By: V. ప్రకాష్
‘తెలంగాణ రాక తప్పదు. తెలంగాణను తప్పకుండ జూస్త. నాకైతే ఏం సందేహం లేదు’… అని నమ్మిన జయశంకర్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన ఈ చరిత్రాత్మక శుభసందర్భంలో మన మధ్యన లేకపోవడం బాధాకరం. ఇంతకీ, ఆయన కలలుగన్న తెలంగాణ ఎలాంటిది? ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే తెలంగాణలో ‘ట్రెమండస్ ఛేంజస్ ఉంటయ్’ అని ఆశించారాయన. ఆయన కోరుకున్న మార్పులేమిటి? అవి ఏ విధంగా వస్తాయి?
తెలంగాణ ప్రజల కల సాకారమై ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన శుభ సందర్భం ఇది. పదమూడేళ్ల మలిదశ ఉద్యమంలో ప్రధానంగా వినిపించిన జన నినాదం ‘ఆత్మగౌరవంతో కూడిన స్వయం పాలన’ ఆవిష్కృతమయ్యిందీవేళ. మహోన్నతమైన తెలంగాణ చరిత్రను మలుపు తిప్పుతూ, నవశకానికి నాంది పలికిందీ మహత్తర చారిత్రక ఘట్టం. ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా ఉంటూ- భావజాల వ్యాప్తికి, మహోద్యమ నిర్మాణానికి, రాజకీయ ప్రక్రియకు మార్గదర్శిగా, వెన్నెముకగా నిలిచినవారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ఆయన ఎలాంటి తెలంగాణను కోరుకున్నారు? దేనికోసం, ఎవరికోసం? ఆయన దృష్టిలో పునర్నిర్మాణం అంటే ఏమిటి, అది ఎలా ఉండాలి? సుదీర్ఘకాలం ఉద్యమాల బాటలోని ఆయనతో చర్చలు, ఆయా సమయాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను మననం చేసుకోవడం ప్రస్తుతం ఎంతైనా అవసరం. పాలనా బాధ్యతల నిర్వహణలోని నేతలకు వాటిని మరోసారి గుర్తుచేయడం అత్యంత సందర్భోచితం.
‘ఇంతకాలం నిర్లక్ష్యానికి గురై అణగారిన వర్గాలకు ఇకనైనా అభివృద్ధిలో వాటా దక్కాలి. నేను కోరుకునేది అలాంటి తెలంగాణనే. ఆ లక్ష్యాన్ని సాధించాల్సిందే…’ అంటూ జయశంకర్ చివరి సందేశమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే, ఎంతో దయనీయంగా మారిన రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన ఆశించారు. ట్రైబ్యునళ్ల తీర్పుల వల్ల లభించే వాటా నదీజలాలు తప్పక దక్కుతాయని ఆకాంక్షించారు. కృష్ణా, గోదావరి నదులపై అవసరమైన ఆనకట్టలు, బ్యారేజీలు, ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే వీలుంటుందని భావించారు. శిథిలమైన గొలుసు చెరువుల వ్యవస్థను తిరిగి నిర్మించుకోవచ్చని, చెరువుల్లో పూడిక తీయడంతో భూగర్భజలాల పరిమాణం సమృద్ధిగా పెరుగుతుందని అభిలషించారు. పాడైన బావులతో విధ్వంసమైన పల్లెల్లో జీవకళ కనిపిస్తుందని, బీళ్లుగా మారిన తెలంగాణ భూములు సస్యశ్యామలమై రైతుల ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగవుతుందనీ జయశంకర్ ఆశ, ఆకాంక్ష.
ఆర్థిక పునర్నిర్మాణం
తెలంగాణ పునర్నిర్మాణంలో గ్రామీణార్థిక వ్యవస్థ కీలకమని జయశంకర్ భావన. బలహీనవర్గాల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. ఆయన అభిప్రాయంలో బలహీనవర్గాలంటే- ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికపరంగా నిర్లక్ష్యానికి గురైనవారు. ఈ వర్గాల ప్రజలు ఐక్యమై అభివృద్ధిలో పాల్గొని వాటా పొందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం లభిస్తుందని అనేవారు. ఏడెనిమిది దశాబ్దాలుగా ఇక్కడ వివిధ ప్రజా పోరాటాలు, ఉద్యమాల వల్ల సామాజిక చైతన్యం ఉన్నతస్థాయిలో ఉంది. అందుకే నవ తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక న్యాయం సుసాధ్యమవుతుందని భావించారాయన. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి అంశాలు ఆర్థిక పునర్నిర్మాణంలో కీలకమనేవారు. ఆర్థికరంగంతో పాటు వ్యవసాయరంగంలో సమూలమైన మార్పులు రావాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో భూసంస్కరణల అవసరం ఉందని, వ్యవసాయం చేస్తున్నవారికి భూమి దక్కేలా ఈ సంస్కరణలు ఉండాలని కోరారు. ఈ రంగంలో దోపిడి పోవాలని, రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి సరైన ధర లభించేలా ప్రభుత్వ చర్యలుండాలని ఆయన కాంక్ష. రైతుకు సాగునీటిని అందించే బాధ్యత సర్కారుదేనన్నారు.
వ్యవసాయాధారిత పరిశ్రమలు
ఆర్థిక పునర్నిర్మాణంలో భాగంగా, గ్రామాల్లో వ్యవసాయాధార పరిశ్రమలు ఏర్పాటుచేయాలని జయశంకర్ సూచించారు. ఆయా గ్రామాల్లోని యువతకు అవసరమైన వృత్తివిద్యల్లో శిక్షణనిచ్చి భాగస్వాములను చేయాలన్నారు. దీంతో బలహీనవర్గాల భాగస్వామ్యమున్న సంస్కృతి వికసిస్తుందని అనేవారు. పల్లెకు తల్లిగా ఉండే చెరువుపై సకల వృత్తులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి ఉంటాయి. చెరువులు శిథిలం కావడంతో గ్రామీణ వృత్తులు చాలావరకు నిరాదరణకు గురై అంతరిస్తున్నాయి. వృత్తి పనుల్లో తరతరాలుగా ఉన్నవారు మరో వృత్తిలోకి మారడం అంత తేలికైన పని కాదు. తెలంగాణ రాష్ట్రంలో వృత్తులను ఆధునికీకరించాలని, వృత్తి పనివారికి నైపుణ్యం మెరుగుపడే శిక్షణనిచ్చి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని సూచనలిచ్చారు. ఆర్థిక సౌకర్యాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ, పల్లె వృత్తులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పల్లె నుంచి పని కోసం వలసలుపోయే దుస్థితిని మార్చాలి. కుటీర పరిశ్రమలను, వ్యవసాయాధార పరిశ్రమలను ఏర్పాటుచేయడం వల్ల ఆత్మహత్యలు, వలసలను నివారించగలమనీ ఆయన నమ్మకం.
గ్రామీణ విద్య, వైద్యం
ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన జయశంకర్, కాకతీయ విశ్వవిద్యాలయ ఉప కులపతి (వైస్-ఛాన్సెలర్) స్థాయికి ఎదిగారు. విద్యారంగంతో సుదీర్ఘకాల అనుబంధం కలిగిన ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో ఆ రంగంలో ఎలాంటి మార్పులు అవసరమన్నదానిపై చాలా స్పష్టత ఉండేది. పాఠ్యాంశాలను సమూలంగా మార్చాలనేవారు. చరిత్ర పాఠ్యాంశాలను వక్రీకరిస్తున్నారని, అర్ధసత్యాలూ అసత్యాలను పిల్లలకు బోధిస్తున్నారని నిరసించారు. జీవితానికి ఉపయోగపడే వృత్తివిద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం కలిగించేవాటిని వారికి అర్థమయ్యే భాషలోనే బోధించాలని సూచించారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లలకోసం వివిధ స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటుచేసి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలన్నారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి తప్ప పనిలో కాదని, ఒకటో తరగతి నుంచి ఉన్నతవిద్య దాకా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని భావించేవారు. కులమతాలకు అతీతంగా విద్యాభివృద్ధి జరగాలని, బలహీనవర్గాల పిల్లల అవగాహన స్థాయిని పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడి ఆరోగ్యమూ ప్రభుత్వ బాధ్యత అని జయశంకర్ అనేవారు. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా ప్రజలకందించే విధి సర్కారుదే. తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశానికే ప్రథమ ప్రాధాన్యమివ్వాలని భావించారాయన.
పట్టణాభివృద్ధి
భవిష్యత్తులో పట్టణ జనాభా బాగా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రణాళికబద్ధమైన పట్టణీకరణ జరగాలని జయశంకర్ ఆశించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలి. సరైన రోడ్లు వేయాలి. మురుగునీటిపారుదల వ్యవస్థ మెరుగుపరచాలి. మౌలిక వసతులు కల్పించాలి. పలు ఉద్యానవనాలు, క్రీడాస్థలాలు ఉండాలి. ఇరవైనాలుగు గంటలూ తాగునీరు సరఫరా చేయాలి. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక స్థలాలు కేటాయించాలి. ఇలా పద్ధతి ప్రకారం ఆధునిక పట్టణాలను ఏర్పాటుచేయాలని అభిప్రాయపడేవారు. తెలంగాణ పల్లెలనుంచి వలసవచ్చిన కొందరు హైదరాబాద్‌లోని ఖాళీస్థలాల్లో వేసుకున్న గుడిసెలను అప్పట్లో అధికారులు కూల్చివేశారు. ‘వివిధ కార్పొరేట్ సంస్థలకు వందల ఎకరాలు ధారాదత్తం చేస్తున్న పాలకులు తమ ప్రతాపాన్ని పేదలపై చూపుతున్నా’రని బాధపడ్డారాయన. వలస వచ్చిన పేదలకు కనీస వసతిని ప్రభుత్వమే చూపించాలన్నారు. అవినీతికి తావులేని జనరంజకమైన పాలనను ఆయన ఆశించారు.
పారిశ్రామిక ప్రగతి
పారిశ్రామికాభివృద్ధిపై డాక్టరేట్ చేసిన ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఎలా సాగాలనే అంశంపై స్పష్టమైన భావాలుండేవి. బొగ్గునిల్వలు, నీళ్లు, విద్యుదుత్పత్తి, మానవ వనరులు తెలంగాణ గోదావరి తీరప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు… కొత్తగా ఏర్పాటుచేయాల్సిన పరిశ్రమలకు అనువైన ప్రాంతాలన్నారు. లక్షలాది తెలంగాణ యువకులకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని భావించేవారు. సిర్పూర్ సర్‌సిల్క్, రామగుండం ఎరువుల సంస్థ, ఐడీపీఎల్, ఆజంజాహీ మిల్స్ వంటి వాటిని పునరుద్ధరించాలన్నారు. ముడిసరుకు ఎక్కడుందో అక్కడే పరిశ్రమలు ఉండాలన్నారు. అవసరమైన శిక్షణ ఇచ్చి స్థానికులకే ఉద్యోగాలివ్వాలని ఆశించారు. విలువైన ఖనిజ సంపదను సంపన్నుల చేతిలో పెట్టడం మంచిది కాదనీ అనేవారు.
కాళోజీ రాసిన ‘పుటక నీది, చావు నీది- బతుకంతా లోకానిది’ మాటలు జయశంకర్‌కు అక్షరాలా వర్తిస్తాయి. ఆ సిద్ధాంతకర్త ఆశించిన ‘బంగరు తెలంగాణ’ను నిర్మించాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమ రథసారథి, నేడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు.