mt_logo

అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందాలి

– అదే తెలంగాణ జేఏసీ లక్ష్యం
– సంపూర్ణ తెలంగాణ కోసం బాధ్యత వహిస్తాం
– ప్రజల ఆకాంక్షలతో విజన్ డాక్యుమెంట్
– సత్వర సమస్యలపై కనీస ఉమ్మడి కార్యాచరణ
– ఎన్నికలపై ప్రజలకు స్పష్టమైన పిలుపునిస్తాం
– పోలవరం కోసం గిరిజనులను బేదాఖలు కానీయం

రేపటి తెలంగాణ అభివృద్ధి ఫలాలు సాధారణ ప్రజలకు అందాలని, అదే తెలంగాణ జేఏసీ లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన దిశలో తెలంగాణ ప్రజలతో మమేకమైనప్పుడే టీ జేఏసీ కర్తవ్యం పూర్తవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల న్యాయమైన, ప్రజాస్వామికమైన, చట్టబద్ధ ఉద్యమాల నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో, సంపూర్ణ తెలంగాణ ఏర్పాటులో ఎప్పటివలెనే టీ జేఏసీ బాధ్యతగా నాయకత్వం వహిస్తుందని కోదండరాం ప్రకటించారు. సాధారణ ప్రజలకు అభివృద్ధి ఫలితం లభించే విధంగా కృషి జరిగినప్పుడే జయశంకర్‌సార్‌కు నిజమైన నివాళిని అందించినట్టవుతుందని శనివారం టీ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఇవీ ఆ వివరాలు..

విజన్ డాక్యుమెంట్ ఎందుకు?
ఆరుదశాబ్దాల స్వప్నం నెరవేరింది. సీమాంధ్ర పెత్తందారీ పాలకుల స్వార్థ ధనకాంక్షవల్లనే తెలంగాణ ధ్వంసమయిందన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలంగాణ పునర్నిర్మాణం ఏ విధంగా జరగాలి? అనేది చర్చనీయాంశం చేసేందుకే విజన్ డాక్యుమెంట్. ప్రధానంగా అమరుల కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించాలని విజన్ డాక్యుమెంట్‌లో వాదించాం. తెలంగాణ.. అమరుల స్వప్నం అనే విషయాన్ని అన్నీ పార్టీలు అంగీకరించాయి. అందుకని అమరుల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం జరుగాలని, వ్యవసాయ భూమి ఇవ్వాలని, అమరుల కుటుంబాల్లోని వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, నెక్లెస్‌రోడ్‌లో అమరుల స్తూపం నిర్మించాలని విజ్ఞప్తి చేశాం. ఈ డాక్యుమెంట్‌ను తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న అన్నీ రాజకీయ పార్టీలకు అందజేస్తాం. త్వరలో విస్తృతస్థాయి జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం.

టీ జేఏసీ మీటింగ్ ఎందుకు జరుగలేదు? రాజకీయ పార్టీలలోకి వెళుతున్న వారిని ఎందుకు వారించటం లేదు? మిత్రులు రాజకీయపార్టీలలోకి వెళ్లడం వల్ల జేఏసీ బలహీనపడటం లేదా?
తెలంగాణ ఏర్పడిన తర్వాత సంతోషాన్ని హాయిగా అనుభవించాలనేది ప్రధాన ఆలోచన. రాజకీయాలను అంటరానివిగా జేఏసీ ఎప్పుడూ పరిగణించలేదు. జేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు రాజకీయ పార్టీలలోకి వెళ్లినంత మాత్రాన జేఏసీ బలహీనపడటం లేదు. ఉదాహరణకు శ్రీనివాస్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. ఆయన స్థాపించిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మరింత ధృఢంగా తెలంగాణ పునర్నిర్మాణంలో అంకితంకావటానికి సిద్ధంగా ఉన్నది. ఈ మాట జేఏసీలోని భాగస్వామ్య సంఘాలన్నింటికీ వర్తిస్తుంది. ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధన టీ జేఏసీకి అంతఃసూత్రం. ఇకనుండి పునర్నిర్మాణం అంతఃసూత్రంగా పని చేస్తుంది. అందుకని జేఏసీ బలహీనంకావడం అనే మాటకు అవకాశం లేదు. ఒకేసారి ఎన్నికల వాతావరణం ఏర్పడటంతో జేఏసీ మీటింగ్ జరుగలేదు. అయితే జేఏసీ కర్తవ్యం ఎప్పుడూ ఆగిపోలేదు. తెలంగాణ సిద్ధించిన తర్వాత నేను, ఇతర జేఏసీ మిత్రులు ఇప్పటికే కొన్ని వందలసభల్లో మాట్లాడాం. గత 15రోజులుగా జేఏసీ మిత్రులందరం కలుసుకుంటూనే ఉన్నాం. విజన్‌డాక్యుమెంట్ రూపొందించడంలో కుస్తీ పడుతున్నాం. వ్యక్తులు పార్టీలలోకి వెళ్లడాన్ని జేఏసీ వారించదు. వ్యక్తుల స్వేచ్ఛను జేఏసీ ఏనాడూ ప్రశ్నించలేదు. లక్ష్యసాధన కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. జేఏసీలోని కొంతమంది మిత్రులు చట్టసభలలో తెలంగాణవాణిని బలంగా వినిపించాలని నిర్ణయించుకున్నారు. మేము ప్రజాక్షేత్రంలోనే పనిచేయాలని అనుకున్నాం. అందుకని జేఏసీ ఉనికి ప్రశ్నార్థకమవుతున్నదా? జేఏసీ మళ్లీ సంఘటితమౌవుతుందా? వంటి ఊహాగానాలకు, ప్రశ్నలకు జేఏసీ ఆచరణయే సమాధానం.

త్వరలో టీ జేఏసీ విస్తృత సమావేశం నిర్వహిస్తాం. రాజకీయ కార్యాచరణ చెప్తాం. తెలంగాణ ప్రజలకు స్పష్టమైన పిలుపునిస్తాం. ఎలాంటి దాపరికాలు లేవు.

కనీస ఉమ్మడి కార్యాచరణ పేరుతో మరో డాక్యుమెంట్ రూపొందిస్తున్నారట కదా!
విజన్ డాక్యుమెంట్ విస్తృతమైనది, వైవిధ్యభరితమైనది, విశాలమైనది. అదే వరుసలో తక్షణం తెలంగాణ ప్రజలకు వెంటనే ఫలాలు అందేలా కనీస ఉమ్మడి కార్యాచరణ రూపొందించాం. జేఏసీ మిత్రులందరం ఈ పనిలో ఉన్నాం. తెలంగాణలోని గృహ, కుటీర, లఘు పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పించాలనేదే ప్రధాన ఎజెండా. పట్టువస్ర్తాలను నేసిన చేనేత కార్మికులు ఆకలిచావులతో మరణిస్తున్నారు. ఈ అసహజ మరణాల నుంచి తేరుకోవడానికే తెలంగాణను కోరుకున్నాం. చేనేతవంటి గ్రామీణ జీవన వృత్తులన్నింటికీ ప్రాధాన్యం లభించేలా, మార్కెంటింగ్ సౌకర్యాలు కల్పించేలా కనీస ఉమ్మడి కార్యాచరణ రూపొందించాం. దీనిని వివిధ రాజకీయ పార్టీలకు అందిస్తాం.

పోలవరం నిర్మాణంపై వస్తున్న వాదోపవాదాలు..
ఇంతకాలంగా తెలంగాణను దోచుకున్న గుప్పెడుమంది సీమాంధ్ర దోపిడీదారులు పోలవరం నిర్మాణంకోసం పట్టుపడుతున్నారు. ఈ గుప్పెడుమందే సీమాంధ్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలను దూరం చేశారు. ఇవేశక్తులు జల వనరులపైన పెత్తనానికి తహతహలాడుతున్నాయి. విపరీతమైన ప్రవాహవేగంతో వచ్చే గోదావరివంటి పెద్దనదికి ఆనకట్ట కట్టాలని ప్రణాళికలు వేయడం ఎంతవరకు సమర్థనీయం? ఆ కట్ట ప్రవాహ వేగాన్ని తట్టుకోగులుగుతుందా? భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని భూగర్భశాస్త్రజ్ఞులు వారించిన తర్వాతకూడా అదే ప్రాంతంలో పోలవరం నిర్మించాలనడం సమంజసం కాదు. ఇంతేకాక పోలవరం నిర్దేశించిన ప్రాంతంలో 80 శాతానికి పైగా సాగునీటి వనరులు ఉన్నాయి. అక్కడ మూడుకార్లు పంటలు పండుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాటి మనిషి జీవించే హక్కును కాలరాసే అధికారం ఎవరికైనా ఉంటుందా? మూడు లక్షల గిరిజన కుటుంబాలు నిర్వాసితులవుతుంటే ప్రేక్షక పాత్ర వహించాల్సిందేనా? అనేది చర్చనీయాంశం. తెలంగాణ భూమిని, గిరిజనుల జీవితాలను పోలవరం కోసం బేదాఖలు చేయడానికి తెలంగాణ సిద్ధంగా లేదు. ఈ అంశమే జేఏసీ ప్రధాన ఎజెండా.

Courtesy:NamastheTelangana.Com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *