నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి(కాకా) సంస్మరణ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరై పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాకా శ్రమజీవి, సమరశీలి.. ఆయన జీవితం అందరికీ ఆదర్శం.. కార్మికులకు పెన్షన్ స్కీం తెచ్చిన ఘనత ఆయనదని ప్రశంసించారు. పని చేయడంలో గొప్ప నేర్పరని, జీవితాంతం నిబద్ధతతో పని చేసిన వ్యక్తి కాకా అని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఏడాది కాకా జయంతి, వర్ధంతిని నిర్వహిస్తామని, హైదరాబాద్ లో కాకా మెమోరియల్ భవనాన్ని ఏర్పాటు చేస్తామని, త్వరలోనే మెమోరియల్ కు శంకుస్థాపన చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ మెమోరియల్ ను అద్భుతంగా చిరస్థాయిగా నిలిచేలా ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.
తెలంగాణను కోరుకున్న వారిలో కాకా ఒకరని, తెలంగాణ కల సాకారమయ్యాకే తుదిశ్వాస విడుస్తానని చెప్పారన్నారు. కాకాది 65 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమని, ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని సీఎం కొనియాడారు. నిరుపేదల గుండె బలమై నిలిచిన వ్యక్తి గుడిసెల వెంకటస్వామి.. అలుపెరుగని పోరాటయోధుడు.. ఎంత స్మరించినా తక్కువే అని, సమైక్య రాష్ట్రంలో ఎంతోమంది తెలంగాణ నేతల గొప్పతనం మరుగున పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.