తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అంతులేకుండా పోతోంది. నీళ్ళు, కరెంట్ లపై రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్న సీమాంధ్ర ప్రభుత్వం తాజాగా కార్మికశాఖలో వందల కోట్లు లూటీ చేసి అడ్డంగా దొరికిపోయింది. రూ. 420 కోట్లను విజయవాడలోని ఒక బ్యాంకుకు తరలించినట్లు, ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నిధులు తరలించినట్లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారే స్వయంగా పేర్కొన్నారు. రెండురాష్ట్రాల ఉమ్మడి నిదులనుండి దాదాపు రూ. 609 కోట్లను విజయవాడ బ్యాంకుకు తరలించే ప్రయత్నంలో దొంగచాటుగా ఇప్పటికే రూ. 420 కోట్లను తరలించారు. మరో రూ.200 కోట్లను తరలించడానికి ప్రయత్నం చేస్తుండగా తెలంగాణ కార్మికసంఘాలు అప్రమత్తమవ్వడంతో కుట్ర బయటపడింది.
ఏపీ భవన నిర్మాణ, ఇతర సంక్షేమ బోర్డు సెక్రెటరీ మురళీసాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావు ఆధారాలు దొరక్కుండా రాత్రికి రాత్రే ఫైళ్ళను తరలించారని హిందూ మజ్దూర్ యూనియన్ కార్మికశాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించగా కార్మికశాఖ కమిషనర్ అశోక్ కుమార్ తనిఖీ నిర్వహించారు. అయితే ఎక్కడా ఫైళ్ళు కనిపించకపోవడంతో తెలంగాణకు చెందిన నిధులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్ళు మాయమైనట్లు కమిషనర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య మురళీ సాగర్ ను అరెస్టు చేసి విచారణ జరపగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే రూ. 420 కోట్లను విజయవాడ బ్యాంకుకు బదిలీ చేశానని అసలు నిజం బయటపెట్టారు.