శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా కల్తీపాల సరఫరా, ప్రైవేట్ స్కూళ్ళలో అధికఫీజుల వసూలు, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై విపక్షాలు ప్రశ్నించగా ఉపముఖ్యమంత్రి రాజయ్య సమాధానం ఇస్తూ కల్తీపాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కల్తీపాల వ్యవహారంపై కోర్టులో విచారణ నడుస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాజయ్య వెల్లడించారు. హెరిటేజ్ విషయంలో రెడ్యానాయక్, రవీందర్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు.
కల్తీ పాల వల్ల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని, కల్తీపాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, చిన్నారెడ్డి కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ పాలను కల్తీ చేసినట్లుగా రిపోర్టులు అందుతున్నాయని, పక్క రాష్ట్రంలో హెరిటేజ్ సంస్థపై బ్యాన్ విధించారని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ, హెరిటేజ్ పాల ఉత్పత్తిపై అనుమానాలు ఉన్నాయని అనగానే వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కల్తీ పాలను సరఫరా చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.