి చేసారు.