mt_logo

తెలంగాణ తథ్యం – నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు

సంప్రదింపులు ముమ్మరం

ఇచ్చిన మాటకోసం సోనియా పట్టు
పార్టీకి పూర్వవైభవమే లక్ష్యం
ఫలిస్తున్న కేసీఆర్ వ్యూహం

రాజధానిపైనే తర్జనభర్జనలు
అందుకే కోర్ భేటీకి ‘చండీగఢ్’ నుంచి బన్సల్
ప్యాకేజీలు పనిచేయవు.. రాష్ట్ర ఏర్పాటుకే కోర్ కమిటీ మొగ్గు

(టీ మీడియా-న్యూఢిల్లీ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. త్వరలోనే తుది నిర్ణయం వెలువరించే దిశగా కాంగ్రెస్ కోర్‌కమిటీ వరుసగా రెండవ రోజూ సుదీర్ఘ చర్చలు జరిపింది. ప్రధాని నివాసంలో శుక్రవారం సుమారు రెండు గంటలపాటు సమావేశమైంది. గురువారం నాటి కోర్‌కమిటీ భేటీకి కొనసాగింపుగా జరిగిన సమావేశం తెలంగా ణపై ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిందని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. రాహుల్ గాంధీని ‘తెలంగాణ’ బాటలో ప్రధాని పీఠానికి మరింత దగ్గరగా నడిపించాలనేది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే కీలక నిర్ణయానికి కాంగ్రెస్ సిద్ధపడినట్లు సమాచారం. 2004 ఎన్నికల ప్రచారంలో తెలంగాణ గడ్డపై తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, మూడేళ్లక్షికితం తన పుట్టిన రోజున ఇచ్చిన కానుకకు కట్టుబడి ఉండాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో పార్టీకి తిరిగి పూర్వవైభవం సాధించాలంటే రాష్ట్ర ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మార్గమని మేడం భావిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే వివిధ ప్రత్యామ్నాయాలపై కోర్‌కమిటీ చర్చించినట్టు సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ఏ ప్రత్యామ్నాయమూ పార్టీకి మేలు చేయదని కోర్ కమిటీలో ఎక్కువమంది భావించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. కర్ణాటక తరహా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ చేయవలసి వస్తుందని, అందుకు బీజేపీ సహా ఏ పార్టీ కూడా సహకరించే పరిస్థితి లేదని కోర్‌కమిటీ అభిప్రాయపడినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అటువంటి ప్రతిపాదనలవల్ల తెలంగాణలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని వారు భావించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ విషయంలోనే సీమాంధ్ర నాయకులకు అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే విషయమై దృష్టిని కేంద్రీకరించాలని కోర్‌కమిటీ యోచిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ను కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంచితే ఎదురయ్యే సమస్యలు, అనుభవాలను గురించి తెలుసుకునేందుకే చండీగఢ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న పవన్ కుమార్ బన్సల్‌ను కోర్‌కమిటీ సమావేశానికి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. కోర్ కమిటీలో ఒక తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత కేసీఆర్‌తో పాటు ఎవరెవరితో చర్చలు జరుపాలన్న విషయమై కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వస్తుందని చెబుతున్నారు. ఈ సమావేశంలో సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌తోపాటు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్, వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ హాజరుకావడం విశేషం. గురువారం జరిగిన కోర్ కమిటీ సమావేశానికి హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. రెండు సమావేశాలకూ రాష్ట్ర పరిశీలకుడు వాయలార్ రవి హాజరుకాలేదు. తెలంగాణ ఇవ్వడం వలన లాభమా? నష్టమా? అనే ప్రాథమిక చర్చ కన్నా తెలంగాణ ఇచ్చి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చాలనే అంశం పైనే వారి చర్చ అంతా నడిచిందని తెలిసింది.

నిజానికి ‘డిసెంబర్ 28 అఖిలపక్ష సమావేశం’ ముందు నుంచే కాంగ్రెస్ ఈ అంశంలో ఎడతెగని కసరత్తు జరిపింది. కోర్‌కమిటీ సమావేశాలు.. మినీ కోర్‌కమిటీ సమావేశాలు జరిపింది. అనేక సందర్భాల్లో వార్‌రూమ్‌లో సమావేశమై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉంది. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇతర పార్టీలు భిన్నాభిప్రాయాలు చెప్పకపోవడం కూడా కాంగ్రెస్‌కు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో గొప్ప వెసులుబాటు కల్పించిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ నుంచి రెండు అభిప్రాయాలు వెల్లడైనప్పటికీ.. సమావేశానికి అధ్యక్షత వహించిన షిండే.. తెలంగాణకు అనుకూలంగా పార్టీ అభిప్రాయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ ప్రతినిధి సురేష్‌డ్డి వాదననే రికార్డు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని గురువారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సైతం షిండే పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలు కరాఖండిగా తెలంగాణ ఏర్పాటును కోరనప్పటికీ.. అదే సమయంలో విభజన వద్దని తెగేసి చెప్పని అంశం కూడా కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకున్నదని తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీల్లో ఒక్క సీపీఎం మినహా మరెవరూ రాష్ట్రాన్ని విభజించవద్దని సూటిగా చెప్పలేక పోయారు. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటుకు ఏదో ఒక స్థాయిలో అనుకూలతనే వ్యక్తం చేశారు. ఆఖరుకు దోబూచులాడాయన్న విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ, వైఎస్సార్సీపీ సైతం వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు.

