కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ఈరోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు పాల్గొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర ఆర్ధిక పరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం బాగుందని అరుణ్ జైట్లీ ప్రశంసించారని, నూతన పారిశ్రామిక విధానాన్ని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. గవర్నర్ మార్పు రాష్ట్రాలకు చెందినది కాదని, కేంద్రం పరిధిలోని అంశమని, రాష్ట్రంలో సెక్షన్-8 ను అమలు చేస్తారని అనుకోవడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1274 కోట్లను ఆర్బీఐ ఇన్ కమ్ ట్యాక్స్ కు ట్రాన్స్ఫర్ చేసిందని, డబ్బును ట్రాన్స్ ఫర్ చేయడం చట్టవ్యతిరేకమని అరుణ్ జైట్లీకి ఫిర్యాదు చేశామన్నారు. రికవరీ చేస్తే 58:42 నిష్పత్తిలో చేయాలని తెలిపినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బీసీఎల్ ఇంకా విభజించబడలేదని, ఏపీ నిధుల నుండి కాకుండా తెలంగాణ నిధుల నుండే ఆర్టీఐ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర రెవెన్యూ సెక్రెటరీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని మంత్రి చెప్పారు.