mt_logo

ఇన్నోవేట్.. ఇంక్యుబేట్.. ఇన్ కార్పోరేట్!

గ్లోబల్ మార్కెట్ ను ఆకట్టుకునేలా మేడిన్ తెలంగాణ ముద్ర కలిగి ఉన్న మన వస్తువులను, ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా తెలంగాణకు ప్రముఖ స్థానం కల్పించే ప్రయత్నం! ఈ దిశగా ఇన్నోవేట్.. ఇంక్యుబేట్.. ఇన్ కార్పోరేట్ అనే సూత్రాన్ని ఉపయోగించి ఎన్నో ఆకర్షణీయమైన అంశాలను చేరుస్తూ రాష్ట్ర పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు తయారు చేయబడిందే టీ-పాస్ డ్రాఫ్ట్ (తెలంగాణ స్టేట్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) – 2014! ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాలుగా పేరున్నవాటిని సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కే ప్రదీప్ చంద్ర ఈ బిల్లును రూపొందించారు.

ఈ బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగానే అన్ని పక్షాలనుండి అనుకూల స్పందన లభించింది. ఈ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో గురువారం చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పారిశ్రామికాభివ్రుద్ధిలో ప్రభుత్వ లక్ష్యాలను ఇప్పటికే వివరించి ఉన్నా, శాసనసభలో చర్చ జరిగే సమయంలో మరింత స్పష్టత లభించనుంది. ఇదిలాఉండగా ప్రతి అంశంపైనా జవాబుదారీతనం వహించడాన్ని తప్పనిసరి చేస్తూ తాజా పారిశ్రామిక విధానానికి చట్ట రూపాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.

ఈ విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందించనుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి హైదరాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ) లో పలు రంగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ ముగిసిన అనంతరం వారికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తారు. నీటిపారుదల, పంచాయితీ రాజ్, ఆర్అండ్ బీ తదితర శాఖలు చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో వీరికి భాగస్వామ్యం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ప్రతి జిల్లాలోనూ మహిళల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని నూతన పారిశ్రామిక విధానంలో పొందుపరచారు. ఫిక్కీ-ఎఫ్ఎల్ వో, కోవే, ఎలీప్, వంటి సంస్థల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విధానంలో అవినీతి ఉండకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లయితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *