తెలంగాణ రాష్ట్రం సిద్ధించేవరకు పోరాటాలు చేయాల్సిందేనని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ బతికి ఉండగా తెలంగాణ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నల్లగొండ జిల్లా జల సాధన సమితి నాయకుడు దుశర్ల సత్యనారాయణ అనుభవాలతో ప్రముఖ రచయిత ఎలికట్టె శంకర్‌రావు రాసిన ‘జల సాధన సమరం’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీఆర్ నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యలను, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని, దుశర్ల కృషిని విశ్లేషిస్తూ ప్రసంగించారు.
తెలంగాణలోని ప్రతీ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతోనే ముడిపడి ఉన్నదని ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ భూతం పోవాలంటే ప్రజలకు మంచినీళ్లు, వ్యవసాయానికి నీళ్లు కృష్ణానది నుంచి ఇవ్వాల్సిందేనని ఇంతకన్నా మార్గం లేదని ఆయన అన్నారు. తెలంగాణ నెటిజెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ సభ జరిగింది. హెచ్‌ఎంటీవీ సీఈవో కే రామచంద్రమూర్తి, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి సూరేపల్లి సుజాత, ఎంఎల్‌సీ కే స్వామిగౌడ్, సామాజిక రాజ్యాధికార వేదిక చైర్మన్ విజయ్‌కుమార్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ నెటిజెన్స్ ఫోరం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేసీఆర్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ బాధిత గ్రామాలన్నింటికీ మంచినీళ్లు రావాలంటే తెలంగాణ రావాల్సిందేనని చెప్పారు. ఆరు దశాబ్దాలుగా ఫ్లోరైడ్ భూతం నల్లగొండను గడగడలాడిస్తున్నా, సీమాంధ్ర పాలకులకు కనికరం కలగడం లేదని ఆయన విమర్శించారు. కొందరు స్వార్థపరులు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఈ కుట్రలను ఉద్యమం ఛేదిస్తుందని, తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని కేసీఆర్ ఘంటాపథంగా చెప్పారు. దుశర్లను కేసీఆర్ ప్రజా జీవితంలోకి ఆహ్వానించారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మన నీళ్లు మనకు కావాలన్నా మన రాష్టం మనకు కావాలన్నారు. హెచ్‌ఎంటీవీ సీఈవో కే రామచంవూదమూర్తి మాట్లాడుతూ ఫ్లోరైడ్ ప్రజల కష్టాలను తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
[నమస్తే తెలంగాణా సౌజన్యంతో]