mt_logo

ఓటుకు నోటు కేసులో కేంద్రం జోక్యం చేస్కోదు- రాజ్ నాథ్ సింగ్

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, ఓటుకు నోటు కేసులో ఏసీబీ చేస్తున్న దర్యాప్తు, ఆడియో టేపులపై ఫోరెన్సిక్ లాబ్ ఇచ్చిన రిపోర్టు తదితర అంశాలను చర్చించారు. సెక్షన్-8 పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలను గవర్నర్ రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను చూసే సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంలో హైదరాబాద్ లో శాంతిభద్రతలు సంతృప్తికరంగా ఉన్నాయని, సెక్షన్-8 పై ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్నట్లుగా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, కేంద్రం నుండి మార్గదర్శకాలు ఇవ్వడంవల్ల కొత్తగా వచ్చే ప్రయోజనమేమీ లేకపోగా ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతలకు కొంత విఘాతం కలుగుతుందని గవర్నర్ వెల్లడించినట్లు సమాచారం.

సెక్షన్ 8 పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను, ఎంఐఎం, బీజేపీ తదితర పార్టీల అభిప్రాయాలను కూడా గవర్నర్ వివరించినట్లు తెలిసింది. ఇప్పడు ఉన్న పరిస్థితికి భిన్నంగా ఏ మార్పు చేసినా పార్టీలు, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుందని గవర్నర్ రాజ్ నాథ్ కు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సమాచారం అందుతుందని, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విషయాలను తన దృష్టికి తీసుకొస్తున్నారని, శాంతిభద్రత అంశంపై కూడా సమాచారం అందుతున్నదని గవర్నర్ పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పట్టుబడ్డ తర్వాతే ఏపీ నుండి సెక్షన్-8 పై తీవ్రస్థాయిలో డిమాండ్లు వస్తున్నాయని వివరించారు.

ఓటుకు నోటు వ్యవహారంపై గవర్నర్ తెలిపిన అన్ని విషయాలనూ విన్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ చట్టం ప్రకారం దర్యాప్తు సాగుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నట్లు సమాచారం. కేంద్రం ఈ వ్యవహారంలో ఏమాత్రం జోక్యం చేసుకోదని, చట్టం తన పని తాను చేసుకునే స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసినట్లు, ఇప్పటికే ఈ విషయం ఆడియో, వీడియోల ద్వారా ప్రజల్లోకి వెళ్ళినందున ఇందులో తలదూర్చే ఉద్దేశం కేంద్రానికి ఏమాత్రం లేదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అదేవిధంగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహన్ ను ఆ పదవినుండి మార్చే ప్రసక్తి లేదని కూడా కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. మీ పని తీరు పట్ల కేంద్రానికి సంతృప్తి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ మార్పు సాధ్యం కాదని, ఆ ఆలోచన లేదని, రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా పెద్దన్న పాత్ర పోషించాలని రాజ్ నాథ్ సింగ్ గవర్నర్ కు చెప్పినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *