mt_logo

ఇప్పటికే వాటాను మించి వాడుకున్నారు!..

ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన నీటికంటే ఎక్కువగానే వాడుకుందని, అయినా కూడా కృష్ణా జలాలపై అనవసర రాద్ధాంతం చేస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఫిర్యాదు చేశారు. నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ మంగళవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఉమాభారతితో హరీష్ రావు విడిగా సమావేశమై కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును వివరించారు. కృష్ణా నదీ జలాల విషయంలో ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తనకు కేటాయించిన వాటాకంటే 11 టీఎంసీల నీటిని అదనంగా వాడుకుందని, తెలంగాణ ఇంకా 112 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉందని హరీష్ చెప్పారు.

బచావత్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కలిపి మొత్తం 811 టీఎంసీల నీటిని కేటాయించారని, ఇందులో తెలంగాణ వాటా 299 టీఎంసీలని, ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలని వివరించారు. ఈ సంవత్సరం రుతుపవనాల తర్వాత నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో సుమారు 550 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇందులో తెలంగాణకు 229 టీఎంసీల వాటా దక్కుతుందని, అయితే ఇందులో ఇప్పటివరకు కేవలం 117 టీఎంసీలనే వాడుకున్నదని, ఇంకా 112 టీఎంసీల నీటిని వాడుకోవలసి ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం 321 టీఎంసీలు వాడుకోవాల్సి ఉండగా ఇప్పటికే 11 టీఎంసీలు అదనంగా వాడుకుందని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడానికే నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లపై పూర్తి అధికారాలను ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును కోరిందని, తెలంగాణ న్యాయమైన డిమాండ్లను అడ్డుకోవడానికే ఏపీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి యాక్సెలెరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (ఏఐబీపీ) కింద రూ. 103.725 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉందని, ఇప్పటికే ఈ విషయంపై ప్రధాని కార్యాలయానికి, జల సంఘానికి తమ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని హరీష్ రావు ఉమాభారతిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *