mt_logo

సీఎం కిరణ్ ను అడ్డుకున్న మంత్రి జానారెడ్డి

బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ బిల్లుపై సీఎం కిరణ్ మాట్లాడుతున్న సమయంలో మంత్రి జానారెడ్డి అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నారా లేక సభానాయకుడిగా మాట్లాడుతున్నారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని, అలా ఇచ్చిన తర్వాతే సీఎం తన ప్రసంగాన్ని మొదలుపెట్టాలని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. బిల్లులో ఉన్న అంశాలపైనే మాట్లాడాలి తప్పించి వేరే అంశాలు మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర శాసనసభకు వచ్చిన బిల్లుపై ఓటింగ్ ఉండదని, కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని సూచించారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో తీర్పు ఇచ్చిందని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని అన్న జానారెడ్డి అభిప్రాయాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఎంత విజ్ఞప్తి చేసినా వారు పోడియం దాటి వెళ్లకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. ఈ విషయంపై హరీష్ రావు మాట్లాడుతూ, సీఎం కిరణ్ ముఖ్యమంత్రి హోదాను అవమానించారని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన తనంత దురదృష్టవంతుడు లేడని పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం పట్ల అన్ని ప్రతిపక్షాలనుండీ తీవ్ర విమర్శలు ఎదురవ్వడంతో గురువారం ప్రసంగాన్ని కొనసాగిస్తానని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *