ఈనెల 24 వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 24, 27 తేదీల్లో జరగనున్న పార్టీ ప్లీనరీ, బహిరంగ సభల కోసం ఎల్బీ స్టేడియం, పరేడ్ గ్రౌండ్ లలో మంత్రి పద్మారావు నేతృత్వంలో వేదికలను ఏర్పాటు చేస్తున్నారని, ప్లీనరీ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ప్లీనరీని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు, ప్లీనరీకి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుండి 300 మంది ముఖ్యనాయకులు, కార్యకర్తల చొప్పున మొత్తం 36వేల నుండి 40వేల మందివరకు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. బహిరంగ సభ కోసం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.
ఈ ప్లీనరీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ అంశాలపై సలహాలు, సూచనలు ఇస్తారని, ప్రభుత్వానికి కూడా తగిన సూచనలు ఇవ్వొచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరం కలిసి సంబరాలు, విజయోత్సవాలు చేసుకోలేదని, ప్రస్తుతం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభలో తెలంగాణ విజయోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. పార్టీ ప్రతినిధుల భోజనాలకు నిజాం కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్నామని, వాహనాల పార్కింగ్ కు వివిధ ప్రాంతాలను పోలీసులు గుర్తించడం జరిగిందని చెప్పారు. నగర అలంకరణ, మంచినీళ్ళు తదితర ఏర్పాట్లకు సంబంధించి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఇందుకోసం ప్రత్యేక కమిటీలను వేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. కేటీఆర్ వెంట మంత్రి పద్మారావు, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్, పూల రవీందర్ తదితరులు ఉన్నారు.