తెలంగాణ బిల్లులో ఆర్ధిక పరమైన వివరాలు లేవని, బిల్లు అసమగ్రంగా ఉందని సీమాంధ్ర నాయకులు తెగ హడావిడి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయంపై కేంద్రానికి ఒక లేఖ కూడా రాసినట్లు విష ప్రచారం చేస్తున్నారు. కాగా సీమాంధ్ర నేతలకు ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అదేంటంటే, తమకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి లేఖ రాలేదని, బిల్లులో లోపాలు ఉన్నాయని, సవరణలు చేయాలని కోరుతున్నట్లుగా లేఖ రాశారని చెబుతున్న వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతే కాదు బిల్లులో పొందుపరచిన సమాచారం అంతా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేనని, కావున తప్పొప్పులకు తాము బాధ్యులం కాదని కూడా కేంద్ర హోం శాఖ వర్గాలు అంటున్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్ సీఎస్ పీకే మహంతికి ఒక లేఖ పంపినట్లు సమాచారం. అందులో అసెంబ్లీ స్థాయిలో కేవలం చర్చ మాత్రమే ఉంటుందని, ఏవైనా సవరణలు ఉంటే బిల్లు పార్లమెంటుకు సమర్పిచే సమయంలో మాత్రమే నివేదించాలని, కేవలం అభిప్రాయాలను మాత్రమే రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారని, ఓటింగ్ ఉండదని, రాష్ట్రపతి నుండి బిల్లు కేంద్ర కేబినెట్ కు, అక్కడినుండి పార్లమెంటుకు వెళుతుందని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే కేంద్ర కేబినెట్ చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని వివరించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్సిపై వస్తున్న వార్తలపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ముసాయిదా బిల్లుపై సవరణలు ప్రతిపాదించడం అసెంబ్లీకి, ఇక్కడి అధికారులకు లేదని ఖండించడం గమనార్హం.