తెలంగాణ జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో ఇంటర్వ్యూ
—
‘సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు చదువుకున్నవాళ్లు మౌనంగా ఉండడం కంటే ప్రపంచంలో పెద్ద నేరంలేదు! చదువులేని వాళ్లకు అనుభవం ఉంటుంది. కాని కారణాలు తెలియవు! మనం వాళ్ల తరపున నిలబడి వాళ్లకు మార్గనిర్దేశనం చేసే చిన్న పని మాత్రమే మనది!’ అన్న జయశంకర్ మాటలనే తన గమ్యానికి దారిని చేసుకున్నాడు అతను! ఆ దార్లోనే పౌరహక్కుల ఉద్యమం మొదలు తెలంగాణ ఉద్యమందాకా నడిచాడు! ఎన్నో రాళ్లు, రప్పలు.. ముళ్లు, పొదలు.. భయపడలేదు! ఆ ధైర్యం ప్రాపంచిక ధృక్పథం ఇచ్చిందే! తెలంగాణ సాధన అనే ఒక్క గమ్యం చేరాడు సమూహంగా! ఇంకా చాలా ఉన్నాయ్ అంటూ మళ్లీ నడకసాగించాడు! ఆ అలుపెరుగని బాటసారి, నిత్యవిద్యార్థి ప్రొఫెసర్ కోదండరామ్! ఆయన లోపలి మనిషి ఇది….
మా నాన్న (జనార్థన్‌రెడ్డి) పుట్టిపెరిగింది కరీంనగర్‌జిల్లా ఊటూరు గ్రామం. మా బాల్యం కూడా కొంత అక్కడ గడిచింది. తర్వాత్తర్వాత అక్కడ బతుకుతెరువు అవకాశాలు లేకపోయేసరికి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు వలస వచ్చి అక్కడే స్థిరపడింది మా కుటుంబం. తనకు వచ్చిన కొంత చదువు, లెక్కలతో కాంట్రాక్టర్ల దగ్గర గుమాస్తాగా చేరిండు. నిజాయితీగా పనిచేసి వాళ్లకు పార్టనర్ అయిండు. కొంత సంపాదించుకొని భూమి కొన్నడు. అట్లా మాకు ఊహ తెలిసేనాటికే మా నాన్న ఆర్థికంగా ఎదిగున్నడు కనుక మా బాల్యం సుఖంగనే గడిచింది. మంచిర్యాలలో మంచి స్కూళ్లు లేకుండే అందుకే ఒకటి,రెండు తరగతులు ఇంట్లోనే చదువుకొని హన్మకొండకు వెళ్లినం. అయితే మిగిలినవాళ్లకు భిన్నంగా తెలుగుమీడియంలో చేరినం. తెలియని విషయాలు చదువుకోవడానికి, తెలిసిన విషయాలను ఇతరులకు చెప్పడానికి ఈ మాధ్యమమే వీలుగా ఉండె! మేం మొత్తం ఏడుగురం తోబుట్టువులం. నాకు ఇద్దరక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఓ తమ్ముడు!
ఆడపిల్లలకు చదువు.. డిగ్నిటీ ఆఫ్ లేబర్
ఎందువల్లనోగాని మా నాన్న రెండువిషయాల్లో పట్టింపుగా ఉండేది. ఒకటి.. ఆడపిల్లలు కూడా చదువుకోవాలని. అందుకే మా ఇంట్లో మా అక్కచెల్లెళ్ళను బాగా చదివించిండు. మా అక్క మెడిసిన్ చేసింది. పట్టుబట్టి మా అమ్మ తనపేరు తాను రాసుకునేలా అక్షరాలు నేర్పిండు. ఇంటికి న్యూస్‌పేపర్ తెప్పిస్తుండె నాన్న. అక్షరాలను కూడబలుక్కొని పేపర్ చదివే ప్రయత్నం చేస్తుండె అమ్మ. అట్లాఅట్లా అనర్ఘళంగా చదివేస్థితికి వచ్చి తను చదివిన విశేషాలను మా నాన్నతో చెప్తుండె కూడా! నిజాం గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా వచ్చిన దేశోద్ధారక గ్రంథమాలకు సంబంధించిన ఒకట్రెండు పుస్తకాలుండేవి ఇంట్లో! వాటినీ చదివేది. ఆదివారం అనుబంధాలన్నింటిని ఒక్కచోట చేర్చి వీలున్నప్పుడల్లా చదువుకునేది. అట్లా పుస్తకాలు చదవడం మాకూ అలవాటైంది. దాంతోనే వరంగల్ లైబ్రరీలోని పుస్తకాలన్నిటినీ చదివినం. విశ్వనాథ నుంచి అడవిబాపిరాజు మొదలైనవాళ్లందరి రచనలను చదివినం. నాన్న రెండో పట్టింపు.. తారతమ్యాల విషయంలో. అందరినీ సమానంగా చూడాలని చెప్పేటోడు. ఇంటికి వచ్చినవారిని ఆదరించాలనే విషయాలను గట్టిగా చెప్పిండు. రెస్పెక్ట్ ఫర్ లేబర్ కూడా నేర్పించిండు. నేను ఈ పనిచేస్తా ఇది చేయను అని కాకుండా అవసరమొచ్చినప్పుడు ఎవరైనా ఏ పనైనా చేయాలే అనేవాడు. ఆడంబరాలను సహించేవాడు కాదు!
ఇంగ్లీష్.. తెలుగు ప్రపంచాల మధ్య
వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో బీఏ తెలుగుమీడియం. మాదే ఫస్ట్ బ్యాచ్. ఇంగ్లీష్ మీడియం పొయ్యే సాహసం చేయలేక తెలుగు మీడియంలో చేరిన. తెలుగులో పుస్తకాల్లేవ్. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే ఏమీ అర్థంకాకపోయేవి. అనవసరమైన సంస్కృతపదాలతో చదవడానికి ఇబ్బందిగా ఉండేది. దాంతో ఇంగ్లీష్ పుస్తకాలను చదివి తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకునేటోళ్లం. ప్రతి చాప్టర్ చదవంగానే దాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసేవాళ్లం. దీనివల్ల మాకు అటు చదవడం, ఇటు రాయడం రెండూ ప్రాక్టీస్ అయినయ్. ఇది మాకుమాత్రమే ఉన్నటువంటి అనుభవం. ఎమ్మేలో కూడా ఈ పరిస్థితే. అప్పుడూ గంటలుగంటలు లైబ్రరీలో కూర్చొని ఇంగ్లీష్ పుస్తకాలు చదివి ఆ పుస్తకాలనే ట్రాన్స్‌లేట్ చేసేటోళ్లం. ఆ రోజుల్లో కాంగ్రెస్‌పార్టీ వ్యవహారాల మీద మంచి గ్రంథం అంటే స్టాన్లీకొచానిక్‌దే! దాన్ని చదివి, అర్థం చేసుకొని ఆ పుస్తకం మొత్తాన్ని 25 పేజీల వ్యాసంగా తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసినం. అదిచూసి అప్పుడు మాకు ప్రొఫెసర్‌గా ఉన్న శాంతాసిన్హాగారైతే ఆశ్చర్యపోయిండ్రు పిల్లలు ఎంతబాగా రాసింరని. తర్వాత నాలుగైదు బ్యాచ్‌లూ మా నోట్స్‌నే ఫాలో అయిండ్రు. ఇటు ఇంగ్లీష్ అటు తెలుగు.. ఈ రెండు ప్రపంచాల మధ్య తిరిగేటప్పటికి రెండు చోట్ల ఉన్న పరిస్థితులు అర్థమవడం సులువైంది. తర్వాతతర్వాత ఇది చాలా ఉపయోగపడింది మాకు. అయితే అప్పుడు లెక్చరర్లు, ప్రొఫెసర్ల ప్రోత్సాహం కూడా బాగుంటుండె. తెలుగుమీడియంలో నుంచి వచ్చినమని మధుసూధన్‌రెడ్డి, కౌజరాజం, సుభాష్‌చందర్‌రెడ్డి, ఆచార్యరామిరెడ్డి, హరగోపాల్ సర్ లాంటోళ్లు మా పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడ్తుండె!
1975.. ఎమర్జెన్సీ
ఎమర్జెన్సీ పెద్ద మైలురాయిగా చెప్పొచ్చు. నా జీవితాన్నే కాదు మా తరం జీవితాలను ఒక కుదుపుకుదిపిన ఘటన అది. కానీ అంతకుముందు 69 ఉద్యమం కూడా చాలా ప్రభావం చూపింది. అప్పుడు నేను టెన్త్. ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనలేదు కాని మీటింగ్‌లకు అటెండ్ అయిన. ‘తెలంగాణ భాష, యాస పట్ల వివక్ష ఉంది, మనల్ని చిన్నచూపు చూస్తుండ్రు’ అనే వాస్తవం తెలిసింది. ఇది మంచిది కాదు అనే భావన ఏర్పడింది. అయితే మా నాన్న సమైక్యవాది. అప్పటిదాకా మా నాన్న ప్రభావంతో ఉన్న మాకు 69 ఉద్యమం తెలంగాణ పట్ల నాకో సొంత అభిప్రాయం ఏర్పడ్డానికి బీజం వేసింది అని చెప్పొచ్చు! ఈ ఉద్యమంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడ్డరు. నేనూ టెన్త్‌లో ఓ సబ్జెక్ట్ ఫెయిలై మళ్లీ రాసి పాసైన. ఎమర్జెన్సీ టైమ్ వరకు నాది బీఏ అయిపోయింది. అప్పుడు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి వైస్ చాన్సలర్‌గా ఉండె. అప్పటిదాకా డిగ్రీ పరీక్షలకు మాస్ కాపీయింగ్ నడిచినుండె. ఈయనొచ్చి మాస్ కాపీయింగ్ మీద సీరియస్ అయిండు. అందుకే ఎగ్జామ్స్‌ను స్ట్రిక్ట్‌గా కండక్ట్ చేసిండు. చదువుకున్నోళ్లకు అది లాభమైంది. వరంగల్‌లో అప్పుడున్న నాలుగుకాలేజీల్లోకి బిఏ పాసైనోళ్లు పదిహేనుఇరవై మందే! అందులో నేనొకడిని. సెకండ్‌క్లాస్ వచ్చింది. ఇది నాకు కాన్ఫిడెన్స్‌నిచ్చింది. దాంతోనే ఉస్మానియా ఎమ్మేఎంట్రెన్స్ రాస్తే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ రెండిట్లో సీట్ వచ్చింది.
ఎకనామిక్స్ అయితే వరంగల్‌లో చదవాల్సొస్తదని ఉస్మానియాలో చదవడం కోసం పొలిటికల్ సైన్స్‌లో చేరిన. మా ఆఖరి బీఏ పరీక్ష రోజు మొదలైన ఎమర్జెన్సీ ఎమ్మేపూర్తయ్యేదాకా ఉంది. అప్పుడు క్యాంపస్ అంతా పోలీస్‌క్యాంప్‌లా ఉండేది. క్లాస్‌రూమ్‌లో టీచర్సే అనేది ‘ఈ క్లాస్‌రూమ్‌లోనే పోలీస్ ఏజెంట్ ఉండొచ్చు.. తెల్లవారే పోలీస్‌లు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి’ అని గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడాల్సివచ్చినా! ఇట్లనే ఒకరోజు మెస్‌లో మా సబ్జెక్ట్‌కి సంబంధించిన అంశం గురించే మాట్లాడుకున్నం. పోలీస్‌లకు ఎట్ల తెల్సిందో ఏమో తెల్లవారే వార్డెన్ దగ్గరకు వచ్చిండ్రు. అప్పుడు వార్డెన్ ‘నేను లేకుండా ఎవరూ ఏ మీటింగ్ పెట్టుకోవద్ద’ని స్ట్రిక్ట్‌గా చెప్పిండ్రు. న్యూస్ పేపర్లుకూడా బ్లాంక్‌గా వస్తుండె. ప్రజాస్వామ్యం ఇట్లయిపోవుడేందని చర్చ. ఇంకోవైపు ల్యాండ్‌రిఫార్మ్స్. అవి కరెక్టాకాదా అనే విషయానికి అనుబంధంగా పొలిటికల్‌సైన్స్ క్లాస్‌లో స్వేచ్ఛా, సమానత్వంలో ఏది గొప్ప అనేదానిమీద క్లాస్‌రూమ్‌లో భీకరమైన చర్చ. విషయాల మీద మాకు లోతైన అవగాహన ఏర్పడ్డానికి ఈ చర్చలు ఎంతో హెల్ప్ అయినయ్. వీటితోనే సోషలిస్ట్ ప్రభావమూ మా మీద పడింది. లాస్కీ రచనలు చదివిన తర్వాత సమాజంలో సమానత్వం ఎంతోకొంత లేనిదే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యంకాదనే విషయం బోధపడింది. ఇండియాలో ప్రజాస్వామ్యం ఎందుకు బలంగా లేదు అన్న మా ప్రశ్నకు సమాధానం వెదుక్కోడానికి లాస్కీ పుస్తకాలు ఉపయోగపడ్డాయి.
చైతన్యం..
ఎమర్జెన్సీ ఎత్తేసి 1978లో ఎన్నికలకు వెళ్లింది ప్రభుత్వం. మేం కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేసినంగని చాలామంది కాంగ్రెస్‌కే ఓట్లు వేస్తున్నరని అర్థమైంది. ఎందుకంటే మొదటినుంచీ వాళ్లు కాంగ్రెస్ వల్ల గౌరవప్రదమైన జీవితం పొందిండ్రు. అప్పుడే చైనీస్ స్టడీస్‌లో ఎంఫిల్ చేయడానికి ఢిల్లీ వెళ్లిన. జేఎన్‌యూ క్లాస్‌రూమ్స్‌లో తెలుసుకున్న విషయాలకన్నా మీటింగ్‌లకు వెళ్లి తెలుసుకున్న విషయాలే ఎక్కువ. సమాజంలోని ఏ మార్పు అయినా స్థితుల నుంచి వచ్చిందే తప్ప వ్యక్తుల వల్ల ఎకాఎకిన వచ్చింది కాదు అని తెలుసుకున్న. ఆ స్థితులు మారాలి అంటే ప్రజల్లో చైతన్యం పెరగాలి. అట్లా క్రియాశీలక ఉద్యమాలకు దగ్గరైన. అయితే ఏ సంఘాన్ని అంటిపెట్టుకొని లేను. ఒక సమూహంగా పనిచేసిన. అసమానతల వల్లే ప్రజాస్వామ్య ఫలాలు అందవు. అందుకని సమానత్వం కోసం పాటుపడే అన్ని ఉద్యమాలను ఆహ్వానించాలె. అట్ల వామపక్ష ఉద్యమాల పట్ల సానుభూతి ఏర్పడింది. అయితే మొత్తంగా అటుపోకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఉన్న పౌరహక్కుల ఉద్యమంలో యాక్టివ్ అయిన. దాంట్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నం.
అప్పుడు ప్రభుత్వం, పరిస్థితులు ఇప్పట్లా లేవు. పోలీసుల అకృత్యాల వల్ల ఎవరైనా చనిపోతే.. అక్కడికి వెళ్లేవాళ్లం. పోలీసులు అడ్డుకునేవాళ్లు. మొదట్లో ‘ఎందుకు పోనివ్వరు?’ అని అడిగేవాళ్లం కాని రానురాను అసలు వాళ్లెందుకు ఆపాలే అన్న ప్రశ్న వచ్చేది మాలో. ఎందుకాపాలే అన్న ఈ ప్రశ్నను అడగడానికి మాకు యేడాది పట్టింది. అదో ఘర్షణ. బొజ్జాతారకం రాసిన ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’ అన్న పుస్తకం చదివి, కాళోజీ, కన్నబీరన్ లాంటి వాళ్ల ఉపన్యాసాలు విని చైతన్యం తెచ్చుకున్నం. పోలీసులు రూల్స్ మాట్లాడితే ఎదురు అడగడం నేర్చుకున్నం. ఈ పరిణామం అంతాకూడా సంఘర్షణలోంచి వచ్చిందే! మా వాదనలకు సమాజంలో గుర్తింపూ పెద్దగ లేకుండె. ఆ టైమ్‌లోనే కన్నబీరన్ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రాసిన ఓ వ్యాసంతో ఓ భరోసా వచ్చింది. మేం చేసే పనులు ఊరికే పోవు. మాకూ గుర్తింపు ఉంది, వస్తది అని! అట్లా నిలదొక్కుకునే ప్రయత్నం సాగింది.
హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే, అన్యాయమవుతుంటే హక్కుల పరిరక్షణకు, న్యాయం జరగడానికి పనిచేసుకుంటూ పోయినమే తప్ప ఇందులో మనకేం వస్తది, హోదా ఏంటీ అని ఎప్పుడూ ఆలోచించలేదు. నెత్తినేసుకొని పనిచేయాలే అంతే! విషయం జనాల్లోకి వెళుతుందా లేదా అన్నదే మా తాపత్రయం! ఉస్మానియాలో లెక్చరర్‌గా చేరినతర్వాతనే పౌరహక్కుల ఉద్యమంలోకి వచ్చిన. ఇంటెలిజెన్స్ వాళ్లు తరచుగా యూనివర్సిటీకి వచ్చి వేధించేవాళ్లు. ఆ టైమ్‌లో ప్రిన్సిపల్స్, వీసీలుగా ఉన్నవాళ్లు చాలా హెల్ప్ చేశారు. ‘ఓ లెక్చరర్‌గా ఆయన పాఠం సరిగ్గా చెప్తున్నంత వరకు, టైమ్‌కి కాలేజ్‌కి వస్తున్నంత వరకు బయట ఆయనతొ మాకు సంబంధం లేదు. కాబట్టి ఏదైనా ఉంటే మీరు బయటచూసుకొండి ఇట్లా కాలేజ్‌కి వచ్చి డిస్టర్బ్ చేయొద్ద’ని కరాఖండిగా చెప్పి వాళ్లను క్యాంపస్‌లోకి రానీయకుండా చేసిండ్రు. బయట మేం చేస్తున్న పనిమీద ఎంతోకొంత సదవగాహన వాళ్లకుండింది.
నాన్నకు నాకు..
నాన్న కొంత సోషలిస్ట్ భావాలతో ఉన్నా కుటుంబం విషయానికివచ్చేసరికి సంప్రదాయాలనే పాటించేవాడు. అందుకే నా ఈ ఉద్యమ జీవితానికి నాన్న అభిప్రాయానికి పొంతన కుదరక ఇద్దరి మధ్య భీకరమైన వాదోపవాదం జరిగేది. ‘ఎప్పటికీ ఇదే వ్యతిరేకత, శత్రుబీరం లెక్క ఇదేం పంచాయితీ’ అని మనస్థాపం చెందిన సందర్భాలున్నప్పటికీ ఆయన వాదననుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. జనాలకు మన అభిప్రాయం ఎలాచెప్తే అర్థమవుతుందో, ఎట్లా చెప్పి వాళ్లను కన్విన్స్ చేయొచ్చో తెలుసుకున్న. ఈ లెక్కన మా నాన్నతో వాదన నాకు లాభమైందనే చెప్పవచ్చు. అట్ల నా లైఫ్‌లో ఎదురైన ప్రతి సంఘటననూ ఒక పాఠంలెక్క నేర్చుకున్న. 1990లో వచ్చిన సరళీకృతవిధానాలను లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టినం. ఇప్పటికే అసమానతలు మెండుగా ఉన్న మన సమాజంలో ఈ సరళీకృతవిధానాలు వాటిని మరింత పెంచేవిగా ఉండడం.. తప్పుగా, రాజ్యాంగవిరుద్ధంగా అని అనిపించింది. రాజ్యాంగ సవరణ చేయాలని వెంకటాచలయ్య కమిటీని కూడా వేయడంతో మేం మాట్లాడుడు మొదలుపెట్టినం. స్వాతంత్ర్యఫలం మన రాజ్యాంగం. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే రాజ్యాంగ విలువలు సమక్షిగంగా లేవు అదివేరే మాట. సవరణలు రావాల్సిన అవసరం ఉన్నది.
పౌరహక్కుల ఉద్యమం అంటే ఉన్న హక్కులను కాపాడుకోవడం, వచ్చినవాటిని పరిరక్షించుకోవడం… విస్తృతపర్చుకోవడం.. రావాల్సిన వాటి గురించి పోరాడడమేనని ఆ సందర్భంలో కొత్తగా నిర్వచించుకున్నం. ఉద్యమంలో ఉన్నవాళ్ల హక్కులే కాదు సాధారణ ప్రజల హక్కులకు ఉల్లంఘన కలిగినా మనం జోక్యం చేసుకోవాలి.. ఈ కొత్త వెలుగులో మనకూ పని ఉంది. మనం ఎవరికో అనుబంధంగా, తాత్కాలికంగా పనిచేసేవాళ్లంకాదు.. అనే ఆలోచనతో ముందుకు కదిలినం. ఎంతో ఘర్షణలోంచి పుట్టిన రాజ్యాంగ హక్కులు ఇష్టారాజ్యంగా మార్చేవికావు. అందులోపొందుపర్చిన హక్కులు, ఆదేశిక సూత్రాలను అమలుచేయాలి. కాని కమిటీ పేరుతో మీరు చేస్తున్న సవరణలు వాటికి విరుద్ధం అని పెద్దయెత్తున వ్యతిరేకత తెల్పినం. ప్రచారం చేసినం. సరళీకృత విధానాల నేపథ్యంలో జరిగిన రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యల మీద లోతుగా అధ్యయనం చేసినం. ప్రతీదీ మాకొక అనుభవం. ఏం జరిగినా పౌరహక్కుల కోణంలోంచి చూసి చాలా సమస్యలను చేసినం.
ఆ సందర్భంగా ఎన్నో రంగాలకు చెందిన సంఘాలతో పరిచయాలు ఏర్పడినయ్. ఇంత విస్తృతమైన అనుభవం, పరిచయం ఎవరికీ ఉండదు. అదిమాకు మాత్రమే అందిన అవకాశం. అయితే ఇంతపెద్ద ఉద్యమంలో అంతర్గతంగా విభేదాలు సహజం. మనస్తాపాలూ అత్యంత సాధారణం. వీటన్నిటినీ ఎవ్వరం వ్యక్తిగతంగా తీసుకోలేదు. దేన్నయినా కలిసి పనిచేయడానికే ఉపయోగించుకున్నం. పౌరహక్కుల ఉద్యమం నేర్పిన పాఠం అది. ఏమైనా ప్రజల కోసం పనిచేసినమనే తృప్తి!
తెలంగాణ
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి మేం చేసిన పరిశీలన.. అధ్యయనం తర్వాత దానికి పరిష్కారం తెలంగాణ ఏర్పాటే అని నిర్ధారణకు వచ్చినం. అప్పటికే మిత్రులు తెలంగాణ ప్రభాకర్ తెలంగాణ మీద పనిచేస్తున్నరు. ఆయనతో తరుచుగా మాట్లాడేది. తెలంగాణ అనేది అంతర్గత వలస. ఇది నిరంతరం దోపిడీకి గురవుతూనే ఉంది. దీన్ని ఆపడం తెలంగాణతోనే సాధ్యం అని జయశంకర్ సర్ 96లో సభపెట్టింతర్వాత తెలంగాణ ఉద్యమభావన విస్తరించింది. పౌరహక్కుల సంఘం తరఫున కరపత్రాలు వేసినం, మీటింగ్ పెట్టినం. కొన్ని రోజులు ఐక్యవేదిక తరఫున పోరాడినం. అయితే అప్పుడు ఏంచేసినా నక్సలైట్ అనే భావనతో వెంటాడుతున్న పరిస్థితులు. దాంతో ఐక్యవేదిక నడవక విద్యావంతుల వేదిక పెట్టి 2004 నుంచి విస్తృతం చేసినం.
ఊరూరికి విషయాలు వెళ్లినై. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ వాళ్లు తెచ్చిన పుస్తకంలోని డేటాను చిన్న కరపత్రంలా వేసి ప్రతి గ్రామ కూడలివద్ద బ్యానర్‌లాగా పెట్టి.. అందరిలో అవగాహన తెచ్చినం. అనంతపురంలో హ్యూమన్‌రైట్స్ ఫోరం మీటింగ్‌లో బాలగోపాల్ ‘ప్రపంచంలో ఉద్యమాలే సాధ్యంకావేమో’ అనే నిస్ప్రహతో మాట్లాడిండు. అది జరిగిన యేడాదికే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ప్రపంచంలో ఏ ఉద్యమం ఇలా లేదు. అద్భుతం! ఇక్కడొక విషయం చెప్పాలే.. పోలీసోళ్లు తంతరేమోనని ‘మేధావుల వేదిక’ అని పెట్టినం. అదిచూసి జయశంకర్ సర్ ‘ఇంత అహంకారం పనికిరాదయ్యా.. మేధావులమని మనకుమనమే అనుకోవడం కాదు వేరేవాళ్లు అనాలె!’ అని సున్నితంగా హెచ్చరించిండు. అప్పుడు దాన్ని ‘విద్యావంతుల వేదిక’గా మార్చినం! పనిచేసేటోడు నాయకుడు కావాలె అని మేం ముందువడి పనిచేసేలా ప్రోత్సాహమిచ్చిండు, ధైర్యం నింపిండు! ఆయనలేని లోటు పూడ్చలేనిదే! కన్నబీరన్ కూడా అంతే ప్రోత్సాహం ఇచ్చిండు. ఎక్కడికిపోయినా.. తనతోపాటే మమ్మల్నీ పరిచయం చేసేది. అట్లాగే కాళోజీ సాంగత్యం.. కేశవరావ్ జాదవ్, రమామేల్కొటే.. వీళ్లందరితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. తెలంగాణ వచ్చిన నేపథ్యంలో నేను కొత్తగా ఆలోచించుకోవాల్సిందేమీ లేదు.
ఇన్ని రోజులు నడిచిన తొవ్వల్నే ఇప్పుడూ నడుస్తా! మీడియా చూస్తున్నట్టు రాజకీయాలను నేను చిన్నచూపు చూడను. అవి చాలా సృజనాత్మకమైనవి. అవి సక్రమంగా సాగేలా బయట ప్రజల తరపున నిలబడ్డానికి ఒక వాచ్ డాగ్ అవసరం. అలాంటి బాధ్యతను తీసుకునే విద్యావంతులున్నప్పుడు రాజకీయాలు మరింత సృజనతో పనిచేస్తాయని నా ఉద్దేశం!
ఈజీ అయింది
కుటుంబంలో ఎవరో ఒకరు ఇంటి బాధ్యతను తీసుకోకపోతే మగవాడు బయటకు వెళ్లి పనిచేయలేడు. నా విషయంలో నా భార్య సుశీల ఆ బాధ్యతలను తీసుకుంది కాబట్టే నాకు ఈజీ అయింది. చాలా సందర్భాల్లో నాకన్నా ఎక్కువ టెన్షన్ పడింది, ఇబ్బంది పడ్డది. చాలామందికి ఇలాంటి సహకారం దొరకకపోవచ్చు కాని నాకు దొరికింది.
—
నమస్తే తెలంగాణ సౌజన్యంతో