mt_logo

బీఆర్ఎస్ అసెంబ్లీకి రాకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నింది: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం కుట్ర పన్నింది. ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నింది అని ఆరోపించారు.

శాసనసభ బయటే ప్రధాన ప్రతిపక్షమైన మమ్మల్ని అడ్డగించడం దారుణం.. ఇంతకు ముందు ఎపుడూ ఇలా జరగలేదు. మేము అదానీ రేవంత్ ఉన్న టీ షర్ట్ వేసుకుని సభకు పోతే తప్పేమిటి? మేము ఏ బట్టలు వేసుకుని రావాలనేది స్పీకర్ చెబుతారా? పార్లమెంట్‌లో రోజూ రాహుల్ అదానీ దుర్మార్గాల మీదనే మాట్లాడుతున్నాడు.. ఇక్కడ రేవంత్ అదానీని వెనకేసుకు వస్తున్నాడు అని దుయ్యబట్టారు.

అదానీకి తెలంగాణ సంపద దోచిపెట్టేందుకు రేవంత్ కుట్ర పన్నాడు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ లగచర్లలో పరిశ్రమలు అదానీ కోసమే. రాహుల్ కూడా అదానీ టీ షర్ట్ ధరిస్తే పార్లమెంటులోకి అనుమతించారు.. ఇక్కడ ఎందుకు అనుమతించరు? రాహుల్ గాంధీనే మేము అనుసరించాం.. ఉభయ సభలు రేవంత్ నడువుతున్నాడా స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ నడుపుతున్నారు. రాహుల్‌ది ఒప్పు అయితే మేము చేసింది తప్పని స్పీకర్, చైర్మన్ ఎలా అంటారు? అని అడిగారు.

ప్రజా సమస్యలను బీఆర్ఎస్ సభలో లేవనెత్తకుండా చేయాలని ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంది. తెలంగాణ ప్రకటన డిసెంబర్ 9 న ఎలా వచ్చిందో అందరికి తెలుసు. కేసీఆర్ దీక్షతో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చింది.. కోదండరాంకు కూడా ఈ విషయం తెలుసు అని జగదీశ్ రెడ్డి అన్నారు.

రేవంత్ సమైక్యవాదుల బానిస.. రేవంత్ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి  ఎవరు ఏమన్నా తెలంగాణ ప్రకటన కేసీఆర్ విజయం, తెలంగాణ ప్రజల విజయం అని పేర్కొన్నారు.