మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం జిల్లా ప్రథమ మహాసభ కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి జర్నలిస్టుకూ పని చేసే చోట 120 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని, హెల్త్ కార్డులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చే పట్టుదల ఉన్న నాయకుడు కేసీఆర్ అని, ఆయన రోజూ రెండుగంటల పాటు 12 దినపత్రికలు చదువుతున్నారని, వాటి ఆధారంగా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు తమకు అదేశాలిస్తున్నారని వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు నెలలు కావస్తున్నా అధికారుల విభజన ఇంకా పూర్తి కాలేదని, ఈ విషయంలో కేంద్రానికి పది లేఖలు రాశామని, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోడీని కలిసి విన్నవించినా కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి 145 మంది ఐఏఎస్ లు అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 60 మంది మాత్రమే ఉన్నారని, వారిలో 10 మందికి పైగా ఏపీ ప్రభుత్వంలో నియమించబడ్డారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలన ఎలా ముందుకు సాగుతుందని, అధికారుల విభజన పూర్తి కాకపోవడంతో పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, దేవీప్రసాద్, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.