సేంద్రియ విప్లవం దిశగా అందరూ అడుగులు వెయ్యాలని, రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మహిళా, శిశు సంక్షేమశాఖలు సంయుక్తంగా శిల్పారామంలో నిర్వహించిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ముగింపు వేడుకలకు కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషకరమని, విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వినియోగించడంతో ప్రతి వస్తువూ కల్తీమయమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డయాబెటిస్, ఒబేసిటీ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు.
కల్తీలేని వ్యవసాయోత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నదని, మహిళా రైతులను అభివృద్ధి చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ హామీ ఇచ్చారు. మేళాను ఐదు రోజులపాటు విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి, సిబ్బందిని ఎంపీ కవిత అభినందించారు. ఈ మేళాలో 15 రాష్ట్రాల నుండి మహిళలు తెచ్చిన ఉత్పత్తులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 17 రాష్ట్రాల నుండి వందమందికి పైగా మహిళా రైతులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. మేళా సందర్భంగా చిత్రలేఖనం, సాహిత్యం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.