– విజయవాడలో ఓ కళాశాల దౌర్జన్యం
– ఇందూరు బిడ్డపై ఆగ్రహం
బోధన్, జనవరి 7 (టీ మీడియా): జై తెలంగాణ.. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. కానీ ఈ నినాదం సీమాంధ్రలో నిషేధం! విజయవాడలోని ఓ కళాశాల.. నోట్‌బుక్‌పై ‘జై తెలంగాణ’ అని రాసినందుకు ఇందూరు బిడ్డను రెండ్రోజులపాటు నిర్బంధించింది! నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పృథ్వీకృష్ణ గత ఏడాది పదోతరగతిలో అత్యుత్తమ గ్రేడింగ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియట్ విద్యతోపాటు ఐఐటీ కోచింగ్ ఇస్తామని పృథ్వీకృష్ణను కార్పొరేట్ కళాశాల విజయవాడలోని బ్రాంచ్‌లో చేర్చుకుంది.
ఆదివారం అక్కడ హాస్టల్ రూమ్‌లో నోట్‌బుక్‌పై పృథ్వీకృష్ణ ‘జై తెలంగాణ’ అని రాశాడు. సీమాంధ్రకు చెందిన కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్రహించిన ప్రిన్సిపాల్, సిబ్బంది.. పృథ్వీకృష్ణను దుర్భాషలాడారు. బలవంతంగా గుంజుకపోయి ఒక గదిలో ఆది, సోమవారాలు బంధించారు. పృథ్వీ కృష్ణ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం ఫోన్ చేసి హెచ్చరించింది. దీంతో ఆ బాలుడి తండ్రి సోమవారం సాయంత్రం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. కళాశాల తీరుపై ఇందూరులో తెలంగాణవాదులు నిరసనకు దిగారు.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]