By: కట్టా శేఖర్‌రెడ్డి
ఇప్పుడు ఎజెండాలో ఉన్న సమస్యలేవీ తెలంగాణ ప్రభుత్వంతో వచ్చినవి కాదు. చాలా సమస్యలు దీర్ఘకాలికంగా సంక్రమించినవి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికతో, కార్యాచరణతో పని మొదలు పెట్టింది. పారిశ్రామికాభివృద్ధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగాలను ప్రాధాన్య రంగాలుగా ఎంచుకుని పనులు ప్రారంభించింది. వాటి సాధ్యాసాధ్యాలు, జయాపజయాలు తేలడానికి సమయం ఇవ్వాలి.
శాసనసభ బడ్జెటు సమావేశాలు ఇన్ని రోజులపాటు జరగడం, ఇన్ని గంటలపాటు చర్చ చేయడం, ఇంత సావధానంగా అన్ని పక్షాలూ చర్చలో పాల్గొనడం బహుశా ఇటీవలి చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. కొత్త రాష్ట్రమయినా మన అసెంబ్లీ చాలా పరిణతిని ప్రదర్శించింది. తెలుగుదేశం ప్రతినిధులు ఒకరిద్దరి పిడకల వేట కార్యక్రమాన్ని మినహాయిస్తే అర్థవంతమైన చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలా గంభీరంగా, సంయమనంతో వ్యవహరించారు.
భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి సంబంధించి తాను అనుకుంటున్నదేమిటో, చేస్తున్నదేమిటో, చేయదల్చుకున్నదేమిటో సభలో అందరిముందు అరమరికలు లేకుండా ఆవిష్కరించారు. ఇటీవలికాలంలో ఏ ముఖ్యమంత్రీ వెచ్చించనంత సమయం ఆయన అసెంబ్లీకి వెచ్చించారు. ఉద్యమకాలంలో దూకుడుగా శరపరంపరగా ప్రత్యర్థులపై స్పందించిన కేసీఆర్, ఇప్పుడు అసెంబ్లీలో అందరి విమర్శలు, సమస్యలు విని సావధానంగా స్పందించడం కొత్తపరిణామం. ఏదో తోచింది మాట్లాడడం కాకుండా అన్ని అంశాలపై సాకల్యంగా సన్నద్ధమై, ఒక స్పష్టమైన, లోతైన అవగాహనతో ఆయన సభను మెప్పించే ప్రయత్నం చేశారు. మాటకు మాటలు అస్సలు లేవని కాదు. కొంతమంది మంత్రులు సమావేశాల తొలిరోజుల్లో ఉద్యమకాలంలో మాదిరిగానే ఒంటికాలిపై లేచి ప్రతిపక్షాల దాడులను తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత్తర్వాత అందరూ చాలా ఓపికతో చర్చల్లో పాల్గొనడం, సమాధానాలు చెప్పడం కనిపించింది.
మంత్రులు చాలా మంది కొత్తవాళ్లయినా తమ తమ శాఖలపై పూర్తి అవగాహనతో, అంతే గంభీరంగా సభలో మాట్లాడారు. ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య వంటివారు చాలా అనుభవజ్ఞుల్లాగా సభను అలరించారు. తడబడిన సందర్భాలు లేవు. ఇది కొత్త అసెంబ్లీ అనిపించలేదు. చాలా అనుభవజ్ఞులతో కూడిన సభగా రాణించింది. సభలో సగానికిపైగా తొలిసారి అసెంబ్లీకి వచ్చిన సభ్యులు ఉన్నప్పటికీ అత్యధిక మంది ఏదో ఒక అంశంపై చర్చలో పాల్గొనడం ఈ సమావేశాల ప్రత్యేకత. మునుపెన్నడూ సభలో మాట్లాడే అవకాశాలు రాని నియోజకవర్గాల ప్రతినిధులు సైతం ఈసారి తమతమ ప్రాంతాల సమస్యలను ప్రస్తావించగలిగారు. తెలుగుదేశంలో కొందరు సభ్యులు తప్ప ప్రతిపక్షాలు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు కె.జానారెడ్డి నిర్మాణాత్మకంగా వ్యవహరించారు. వివిధ సందర్భాల్లో పెద్దరికం చూపించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా విమర్శించాల్సిన చోట విమర్శించారు. సమర్థించాల్సిన చోట సమర్థించారు.
జీవన్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటివారు కూడా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే సమయంలో సంయమనమూ పాటించారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలోనే నగుబాటు కాకూడదన్న స్పృహ చాలా మంది నాయకుల్లో కనిపించింది. రాజకీయాలు తేల్చుకునేందుకు ఇది సమయం కాదన్న జాగ్రత్త ప్రతిపక్ష సభ్యుల్లో వ్యక్తమయింది. పిడుగుకు బియ్యానికి ఒకే మంత్రం జపించే కొంతమంది అల్పజీవులు సభా కార్యక్రమాలకు అవరోధాలు కల్పించాలని చూసినా సభలోని మరే పక్షమూ వారి వెంట వెళ్లలేదు. బయటివారు ఎవరో ఆడిస్తే ఆడేవారు, రెచ్చిపోండి అని ఎవరో ఎగదోస్తే ఎగిరెగిరి విమర్శలు గుప్పించేవారు తెలంగాణ సమాజంలో రాణించలేరని ఈ సమావేశాలు రుజువు చేశాయి. టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు అసభ్యతకు, సభ్యతకు మధ్య సంధిచేయలేక సతమతమయ్యారు. ప్రభుత్వంపై, అధికారపక్షంపై ఉన్నవీ లేనివీ ప్రభుత్వంపై గుప్పించి అమాతంగా పెద్ద నాయకులైపోదామని భ్రమించేవారికి అసెంబ్లీ సమావేశాలు తగిన స్థానం చూపించాయి. ప్రజలు శాసనసభ్యులను, శాసనసభ్యులు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వమనీ గుర్తించకుండా, తెలంగాణ నాయకత్వానికి, ప్రభుత్వానికి దొరతనం, నియంతృత్వం అంటగట్టాలని చూసే అరాచకులకు ఈ సమావేశాలు గట్టిగానే బుద్ధిచెప్పాయి.
ఇదంతా చంద్రబాబు ఎజెండాను మోస్తున్నవారి పన్నాగం. చంద్రబాబుకు భజన చేస్తున్న ఒక పత్రికాధినేత ఎన్నికల ఫలితాలు వచ్చిన మూన్నాళ్లకే కేసీఆర్‌కు నియంత అని, అరాచకవాది అని సర్టిఫికెట్టు ఇచ్చాడు. ప్రజలెన్నుకున్న నాయకుడికి ఏమాత్రం ప్రజామోదం లేని మనిషి ఈ పేరు పెడతాడు. అదే మంత్రాన్ని టీడీపీ నాయకులు పట్టుకుంటారు. అహంకారాన్ని, నియంతృత్వాన్ని తమ తమ బుర్రలనిండా నింపుకున్నవారు, ఏ వ్యవస్థలనూ గౌరవించనివారు ఎదుటివారికి పేర్లు పెడుతున్నారు. విచిత్రంగా ఇప్పుడు పీపుల్స్‌వార్ కూడా అలాగే అంటున్నట్టు ఒక పత్రికా ప్రకటన ఇటీవల బయటికి వచ్చింది. తీరాచూస్తే అది డూప్లికేట్ అని, మావోయిస్టులకు ఆ ప్రకటనకు సంబంధంలేదని తెలిసింది. అంటే ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో, ఎందుకు ఇది చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర నాయకత్వం తెలంగాణ నాయకత్వానికి వ్యతిరేకంపై ఇంతకాలం వేస్తూ వచ్చిన ముద్రలు, నిందలనే ఇప్పుడు ఇక్కడ వారి వారసులు కొందరు ప్రయోగిస్తున్నారు. ఆంధ్ర నాయకత్వానికి ఆరవ వేలుగా వ్యవహరించేవారిని తెలంగాణ సమాజం ఇప్పుడే కాదు ఎప్పటికీ హర్షించదు.
బీజేపీ నాయకత్వం ఈ అంశాన్ని తొందరగానే గుర్తించినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ తర్వాత అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆ పార్టీయే. తెలుగుదేశంకు తోకగా కాక, సొంత ఎజెండాతో వ్యవహరించేందుకు ఆ పార్టీ వ్యవహరించింది. ఆ పార్టీ నుంచి లక్ష్మణ్ చాలా పరిణతితో సభా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎంఐఎం సభ్యులు ఎప్పటిలాగే చాలా చురుకుగా చర్చల్లో పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎంలకు ఒకే సభ్యుడు ఉన్నప్పటికీ వారు తమ నిర్మాణాత్మక పాత్రను కాపాడుకునే ప్రయత్నం చేశారు. శాసన మండలిలో కూడా ఈ సారి మునుపటికంటే విస్తృతంగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి, మంత్రులు గతంలో మండలిని ఎక్కువగా లెక్కపెట్టేవారు కాదు. కానీ ఈ సారి వారు విధిగా మండలి సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొన్నారు. సమాధానాలిచ్చారు. స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్, మండలి చైర్మన్ స్వామి గౌడ్…ముగ్గురూ ఆ పదవులకు కొత్తవారే. కానీ సభా నిర్వహణలో వారు చాలా అనుభవజ్ఞుల్లా వ్యవహరించారు. అందరి మనుషుల్లాగానే వ్యవహరించారు. వివాదాలకు కేంద్ర బిందువు కాలేదు. వీలైనంత ఎక్కువమందిని సభా కార్యకలాపాల్లో భాగస్వాములను చేశారు. స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామని బొబ్బలు పెట్టిన టీడీపీ సైతం చివరికి ఎవరి మద్దతూ లేక వెల్లకిలా పడవలసి వచ్చింది.
కేసీఆర్‌కు ఏదో ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇంకా చాలా టైముంది. మన రాష్ట్రంలో ఇదితొలి ప్రభుత్వం. తొలి ముఖ్యమంత్రి ఆయన. పదమూడేళ్లు పోరాడి ఈ రాష్ట్రం సాధించిన ఘనత ఆయనకుంది. అనేక ఎత్తుపల్లాలను, అనేక కష్టనష్టాలను దాటుకుని అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచి రాష్ట్రం అప్పగించారు. దీనిని ఎవరు జీర్ణించుకోలేకపోతే వాళ్లే సతమతమవుతారు. ఇప్పుడు ఎజెండాలో ఉన్న సమస్యలేవీ తెలంగాణ ప్రభుత్వంతో వచ్చినవి కాదు.
చాలా సమస్యలు దీర్ఘకాలికంగా సంక్రమించినవి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికతో, కార్యాచరణతో పని మొదలు పెట్టింది. పారిశ్రామికాభివృద్ధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగాలను ప్రాధాన్య రంగాలుగా ఎంచుకుని పనులు ప్రారంభించింది. వాటి సాధ్యాసాధ్యాలు, జయాపజయాలు తేలడానికి సమయం ఇవ్వాలి. అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్న పూర్తి ఆత్మవిశ్వాసం ఆయన ప్రసంగాల్లో వ్యక్తమయింది. ప్రతిగడపకూ మంచి నీరు ఇవ్వకపోతే ఓటు అడగను అని చెప్పగలిగిన ధైర్యం ఏ నాయకుడికి ఉంటుంది? కానీ కేసీఆర్ తొణకకుండా బెణకకుండా ఈ లక్ష్యాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ నవతెలంగాణ నిర్మాతగా విజయం సాధిస్తారా? లేదా? అన్నది ఆయన పెట్టుకున్న లక్ష్యాల సాధనపై ఆధారపడి ఉంటుంది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..