ఇకపై మహిళలు కూడా బొగ్గుగనుల్లో ఉద్యోగాలు చేయొచ్చు. 1952 లో గనుల్లో మహిళలు పనిచేయడం నిషేధించబడగా, తాజాగా 67 ఏండ్ల తర్వాత మహిళలు కూడా బొగ్గు గనుల్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర కార్మిక శాఖ గనుల చట్టాన్ని సవరించింది. దీంతో తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో విధులు నిర్వహించే అవకాశం మహిళలకు లభించనుంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 600కు పైగా ఉద్యోగాల భర్తీకి సింగరేణి, కోల్ ఇండియా నిర్ణయం మేరకు మహిళలకు అవకాశం కల్పించనుంది.
సింగరేణిలో మహిళా ఉద్యోగులు కేవలం 2.4 శాతమే ఉన్నారు. 56,282 మంది కార్మికులు ఉండగా, అందులో 1,362 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వీరు కూడా కార్యాలయాల్లో క్లర్క్, క్యాంటీన్ వర్కర్లు, స్వీపర్లు తదితరులు. సింగరేణిలో బొగ్గు వెలికితీయడం మాత్రమే కాకుండా వివిధ ఉద్యోగావకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో 450 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంస్థ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలా పలు విభాగాల్లో మొత్తం కలిపి 7,500 పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. అందులో కూడా ఉపరితలంలో పనిచేసే ఉద్యోగాలకు మాత్రమే మహిళలకు అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ గనుల్లో పనిచేసేందుకు మహిళలకు అవకాశం కల్పించడం శుభపరిణామమని, కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని, పూర్తి మార్గదర్శకాల కోసం వేచి చూస్తున్నామని అన్నారు. కోల్ ఇండియా నిర్ణయం కూడా ముఖ్యమే అని, ఇప్పటికే 600 పైగా ఖాళీలు గుర్తించామని, ఉద్యోగాల భర్తీలో స్థానికత అంశంపై కొత్తగా వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుచేసే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు.