ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కాకతీయ ఉత్సవాలను రూ. 25 కోట్లతో ఘనంగా నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. వేల సంఖ్యలో చెరువులు నిర్మించి అన్నం పెడుతున్న కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనం ప్రపంచానికి చాటేలా నిర్వహించుకుందామని, ఈ ఉత్సవాలను వరంగల్ జిల్లాకే పరిమితం కాకుండా తెలంగాణ పది జిల్లాలలోనూ జరిపిస్తామని అన్నారు. లక్నవరం, రామప్ప, పాకాల, ఘనపురం లాంటి చెరువులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఉత్సవాల సందర్భంగా రెజ్లింగ్ పోటీలు, పడవ పందాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు.
కవి సమ్మేళనాలు, అవధానాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య అంశాలలో పోటీలు నిర్వహించాలని సూచించారు. కళాకారులు, క్రీడాకారులు, డాక్టర్లు, చరిత్రకారులు అందరికీ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వరంగల్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని, లేజర్ షోలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరోజు వరంగల్ లోనే గడిపే విధంగా ఏర్పాట్లు చేస్తామని, అలాగే పార్లమెంటులో ఝాన్సీరాణి ఫొటో ఉన్నట్లుగానే రాణి రుద్రమదేవి చిత్రపటం ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామని సీఎం చెప్పారు.