ఫొటో: జై తెలంగాణ అని రాసి ఉన్న బోనాలను అడ్డుకుంటున్న పోలీసులు
ఫొటో: బోనాలపై ఉన్న “జై తెలంగాణ” నినాదాన్ని నీటితో కడిగిస్తున్న పోలీసులు
—
‘కుండపోతే పోయింది కానీ కుక్క సంగతి తెలిసింది’ అనే నానుడి మరోసారి నిజమైంది.
జై తెలంగాణ అంటే కేసులు పెడతామని ఆగ్రహించిన పోలీసులు చివరికి ఆ నినాదాలతో వచ్చిన బోనాలను సైతం దించడమే కాకుండా బోనాలపై ఉన్న అక్షరాలను కడిగించేదాకా వెళ్లిపోయారు. సోమవారం చంద్రబాబు పాదయాత్రలో పోలీసుల అత్యుత్సాహం బట్టబయలైంది. తెలంగాణ సంస్కాతిక చిహ్నంగా భావించే బతుకమ్మ, బోనాలలోని జై తెలంగాణ నినాదాన్ని చూస్తే చంద్రబాబే కాదు పోలీసులూ జీర్ణించుకోని పరిస్థితులు ఏర్పడటాన్ని తెలంగాణవాదులు సీరియస్‌గా తీసుకుంటున్నా రు. కొమ్ములవంచ గ్రామం నుంచి మొదలైన ఆయన పాదయాత్ర నర్సింహులపేట పొలిమేరల్లోకి రాగానే పోలీసుల అసలు రంగు బయటపడింది. చంద్రబాబుకు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలతో (వాటిపై జై తెలంగాణ నినాదాలతో) స్వాగతం పలికేందుకు మహిళలు సిద్ధమయ్యారు. నర్సింహులపేట గ్రామ పొలిమేరల్లోకి వచ్చిన మహిళల బోనాలను తొర్రూర్‌సీఐ కరాఖండిగా ఆపేశారు. ‘మీ బోనాలను లోపలికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం. వాటిపై ఉన్న జై తెలంగాణ అని రాసి ఉన్న నినాదాలను తొలగించాల్సిందే’ అంటూ సీఐ హుకుం జారీ చేశారు.
ఆ నినాదాలతో ఉంటే తాను లోపలికి అనుమతించే ముచ్చటే లేదంటూ వాటిని తీసుకొచ్చిన మహిళలకు, ఆ మహిళలను తీసుకొచ్చిన తెలుగుతమ్ముళ్లలో సీఐ బాలస్వామి వాగ్వాదం చేశారు. సీఐ హుకుంతో చేసేది ఏమీలేక తెలుగుతమ్ముళ్లు తమ మహిళలు తెచ్చిన బోనాలపై ఉన్న జై తెలంగాణ నినాదాలను వాటర్‌ట్యాంకర్లతో (ఆ ట్యాంకర్లు గుంటూరు నుంచి వచ్చినవే కావడం విశేషం) కడిగించారు. ఇంత జరుగుతున్నా ఇక తెలంగాణ అంటే తామేనని అసలైన తెలంగాణ వాదులుగా తమనే ప్రజలు నమ్ముతారని భావిస్తున్న తెలుగుతమ్ముళ్లు ఎవరూ పోలీసుల అత్యుత్సాహాన్ని నిలువరించలేకపోవడంపట్ల తెలంగాణవాదులు మండిపడుతున్నారు. బోనాల మీద రాసి ఉన్న “జై తెలంగాణ” నినాదాలనైతే కడిగించారు కానీ మా మనసుల్లోని ఆత్మగౌరవ నినాదాన్ని ఏ నీళ్లతో కడిగేయగలరు బాబూ అంటూ అటు చంద్రబాబును, ఇటు పోలీసులను తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]