తెలంగాణ జలహారం పథకాన్ని అనుకున్న సమయంలో పూర్తిచేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని, ఇందుకు అవసరమైన అనుమతులను ఏమాత్రం జాప్యం లేకుండా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. జలహారం పథకంపై ఆదివారం బేగంపేటలోని కాకతీయ హోటల్ లో రెవెన్యూ, పంచాయితీ రాజ్, నీటిపారుదల, అటవీ, విద్యుత్, రోడ్లు-భవానాలు తదితర శాఖల మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అనుమతుల పేరిట జాప్యం చేయకుండా బ్లాంకెట్ పర్మిషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు.
మంత్రులు, అధికారులు సోమవారం నుండే కార్యరంగంలోకి దిగాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. గ్రిడ్ పై అవగాహన కల్పించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తానని సీఎం పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలోనే ఇన్ టేక్ వేల్స్ నిర్మాణం చేపట్టాలని, వీటికి సమాంతరంగా విద్యుత్ స్టేషన్ల నిర్మాణం స్థంబాల ఏర్పాటు పనులు పూర్తిచేయాలని కేసీఆర్ సూచించారు. జలహారంలో కీలకమైన పైప్ లైన్ల నిర్మాణం కోసం ప్రైవేట్ వ్యక్తుల భూమి వినియోగించే విషయంలో త్వరలో ఆర్డినెన్స్ తెస్తామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, జోగురామన్న, సీ. లక్ష్మారెడ్డి, ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.