– తెలంగాణ ఆర్టీసీకీ నష్టం చేసేలా రూపకల్పన
– ఉమ్మడి పేరిట తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర
– పునర్విభజన చట్టం నిబంధనలు బేఖాతరు
– నివేదిక అమలైతే టీఎస్ ఆర్టీసీకీ వెయ్యి కోట్లు నష్టం
– కన్సల్టెన్సీ బాధ్యతలు కమిటీకీ అప్పగింతలో కుట్ర!
– ఆపరేషన్స్, నిర్వహణలోనూ అన్యాయమే
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఊహించినట్లుగానే జవహర్ కమిటీ టీఎస్‌ఆర్టీసీనీ ముంచేసే కుట్రకు పాల్పడింది. పక్షపాతంగా వ్యవహరించి తెలంగాణ ఆర్టీసీకీ సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయలను సీమాంధ్ర (ఏపీఎస్ ఆర్టీసీ) పరం చేసేలా నివేదిక రూపొందించింది. తాము ముందు నుంచి అనుమానించినట్లుగానే జవహర్ కమిటీ టీఎస్‌ఆర్టీసీనీ ప్రతి అంశంలో ముంచేసేలా వ్యవహరించిందని తెలంగాణ కార్మిక, అధికారుల సంఘాలు చెబుతున్నాయి.
తనకు సంబంధంలేని వ్యవహారాల్లో తలదూర్చి సీమాంధ్రకు అనుకూలంగా నివేదికను జవహర్ కమిటీ తయారుచేసిందని మండిపడుతున్నాయి. దీనికి ఆర్టీసీలోని సీమాంధ్ర అధికారులు అండగా నిలిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ ఆడిటింగ్‌ను రెగ్యులర్‌గా చేసే జేబీఆర్‌కే కన్సల్టెంట్ ఉన్నప్పటికీ తమకు అనుకూలంగా నివేదికను తయారు చేయించుకోవడానికి సీమాంధ్ర అధికారులు పకడ్బందీగా స్కెచ్ గీసి, జవహర్ కమిటీకీ అప్పగించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జవహర్ కమిటీని నియమించకముందే సదరు కమిటీ ప్రతినిధిని బోర్డు సమావేశంలో కూర్చోబెట్టి మరీ చర్చించారు. ఆ సమావేశం మినిట్స్ కాపీలోనే ఈ నిజం కనిపిస్తున్నది.
ఉద్దేశపూర్వకంగా జవహర్ కమిటీకి కన్సల్టెంట్ బాధ్యతలు అప్పగించారని చెప్పడానికి ఇదే నిదర్శనమని తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు. జవహర్ కమిటీ నివేదికతో తెలంగాణ ఆర్టీసీకీ భారీగా అప్పులు పెరిగాయి. అంతేగాకుండా తెలంగాణకు ఆర్టీసీకీ నిజాంకాలంనుంచి వచ్చిన ఆస్తుల్లో కూడా సీమాంధ్ర ఆర్టీసీకీ భాగం కల్పించారు. అదే సమయంలో సీమాంధ్రలో ఉన్న ఉమ్మడి ఆస్తులను మాత్రం ఎక్కడా పంపకాల్లో ప్రస్తావనే చేయలేదు. ఇటువంటి అసమగ్రమైన అంశాలతో రూపొందించిన నివేదికను బోర్డు ఆమోదించవద్దని యూనియన్ నాయకులు అడ్డుపడటంతో శుక్రవారం జరుగాల్సిన బోర్డు సమావేశం వాయిదాపడింది.
పునర్‌వ్యవస్థీకరణ చట్టం నిబంధనలు బేఖాతరు
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఆర్టీసీకోసం పొందుపరిచిన నిబంధనలను యాజమాన్యం యథేచ్ఛగా ఉల్లంఘించినట్లు అర్థమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థల విభజనకోసం నియమించిన షిలా బిడే కమిటీ ఆదేశాలను కూడా వక్రీకరించి జవహర్ కమిటీని నియమించారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆర్టీసీ ఉమ్మడి ఆస్తులను మూల్యాంకనం చేయడానికి కన్సల్టెంట్‌ను లేదా ఆడిటర్‌ను నియమించుకోవాలని షిలాబిడే కమిటీ ఆదేశించింది.
ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఆడిటర్ లేదా ఇతర కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని సూచించింది. షిలాబిడే ఆదేశాల ప్రకారం ఆర్టీసీలో ఉన్న అకౌంటెంట్ లేదా అప్పటికే సేవలందిస్తున్న కన్సల్టెంట్ సేవలు తీసుకోవచ్చు. ఆర్టీసీలో నైపుణ్యమున్న చార్టెడ్ అకౌంటెంట్‌లను, రెగ్యులర్‌గా ఆడిటింగ్ నిర్వహిస్తున్న జేబీఆర్‌కేను కాదని ఆస్తులు, అప్పుల పంపిణీనీ జవహర్ అసోసియేట్స్‌కు అప్పగించారు. దీనివెనుక ఆర్టీసీ నష్టాలపాలు కావడానికి కారణమైన సలహాదారు చక్రం తిప్పారన్న అభియోగాలున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 53(సెక్షన్ 68తో కలిపి) విభజన చేయాల్సి ఉండగా, వీటికి తిలోదకాలిచ్చి, సంబంధంలేని 52(4) నిబంధనను జోడించి టీఎస్ ఆర్టీసీనీ నష్టపర్చేందుకు జవహర్ అసోసియేట్స్ తీవ్ర ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఆర్టీసీ విభజనకు ఈ నిబంధన వర్తించదు.
గవర్నర్‌కు ఇచ్చిన నివేదికకు పూర్తిగా భిన్నం
ఆర్టీసీ విభజనకు ముందు ఈ ఏడాది మే 15న గవర్నర్ నరసింహన్‌కు ఆస్తులు, అప్పులపై బోర్డు నివేదిక ఇచ్చింది. రీజియన్లు, జోన్లు, జిల్లాల వారీగా వచ్చిన లాభాలు, నష్టాల ఆధారంగా ఈ నివేదికను పక్కాగా రూపొందించారు. దీనిప్రకారం తెలంగాణ ఆర్టీసీకీ మొదట రూ.900 కోట్ల అప్పులు మాత్రమే తేలాయి. ఉమ్మడి అస్తుల విలువ పెంచడంవల్ల రూ.1094 కోట్ల అప్పులను చూపించారు. జవహర్ కమిటీ నివేదిక వీటిని రూ.1678 కోట్లకు పెంచింది.
ఆర్టీసీకీ చెందిన అనేకమంది అకౌంటెంట్లు తయారుచేసి గవర్నర్‌కు అందచేసిన నివేదికను తప్పని చెబుతూ జవహర్ కమిటీ ఈ నివేదికను రూపొందించడం గమనార్హం. మొదట ఆర్టీసీ ఆస్తులు, అప్పులను ఎక్కడి ప్రాంత లాభ నష్టాల ఆధారంగా విభజించగా, జవహర్ కమిటీ మాత్రం 58:42 నిష్పత్తిలో పంచడంతో టీఎస్ ఆర్టీసీకీ పూర్తిగా అన్యాయం జరిగింది.
రూపాయల్లో చూస్తే సుమారు 584 కోట్లు నష్టం జరుగగా, ఉమ్మడి ఆస్తుల పేరిట తార్నాక దవాఖాన, బస్‌భవన్, మియాపూర్ బాడీ బిల్డింగ్ యూనిట్లలో ఉమ్మడి ఆస్తుల కింద ఏపీఎస్ ఆర్టీసీకీ సుమారు రూ.234 కోట్ల ఆస్తి చెందుతుందని నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి తార్నాక దవాఖాన ఉస్మానియా యూనివర్సిటీకీ చెందినది. బస్‌భవన్ స్థలం 1956కు ముందు నిజాం ఆర్టీసీ కాలంనుంచి వారసత్వంగా వస్తున్నది. వీటి కోనుగోలుకు ఉమ్మడి ఆర్టీసీ ఒక్క పైసాకూడా ఖర్చు చేయలేదు. మియాపూర్ బాడీ బిల్డింగ్ యూనిట్ రంగారెడ్డి జిల్లాకు చెందినది. ఇందులో నిర్మాణాలను మాత్రమే ఉమ్మడి ఖర్చుతో చేపట్టారు. కానీ.. వాటి భూమి విలువనుకూడా లెక్కకట్టి సీమాంధ్ర ఆర్టీసీకీ జవహర్ కమిటీ వాటా కల్పించింది. దీనిపై తెలంగాణ సంఘాలు మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. భూమి విలువ ఒక్కటే రూ.390 కోట్లుగా జవహర్ కమిటీ నిర్ధారించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
ఆపరేషన్స్, రిజర్వేషన్ కౌంటర్లు, పార్కింగ్‌పై కూడా కుట్ర
ఆస్తులు, అప్పులపైనే నివేదికకు పరిమితం కావాల్సిన జవహర్ అసోసియేట్స్.. ఆపరేషన్స్, రిజర్వేషన్ కౌంటర్లు, పార్కింగ్ వ్యవహరాల్లో వేలుపెట్టి ఉచిత సలహాలిచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సులు యథేచ్ఛగా ఎంజీబీఎస్ పార్కింగ్‌లోకి ఐదేండ్లు వచ్చేలా నివేదిక రూపొందించారు. డ్రైవర్ల రెస్ట్ రూమ్‌లనూ వాడుకోవచ్చని పేర్కొన్నారు. వెరసి బస్టాండ్లను కూడా సీమాంధ్రకు అనుకూలంగా మార్చారు. తెలంగాణ బస్సులకు పాయింట్లు లేకుండాచేసి, సీమాంధ్ర బస్సులకు ప్రాముఖ్యం కల్పించారు. ఆపరేషన్స్‌లో తెలంగాణ ఆదాయానికి గండికొట్టేందుకూ పథక రచన జరిగింది. నివేదికలో పేర్కొన్న ప్రకారం ఐదేండ్లు 1200 సీమాంధ్ర బస్సులు యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్ళవచ్చు. జాతీయ రవాణా నిబంధనల ప్రకారం చూస్తే సీమాంధ్ర నుంచి ఎన్ని బస్సులు వస్తే మన రాష్ట్ర బస్సులు అన్నింటిని అక్కడ కూడా అనుమతించాలి.
ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం అనుమతివ్వాలి. కానీ ఈ అంశాన్ని నివేదికలో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. ఈ విషయంలో పురుషోత్తం కమిటీ నివేదిక ఉన్నప్పటికీ, ఇది అమలు కాకుండా సీమాంధ్ర ఉన్నతాధికారులు తొక్కిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. పార్కింగ్‌కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో దూరంగా కేటాయిస్తారు. జవహర్ కమిటీ మాత్రం ప్రస్తుతం ఉన్న పార్కింగ్‌నే వాడుకోవాలని సూచించింది. మరోవైపు ఆస్తులను జనాభా నిష్పత్తిలో పంచాలన్న జవహర్ అసోసియేట్స్ నివేదిక.. నిర్వహణ ఖర్చును మాత్రం రెండు రాష్ట్రాలు చెరిసమానంగా పంచుకోవాలని పేర్కొంది. బస్‌భవన్ నిర్వహణ ఖర్చును 50ః50 నిష్పత్తిలో పంచుకోవాలని సూచించింది. అదేవిధంగా జవహర్ కమిటీకీ చెల్లించే మొత్తాన్ని కూడా సగం, సగం భరించాలని నిబంధన పెట్టింది. మొత్తంగా కమిటీ నివేదికలోని వివాదాస్పద అంశాలపై తెలంగాణ కార్మిక సంఘాల నేతలు కమిటీ సభ్యులవద్ద అభ్యంతరం వ్యక్తం చేయడంతో శుక్రవారం జరగాల్సిన బోర్డు సమావేశం వాయిదా పడింది.
జవహర్ కమిటీని రద్దు చేయాల్సిందే: టీఎంయూ
జవహర్ కమిటీనీ రద్దు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), తెలంగాణ ఆఫీసర్స్ యూనియన్ డిమాండ్ చేశాయి. ప్రభుత్వంతోపాటు, ఆర్టీసీ ఉద్యోగులను మోసంచేసే చర్యకు పాల్పడిన జవహర్ కమిటీపై క్రిమినల్ కేసు పెట్టాలని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే ఈ కమిటీనీ రద్దు చేసి, ఇతరులతో నివేదిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ విభజనను జాప్యంచేసేందుకు తప్పుడు నివేదికను సాకుగా చూపే అవకాశముందని విమర్శించారు. ఈ కమిటీ నియమకానికి కారణమైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
కమిటీని రద్దు చేయాలి
-కమిటీ నివేదికతో టీఎస్‌ఆర్టీసీకి నష్టం
– నివేదిక ఆమోదించొద్దని టీ యూనియన్ల పట్టు
– పోటీ నినాదాలతో బస్ భవన్‌వద్ద ఉద్రిక్తత
-బోర్డు సమావేశం తాత్కాలిక వాయిదా
ఆర్టీసీ విభజనకు ఉద్దేశించిన జవహర్ కమిటీ నివేదికను ఎట్టిపరిస్థితుల్లోనూ అమోదించరాదని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది, అధికారుల సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణకు పూర్తి నష్టం చేకూర్చేవిధంగా నివేదిక ఇచ్చిన కమిటీని రద్దు చేయాలని పట్టుపట్టాయి. జవహర్ కమిటీ నివేదికను ఆమోదించేందుకు ఆర్టీసీ బోర్డు సయాత్తం కావడంతో తెలంగాణ కార్మిక, అధికారుల, సూపర్‌వైజర్ల సంఘాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జవహర్ కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశాలు తెలంగాణ ఆర్టీసీకీ నష్టం కలిగించేలా ఉన్నాయంటూ శుక్రవారం ఉదయం నుంచే కార్మిక, అధికారుల సంఘాలు బస్‌భవన్‌లో ఆందోళనకు దిగాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, రాజలింగం, అశోక్‌తోపాటు తెలంగాణ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు విజయ్‌బాబు తదితరులు నివేదికలోని అవకతవకలను బోర్డు సభ్యులైన ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్, ఐఏఎస్ అధికారి చంద్రవదన్, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌రావుకు వివరించారు. వారు ఆ నివేదికను పరిశీలించిన అనంతరం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచందర్‌రావు, జేఎండీ రమణారావుతోపాటు మిగతా సభ్యులతో చర్చించారు.
అనంతరం బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఒక దశలో టీఎంయూ నాయకులు ఎండీ చాంబర్ ముందు బైఠాయించారు. టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి నేలపై కూర్చుని జవహర్ కమిటీకీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులు, అధికారుల ఆందోళనతో బస్‌భవన్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)నాయకుడు రాజిరెడ్డి వినతిపత్రం ఇచ్చేందుకు బస్సు భవన్‌లోకి రావడంతో టీఎంయూ, ఈయూ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో బస్‌భవన్ మార్మోగిపోయింది.
కార్మికశాఖ గుర్తింపులేని తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్ర అధికారులకు తొత్తులుగా మారి తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తున్నదని టీఎంయూ నాయకులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలు విమర్శించగా, కార్మికుల సమస్యలపై ఇతర యూనియన్లను కలుపుకొనిపోకుండా టీఎంయూ ఒంటెత్తు పోకడలు పోతున్నదని ఈయూ నేతలు ఆరోపించారు. ఇరు సంఘాల మధ్య పరస్పర ఆరోపణలు పెరిగి, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించారు. బోర్డు సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించడంతో సంఘాలన్నీ జవహర్ కమిటీకీ వ్యతిరేకంగా ధర్నా చేపట్టి వెళ్ళిపోయాయి.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..