గత కొన్ని రోజులుగా టీడీపీని వీడి గులాబీ గూటికి చేరుతారని భావిస్తున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీఎం కేసీఆర్ తో ఈరోజు టీటీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని, తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, సమావేశాల పేరుతో పిలిచి టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ బాధ్యతలు లోకేష్ కు అప్పగించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణలో టీడీపీకి నాయకత్వమే లేదా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ సాధన కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నామని పేర్కొన్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తదితరులు టీఆర్ఎస్ లో చేరనున్నారు.