mt_logo

ఇంటింటి సర్వేపై సందేహాలు-సమాధానాలు – Part 1

సందేహం: సర్వే జరుగనున్న 19వ తేదీన ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించకుంటే పరిస్థితి ఏమిటి?
సమాధానం: తెలంగాణ పది జిల్లాల్లో ప్రైవేటు సంస్థలు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాల్సిందే. ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అవుతాయి.

సందేహం: గిరిజనులు ఉపాధి కోసం అడవుల్లో సంచరిస్తుంటారు.. వారి నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది?
సమాధానం: నివాస స్థలాలు(హాబిటేషన్స్) ఎక్కడ ఉంటే అక్కడికి సర్వే సిబ్బంది తప్పనిసరిగా వెళతారు. సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ప్రతి కుటుంబంలోని వ్యక్తుల పేర్లను నమోదు చేస్తారు.

సందేహం: సంచార జాతులు ఒక చోట స్థిరనివాసం ఉండరు.. అలాంటి వారిని ఏవిధంగా పరిగణలోకి తీసుకుంటారు ?
సమాధానం: సర్వే జరిగే రోజున వారు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే వారి వివరాలను నమోదుకు చర్యలు తీసుకోవాలని సర్వే యంత్రాంగానికి ఖచ్చితమైన ఆదేశాలు జారీచేస్తున్నాం.

సందేహం: అత్యవసర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఇంటిలో ఉండలేరు కదా?
సమాధానం: ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన వివరాలు వారి కుటుంబసభ్యులు తగిన ఆధారాలతో చూపిస్తే సరిపోతుంది. సర్వే సిబ్బంది కూడా అంగీకరిస్తారు.

సందేహం: ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న రోగులను నమోదు చేసుకుంటారా?
సమాధానం: ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నట్లుగా ఆధారాలను కుటుంబసభ్యులు చూపిస్తే సరిపోతుంది.

సందేహం: కుటుంబసభ్యులందరూ ఉండాల్సిందేనా ?
సమాధానం: అనివార్య కారణాల వల్ల కుటుంబసభ్యులు అందుబాటులో లేనిపక్షంలో అందుకు గల కారణాలు, వాటికి సంబంధించిన ఆధారాలను చూపించి కుటుంబసభ్యుల్లో ఒకరు పూర్తి వివరాలను వెల్లడిస్తే సరిపోతుంది.

సందేహం: ఇంటికి తాళం వేసి ఊరికెళ్లిన వారి సంగతేంటి?
సమాధానం: సర్వే రోజున ఇంటికి తాళం వేసినట్లుగా ఎన్యుమరేటర్ గుర్తించి నమోదు చేస్తారు. ఆ తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు సర్వే రోజున ఎందుకు అందుబాటులో లేరు..? ఎక్కడికి వెళ్ళారు..? అనే వివరాలను ఆధారాలతో పాటు నిర్ధారించాల్సి ఉంటుంది.

సందేహం: మానసిక వికలాంగులు, మతి స్థిమితం లేని వారి పేర్లను కూడా నమోదు చేసుకుంటారా?
సమాధానం: పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరి వివరాలు, అన్ని వివరాలు నమోదు అవుతాయి.

సామాజిక సర్వే స్థానికతకు కాదు

-రేషన్‌కార్డులు తొలగించడానికి అంతకంటే కాదు
-రాష్ట్రమంతటాఒకేరోజున సర్వే:రేమండ్ పీటర్

ఇంటింటికీ సమగ్ర సామాజిక సర్వేపై ప్రజల్లో నెలకొన్న అభ్యంతరాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. స్థానికేతరులను హైదరాబాద్ నుంచి తరిమికొట్టడానికే ఈ సర్వే చేపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నివాసం ఉంటున్న కుటుంబాలెన్ని? వారెవరు? ఏ గ్రామంలో నివాసం ఉంటున్నారు? ఏ పనిచేస్తున్నారు? అనే విషయాలను నిర్ధారించడానికే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జే రేమండ్ పీటర్ తెలిపారు. శుక్రవారం ఆయన సచివాలయంలో సెర్ప్ సీఈవో ఏ మురళి, పంచాయతీరాజ్ ఇన్‌చార్జి కమిషనర్ రామారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో సామాజిక సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్వేపై నెలకొన్న అనుమానాలకు ఆయన వివరణ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న హైదరాబాద్ సహా తెలంగాణలోని 10 జిల్లాల్లో సర్వే నిర్వహిస్తాం.
-ఈసర్వేకు స్థానికతకు సంబంధం లేదు.
-కుటుంబసభ్యులందరూ సర్వేరోజు ఇంటికి వచ్చిన ఎన్యూమనేటర్ ఎదుట ఉండాలి.
-సర్వే రోజు ఇంటివద్ద లేని కుటుంబసభ్యుల వివరాలు పొందుపర్చే అవకాశం ఉండదు.
-ఇతర దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉండే కుటుంబసభ్యులకు సంబంధించిన ఆధారాలు చూపే అవకాశం కల్పించాం.
-ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన వారి ఆధారాలు సర్వే సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది.
-ఎక్కడ నివాసం ఉంటున్న వారు అక్కడ తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
-ఈ సర్వేకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను శనివారం రూపొందిస్తాం.
-సర్వేకు సంబంధించిన ఫార్మెట్ ఇంకా సిద్ధం కాలేదు. రెండు రోజుల్లో ఫైనల్ చేస్తాం.
-కుటుంబ సభ్యులు సర్వేలో తప్పుడు సమాచారం ఇస్తే ఆ తర్వాత దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
-ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్న వారి కోసం ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రత్యేక రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పించే అవకాశం లేదు.
-సర్వే అనంతరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాష్ట్రంలో స్థిరపడే వారికి కార్డులు కల్పించే విషయం పరిశీలిస్తున్నాం.
-రేషన్ కార్డులు తొలగించడానికే సర్వే అనే ప్రచారంలో అర్థం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *