mt_logo

రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

మంగళవారం టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌నుకలిసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని, దీనికోసం కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో నీరు, విద్యుత్ లాంటి సమస్యలతో పాటు మరికొన్ని ఇతర అంశాలపై ఎంపీలు హోంమంత్రితో చర్చించారు.

సమావేశం అనంతరం ఎంపీ జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరునెలలు కావస్తున్నా ఇంకా పలు సమస్యలు అలాగే ఉన్నాయని, తాము చేసిన విజ్ఞప్తుల పట్ల హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులనుండి రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పామని, త్వరలో అన్ని సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాలని, 4000 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తిచేయడంతో పాటు, రాష్ట్రంలోని రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోరామని జితేందర్ రెడ్డి చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయహోదా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, గిరిజన, ఉద్యానవన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, కృష్ణా జలాల వివాదంపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. కేంద్ర హోంమంత్రిని కలిసిన వారిలో ఎంపీలు బీ వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *