జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుగుతున్న నేపథ్యంలో జూన్ 1 అర్ధరాత్రి నుంచే తెలంగాణ పదిజిల్లాల్లో సంబరాలు ప్రారంభిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. 60 సంవత్సరాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న సందర్భంలో ఊరూ, వాడా, పల్లె, పట్నం, ప్రతీ ఇంటిలో పండుగ చేసుకుందామని తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
శుక్రవారం టీ జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ, చారిత్రక సందర్భాన్ని చరిత్ర గుర్తుంచుకునేలా వేడుకలు జరపాలని, విజయోత్సవ ర్యాలీలు, సంబరాలతో తెలంగాణ దద్దరిల్లాలని ఆయన అన్నారు. జూన్ 1న రాత్రి 11 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 12గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి టీ జేఏసీ జెండాను ఎగురవేస్తామని, అప్పటినుండి సంబరాలు ప్రారంభమైనట్లుగా ప్రకటిస్తామని చెప్పారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పత్రికల్లో వస్తున్న వార్తలను కోదండరాం ఖండించారు. “కేసీఆర్ మావాడు. ఆయనను ఎప్పుడైనా కలువగలుగుతాం. ఇప్పుడు ఆయన ప్రభుత్వ ఏర్పాటులో బిజీగా ఉన్నారు. ఆయనను తర్వాత కలుస్తాం. అనవసర విషయాలపై రాద్ధాంతం చేయొద్దు” అని మీడియాతో అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కోదండరాం ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోదండరాం స్పందిస్తూ, రెచ్చగొట్టడం మా డిక్షనరీలోనే లేదని, అలా రెచ్చగొట్టడం చంద్రబాబుకే తెలుసని, ఎంత రెచ్చగొట్టినా తొణకకుండా, సహనంతో చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయంగా వ్యవహరించడం తెలంగాణ వారికి తెలుసని అన్నారు. ఇన్నేళ్ళు కష్టపడి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ కలుపుతానని తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరిచేలా మాట్లాడిన బాబు వ్యాఖ్యలను రెచ్చగొట్టేవిగానే తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకున్నారని, రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందన్న వాస్తవాన్ని అంగీకరించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని కోదండరాం పేర్కొన్నారు.
తెలంగాణ జేఏసీ కో చైర్మన్ సీ విఠల్ ను సీమాంధ్రకు బదిలీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే విఠల్ ను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తే టీజేఏసీ సహించదని, ఉద్యోగులతో కలిసి ఉద్యమాల్లో పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీ జేఏసీ కన్వీనర్ జీ దేవీప్రసాద్, జేఏసీ కో చైర్మన్ సీ విఠల్, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కే. రఘు తదితరులు పాల్గొన్నారు.