ఒక అడుగు ముందుకేసిన వైస్సార్సీపీ.. తన ఎత్తుగడ ఏదైనప్పటికీ.. నిర్ణయం ప్రకటించిన తర్వాత దానిపై ఏ విధంగా స్పందిస్తుందన్నది పక్కనపెడితే.. రాష్ట్రంలోని పార్టీల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పింది. మొత్తంగా రాష్ట్ర విభజనపై కొందరు వ్యక్తులుగా తప్పించి.. పార్టీలుగా వ్యతిరేక అభిప్రాయం లేదన్న వాదన ఆ రోజు బలంగా వినిపించింది. షిండే సైతం అఖిలపక్ష సమావేశంలో ‘కాంగ్రెస్ రెండు రాష్ట్రాల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నాను’ అంటూ చేసినట్లు చెబుతున్న ప్రకటన కూడా కేంద్ర నాయకత్వం తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగానే ఉన్నదన్న సంకేతాలను అందించింది. గురు, శుక్రవారాల్లో జరిగిన కోర్‌కమిటీ భేటీల్లో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తొలుత పార్టీలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, తదనంతరం యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించేందుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని భావించినట్లు సమాచారం. ఈ నిర్ణయాలను మరింత పరిపుష్టం చేసే దిశగా శుక్రవారం నాటి కోర్‌కమిటీ సమావేశం సాగిందని అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఈ క్రమంలోనే చర్చలకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని భావించారు. సాయంత్రం ఐదున్నరకు మొదలైన ఈ సమావేశం సాయంత్రం ఏడున్నర గంటలకు ముగిసింది.

దాదాపు రెండు గంటల సమయం కేటాయించి తెలంగాణపై చర్చించడం ఇటీవలి కాలంలో మొదటిసారిగా భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, రెండు ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసుకోవడం అన్న కోణంలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ కీలక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కేంద్రంలో రెండు సార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో ఎన్నికైన ఎంపీలే. ఉభయ ప్రాంతాల్లో పార్టీకి ఉన్న ఎంపీల బలంతోనే కేంద్రంలో కాంగ్రెస్ రాజ్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో సైతం ఇదే ఫీట్‌ను కాంగ్రెస్ కొనసాగించాలంటే కీలకమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పైగా రాబోయే కేంద్ర ప్రభుత్వ పగ్గాలను తన తనయుడు రాహుల్ గాంధీకి అప్పగించాలన్న యోచనలో సోనియా ఉన్నారు. రాహుల్ ప్రధాని కావాలంటే అవసరమైన ఎంపీలను అధిక సంఖ్యలో మళ్లీ అందించాల్సినది.. అందించే అవకాశం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఒక్క సీనియర్లు సైతం సోనియాకు మద్దతు పలకడంతోనే కీలకమైన ప్రతిష్ఠంభనను బద్దలుకొట్టడానికి కాంగ్రెస్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే గత కొద్దికాలంగా ఇక్కడ పరిస్థితులు పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షల ఫలితంగా టీఆర్‌ఎస్ జోరు మీద ఉంది. గత కొన్నేళ్లుగా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ కొన ఊపిరిపై ఉంది.

ఇక్కడ పార్టీని రక్షించే ఏకైక నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనే కాగలదని టీ కాంగ్రెస్ నేతలు ఏళ్ల తరబడి నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఇచ్చిన ఘనతతో ఎన్నికలకు వెళితే పార్టీకి తిరుగు ఉండదని ఆ నేతలు విశ్వసిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇదే అంశాన్ని పార్టీ పెద్దల ముందు నివేదికలు, లేఖల రూపంలో ఉంచారు. దీనితో పాటు ఇటీవల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హస్తినలో దీర్ఘకాలం మకాం వేసి, కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేసీఆర్ కీలకమైన ఆఫర్‌లు ఇవ్వడం కూడా పార్టీ అధిష్ఠానం మనసులో ఉందని అంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని తేలిపోయినట్లయితే జగన్ గూటికి చేరేందుకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో టీడీపీ కూడా పుంజుకునే అవకాశాలు లేకపోలేదన్నవాదన ఉంది. ఈ తరుణంలో తెలంగాణలో పార్టీని నిలుపుకోవడం ద్వారా అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లు సంపాదిస్తామన్న ధీమా నెలకొంటే.. సీమాంధ్రలో సైతం ఆట మారిపోతుందన్న అంచనాతో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్ర ప్రకటనేనని కోర్‌కమిటీ సభ్యులు భావించినట్లు సమాచారం. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సును కూడా ఈ నేపథ్యంలోనే రద్దు చేసినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోబోయే ముందు ఇటువంటి సదస్సులు నిర్వహించడం విద్వేషాలు రెచ్చగొట్టే ఆస్కారం ఇచ్చినట్లే అవుతుందని భావించిన పార్టీ పెద్దలు.. చివరి నిమిషాల్లో ఈ సమావేశం ఇప్పుడొద్దని చెబుతూ పక్కన పెట్టారని తెలిసింది.

తమిళనాడు అనుభవం వద్దు

తమిళనాడులో ద్రవిడ ఉద్యమ నేపథ్యం, దళిత, బీసీ చైతన్యం వల్ల అక్కడ ప్రాంతీయ పార్టీల నిర్మాణం జరిగి, జాతీయ పార్టీలు కనుమరుగైపోయిన నేపథ్యాన్ని కోర్‌కమిటీ చర్చించినట్లు తెలిసింది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారిన గత పరిస్థితిని వారు అంచనా వేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో తాజా పరిణామాలను ఒక కొలిక్కి తేనిపక్షంలో తమిళనాడు తరహా పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొనాల్సి వస్తుందన్న అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

పవన్ కుమార్‌కు పిలుపు వెనుక?:

చండీగఢ్ నుంచి ఎంపీగా గెలిచిన బన్సల్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు చేసిన పక్షంలో హైదరాబాద్ సహిత రాష్ట్రం తప్ప మరేదీ అంగీకరించేది లేదని తెలంగాణవాదులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌పై వివాదం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చండీగఢ్ మాదిరిగా కాకపోయినా.. కొంతకాలం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచితే ఎదురయ్యే ఇబ్బందులు, ఇప్పటికి ఉన్న అనుభవాలను పంచుకునేందుకు, అనుసరించాల్సిన విధానంపై సంప్రదింపులు జరిపేందుకు ఆయనను పిలిచినట్లు సమాచారం.

ద్విసభ్య కమిటీకి కసరత్తు

తెలంగాణపై తీసుకోబోయే నిర్ణయం విషయంలో ఎవరితోనైనా చర్చించేందుకు ద్విసభ్య కమిటీనొకదాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. ఈ కమిటీలో ఒక సభ్యుడిగా హోం మంత్రి ఉంటారు. మరో సభ్యుడిని త్వరలోనే ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అఖిలపక్షంలో పాల్గొన్న పార్టీలతో ఏదైనాఅంశం చర్చించాల్సి వస్తే.. ఆ బాధ్యతను ద్విసభ్య కమిటీకి అప్పగిస్తారని తెలుస్తోంది.

ప్రధాని ఇంటి నుంచి ‘వార్ రూం’కు..

తెలంగాణపై సుదీర్ఘ మంతనాలు సాగించిన కోర్‌కమిటీ సభ్యులు.. ఈ సమావేశం ముగిసిన వెంటనే తల్‌కటోరా రోడ్డులోని కాంగ్రెస్ వార్ రూమ్‌కు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన భేటీకి షిండే, చిదంబరం, ఆంటోనీ హాజరయ్యారు. ద్విసభ్య కమిటీలో రెండవ సభ్యుడి ఎంపికపై వారు చర్చించినట్లు తెలిసింది. అదే సమయంలో తెలంగాణ విషయంలో ప్రకటన చేసిన తర్వాత విపరీత పర్యవసానాలు, ఘర్షణపూర్వక ఉద్యమాలు తలెత్తితే చేపట్టాల్సిన చర్యలపై రక్షణ మంత్రి ఆంటోనీ, హోం మంత్రి షిండే చర్చించుకున్నట్లు సమాచారం. నిర్ణయం తీసుకున్న తర్వాత మాట మార్చే నాయకులను అదుపులో పెట్టే అంశంపై చిదంబరంతో ఆంటోనీ చర్చించారని తెలిసింది. కాగా.. వారి భేటీలో ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ కూడా భాగస్వామి అయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన తదనంతర పరిణామాలు, మహిళా రక్షణ చట్టాల అమలు తదితర అంశాలపై ఆమెతో వారు చర్చించినట్లు తెలిసింది.

ఢిల్లీకి చేరుకున్న జానారెడ్డి

తెలంగాణ తప్పితే తాము వేరే నిర్ణయాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదని టీ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో చేసిన తీర్మానం కాపీలతో మంత్రి జానారెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ కాపీలను అధిష్ఠానం పెద్దలకు ఆయన అందించనున్నారు. ఇందుకోసం శనివారం పలువురు ముఖ్య నేతల అపాయింట్‌మెంట్‌లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో  ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *