mt_logo

2004 ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ తో పొత్తుదేనికి?-డిప్యూటీ సీఎం

మంగళవారం జరిగిన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖామంత్రి జీ.ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ, 2004 ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడుగానీ, 2009 ఎన్నికలప్పుడు తెలంగాణకు అనుకూలమని మేనిఫెస్టోలో పెట్టినప్పుడుగానీ సీమాంధ్ర నేతలు అభ్యంతరం చెప్పలేదనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో సమైక్యవాదమని డ్రామాలాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల ఓట్ల ద్వారా అందే అధికారం కోసమే అర్రులుజాస్తున్నారని, అసెంబ్లీలో సీమాంధ్ర ప్రజలకోసం ఎవరూ మాట్లాడటంలేదని, అంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విమర్శించారు. రాష్రం విడిపోతే సమస్యలు వస్తాయని సీమాంధ్రులు విషప్రచారం చేస్తున్నారని, పునర్నిర్మాణం ఎలా చేసుకోవాలో తమకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ, ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా తెలంగాణ వచ్చి తీరుతుందని, అసెంబ్లీలో చరిత్ర వక్రీకరించి మాట్లాడుతున్నారని సీమాంధ్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విడిపోవడానికి వెయ్యి కారణాలు చెబుతుంటే, కలిసి ఉండటానికి ఒక్క కారణం కూడా చెప్పలేకపోతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కే.రఘు, ప్రొఫెసర్ హరగోపాల్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *