mt_logo

ఇంకా మనమీ రాష్ట్రంలో కలిసి ఉండగలమా?

By: కొణతం దిలీప్

ఇవ్వాళ ఉదయం APNGO ఆఫీసుకు ఫోన్ చేశాను.

నేను 7 నాటి మీటింగుకు రావాలని అనుకుంటున్నానని, దానికి అవసరమైన గుర్తింపు కార్డు ఎక్కడ ఇస్తారని అడిగాను.

అటువైపు నుండి జవాబు: “మీకు గుర్తింపు కార్డు అక్కర్లేదండి. నేరుగా వచ్చేయవచ్చు”

నేను మళ్లీ ప్రశ్నించాను: “నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదండి. మరి పోలీసులు కేవలం గుర్తింపు కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులనే అనుమతిస్తాం అని ప్రకటించారు కదా?”

అటువైపు నుండి జవాబు: “మరేం పర్లేదండి. ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, ఎవరైనా రావచ్చండి. మీదగ్గర రేషన్ కార్డు లాంటి గుర్తింపు పత్రం ఉంటే చాలు మీరు వచ్చేయవచ్చు. పోలీసులు ఏమీ అనరండి. అక్కడ మనాళ్లుంటారు, వాళ్లు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు”

ఇది మిత్రులారా మన ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి ఏర్పాటు చేస్తున్న మీటింగు కథ!

ఓవైపు పోలీసులేమో షరతులతో కూడిన అనుమతులు ఇచ్చామనీ, ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మరెవరూ రాకూడదనీ పత్రికా ప్రకటనలు ఇస్తుంటే, APNGO వారు మాత్రం ఇంటికి ఇద్దరు, ముగ్గురు రావాలనీ, ప్రభుత్వ ఉద్యోగులే కాదు అందరూ రావచ్చనీ, సభా స్థలం వద్ద “రిసీవ్” చేసుకుంటామనీ చెబుతున్నారు.

అదే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగస్తుల ఆటల పోటీల కొరకు 10 రోజుల ముందే తెలంగాణ ఎన్.జీ.ఓ.లు దరఖాస్తు చేసుకుంటే, వారికి అనుమతి ఇవ్వని స్టేడియం అధికారులు, ఏ దరఖాస్తూ లేకుండానే APNGOల సభకు అనుమతి ఇచ్చారంటే అర్థం అవ్వట్లేదూ ఇది సీమాంధ్రుల ఇష్టారాజ్యమని?

శాంతి ర్యాలీ తీస్తామని తెలంగాణ జేయేసీ అనుమతి అడిగితే ఇవ్వరు. మీటింగు పెట్టుకుంటామని మంద కృష్ణ అడిగితే అనుమతి లేదు. సభ పెట్టుకుంటామని స్టూడెంట్ జేయేసీ అడిగితే నో పర్మిషన్.

కానీ సీమాంధ్రుల సభకు మాత్రం అన్ని సౌకర్యాలూ ప్రభుత్వమే సమకూరుస్తుంది.

ఇది విన్నాక నాకొకసారి మిలియన్ మార్చ్, సాగర హారం మీటింగులకు మనం ఎన్ని ముళ్లకంచెలు, ఎన్ని టియర్ గ్యాసులు దాటి వెళ్లామో గుర్తుకువచ్చింది.

ఎన్ని బస్సులు, రైళ్లు ఆపేశారో, ఎంతమందిని బైండోవర్లు, అరెస్టులతో వేధించారో కళ్లముందు కదలాడింది.

ప్రభుత్వం ఆఖరు క్షణంలో అనుమతిస్తే సాగర హారానికి రాబోయి, పోలీసుల దాడిలో మరణించిన రాజిరెడ్డి గుర్తుకు వచ్చాడు. మినీ విజయవాడగా పేర్కొనే కే.పీ.హెచ్.బీ వీధుల గుండా రాజిరెడ్డి భౌతికకాయం ఉంచిన వాహనం వెనుక నిస్సహాయంగా నడిచిన రోజు జ్ఞప్తికివచ్చింది.

టియర్ గ్యాస్ షెల్ ను ముఖానికి గురి చూసి కాలిస్తే దవడ పగిలిపోయి, మహావీర్ హాస్పిటల్ బెడ్డు మీద నేను చూసిన వరంగల్ తమ్ముడిని ఇంకా నేను మరువలేదు.

గత నాలుగేళ్లలో ఎన్ని డజన్ల మీటింగులకు అనుమతి నిరాకరించారు ఈ సీమాంధ్ర పాలకులు. చివరికి బతుకమ్మ ఆడడానికి హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకుంటున్నాం ప్రతి సంవత్సరం.

రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల కొరకు ఎంత రక్తం ధారబోసారు మన అక్క చెల్లెండ్లు, అన్న తమ్ముండ్లు.

ఇప్పుడు మన గడ్డ మీదికే వచ్చి, వాళ్లు మనకే సవాల్ విసురుతున్నారు.

దీన్ని వివక్ష అనడం చాలా చిన్న పదమేమో. ఇది సీమాంధ్ర పాలకులు తెలంగాణను చిదిమేసేందుకు పన్నిన దుర్మార్గమైన కుట్ర!  ఏదో విధంగా హైదరాబాదులో ఒక రెచ్చగొట్టే సభ పెట్టి, తద్వారా హైదరాబాద్ వీధుల్లో రక్తం పారించి అయినాసరే తెలంగాణను అడ్డుకోవాలనే కౄరమైన కుట్ర ఇది. దీని రూపకర్తలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజీపీ దినేశ్ రెడ్డి.

ఇంకా మనమీ రాష్ట్రంలో కలిసి ఉండగలమా?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *