mt_logo

నగరంలో అంతర్జాతీయ నీటి సదస్సు

-24, 25వ తేదీల్లో బేగంపేట గ్రీన్‌పార్క్ హోటల్‌లో..
-హాజరుకానున్న వివిధ దేశాల ప్రతినిధులు
-పట్టణ నీటి సరఫరా నిర్వహణ-మేలైన
పద్ధతులు, అధ్యయనాలు అంశంపై విస్తృత చర్చ
-సమావేశాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఇప్పటికే బయోడైవర్సిటీ లాంటి సదస్సును విజయవంతంగా నిర్వహించిన రాజధాని ఈసారి పట్టణ నీటి సరఫరా నిర్వహణ- మేలైన పద్ధతులు, అధ్యయనాలు అనే అంశంపై నిర్వహించే సెమినార్‌కు సిద్ధమవుతోంది. ఈనెల 24, 25 తేదీల్లో బేగంపేటలోని హోటల్ గ్రీన్‌పార్క్‌లో ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి భారత్‌తో పాటు అమెరికా, జపాన్ దేశాలకు చెందిన 250మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. దీనిని 24వ తేదీన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుస్థిర నీటి సరఫరా నిర్వహణ విధానాలపై వివిధ రంగాల ప్రముఖులు సమావేశంలో చర్చించనున్నారు. ఈ సదస్సుతో నగర ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తం కానుంది

విధాన పరమైన నిర్ణయాలివే..
1. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్లు- రక్షిత చర్యలు, వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు.
2. మంచి పాలన
3. నీటి సంరక్షణ, సంరక్షణ విధానాలు
4. నీటి నిర్వహణలో సమర్థవంతమైన విధానాలు.
5. పట్టణ నీటి సరఫరా విధానాల్లో ఆధునిక మార్పులు.
6. సమర్థవంతమైన నిర్వహణలో మెరుగైన విధానాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలు.
7. కొలతల్లో నూతన ఆవిష్కరణలు.
8. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం.
9. ఎనర్జీ ఆడిట్

అంతర్జాతీయ స్థాయి సదస్సుకు హైదరాబాద్ మరోమారు వేదికవుతోంది. ఇప్పటికే బయోడైవర్సిటీ లాంటి సదస్సును ఘనంగా నిర్వహించిన నగరం ఈసారి పట్టణ నీటి సరఫరా నిర్వహణ- మేలైన పద్ధతులు, అధ్యయనాలు పేరిట జరగబోయే అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వేదికవుతోంది.

ఈనెల 24, 25వ తేదీల్లో బేగంపేటలోని హోటల్ గ్రీన్‌పార్క్ వేదికగా ఇండియన్ వాటర్‌వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు భారత్, అమెరికా, జపాన్ దేశాలకు చెందిన 250మందికి పైగా వివిధ రంగాల నిపుణులు హాజరుకానున్నారు. దాదాపు పదేళ్లకొకసారి జరిగే ఈ సెమినార్ గతంలో గోవా, చెన్నై నగరాల్లో మాత్రమే జరిగింది.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నీటి సరఫరా, శుద్ధి విభాగాల్లో ఆధునిక శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలను, అనుభవాలను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలను అందించే దిశగా ఈ సదస్సు ఏర్పాటు కావడం గమనార్హం. మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సును ఈనెల 24న రాష్ట్ర సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావులు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో నీటి సరఫరా, సంరక్షణ, నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక నివేదికను ఇండియన్ వాటర్‌వర్క్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సర్కార్‌కు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సెమినార్ విశేషాలపై సమగ్రస్థాయిలో టీ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం…

-ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ గురించి..
మున్సిపల్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు నీటి సరఫరా అంశంలో అనేక పరిశోధకులు, నిపుణులతో కూడిన బృందం ఈ సంస్థలో ఉన్నారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించే ప్రక్రియలపై పరిశోధన చేసినవారు కూడా ఉన్నారు.

ఐడబ్ల్యూడబ్ల్యూఏ సంస్థ నీటిచక్రం ద్వారా పర్యావరణం, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రభావిత అంశాలపై నిరంతరం పరిశోధనలను సాగిస్తోంది. ముంబయిలో 1968లో ప్రారంభించిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 32 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధిపై అనేక కార్యక్రమాలను నిర్వహించిందీ సంస్థ. నీటి వినియోగంలో సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఎకాలజీ, సోషల్‌సైన్స్‌ల అభివృద్ధి లక్ష్యంగా ఐడబ్ల్యూడబ్ల్యూఏ సంస్థ పనిచేస్తోంది.

ఈ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఒకరి ఆలోచనలను, అనుభవాలను మరొకరితో పంచుకుంటూ సత్ఫలితాలను సాధించేందుకు ఈ సంస్థ కృషి చేస్తున్నది. ఐడబ్ల్యూడబ్ల్యూఏ సంస్థ నీటి సరఫరా, శుద్ధి విభాగాల్లో ఆధునిక శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలను, అనుభవాలను వినియోగించుకుంటూ మెరుగైన సేవలను అందిస్తుంది.

భారత్‌లో సుస్థిరమైన నీటి సరఫరా, వ్యర్థ జలాల సద్వినియోగ విధానాలను, కార్యక్రమాలను రూపొందిస్తోంది. దీనికి అంతర్జాతీయ స్థాయిలో పని చేసే ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్, అమెరికన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్, జపాన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్, పబ్లిక్ యుటిలిటీ బోర్డు(పీయూబీ, సింగపూర్), వరల్డ్ వాటర్ కౌన్సిల్, ఇండియా వాటర్ పార్ట్‌నర్‌షిప్‌లతో సంబంధాలున్నాయి. ఈ సంస్థల్లోని సభ్యుల అనుభవాలను పంచుకుంటుంది.

-ముఖ్య ఉద్దేశ్యం..
ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్, హైదరాబాద్ చాప్టర్ జూలై 24, 25 తేదీల్లో అంతర్జాతీయ స్థాయి సదస్సును పట్టణ నీటి సరఫరా నిర్వహణ- మేలైన పద్ధతులు, అధ్యయనాలు అనే అంశంపై నిర్వహిస్తోంది. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఐడబ్ల్యూడబ్ల్యూఏ సంస్థ ప్రతినిధులు, ఇదే అంశంపై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, అకడమిక్ వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలను ఒక్కచోటికి చేరుస్తున్నారు. వారి అనుభవాలను, ఆలోచనలను పంచుకొని సుస్థిరాభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నారు.

ఐడబ్ల్యూడబ్ల్యూఏ సంస్థ సభ్యులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, నిర్ణయాత్మక శక్తి కలిగిన వ్యక్తులు, కన్సల్టెంట్లు, పరిశోధకులు, అధ్యాపకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, పీపీపీ రంగ సంస్థలు, నీటి నిర్వహణ సమస్యలకు పరిష్కారం చూపించగలిగే నిపుణులు, పరికరాల ఉత్పాదక, సప్లయి రంగ ప్రతినిధులు, నీటి సంబంధ అంశాలు, ప్రాజెక్టులపై ఆసక్తి కలిగిన వ్యక్తులు, విద్యార్థులు ఇందులో భాగస్వాములవుతున్నారు.

-సెమినార్ లక్ష్యాలు..
భూమ్మీద నీరు లేకుండా మనుగడ సాధించలేం. భూగోళంపై నీరు అనేకాంశాలు ముడిపడి ఉన్నాయి. పర్యావరణానికి విఘాతం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూమ్మీద నీటి పరిమాణం, నాణ్యత వంటివి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి. భవిష్యత్తులో నీటి కొరత, నీటి సంబంధ అంశాలే కీలకం కానున్నాయి. అందుకే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంటల్ కార్యక్రమాల్లో ఈ అంశాన్ని ఎజెండాలో 21 అంశంగా చేర్చారు. భారత్‌లో కూడా నీటి సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటి వినియోగం, సమాన పంపిణీలో వ్యత్యాసాలున్నాయి. పెరుగుతోన్న జనాభా వల్ల నీటికి డిమాండ్ పెరుగుతోంది. భారత్ వంటి దేశాలకు ఇది అతి పెద్ద సమస్యగా పరిణమించనుంది. పట్టణ నీటి వినియోగంపై దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోతే మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. అందుకే సుస్థిరమైన నీటి సరఫరా నిర్వహణ విధానాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న సందేశాన్ని ఇవ్వనున్నారు.

-సెమినార్‌లో హైదరాబాద్ విశిష్టతపై బ్రౌచర్లు..
హైదరాబాద్ నగరానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ నగరం చాలా ప్రసిద్ధమైన మసీదులు, దేవాలయాలు, బజార్లు, మార్కెట్లు, ముత్యాల దుకాణాలు, అందమైన పరిసరాల ప్రకృతి సౌందర్యాలతో విలసిల్లుతున్నది. ఇందులో రాజభవనాలు, ఇండ్లు, పార్కులు, వీధులు అన్నీ సమున్నతమైన నిర్మాణ కౌశల్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఈ ప్రాంతం క్రీ.పూ.3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి సామ్రాజ్యంలో ఉండేది.

ఆ తర్వాత శాతవాహనులు, కల్యాణ చాళుక్యులు పాలించారు. చాళుక్య సామ్రాజ్యం క్షీణించడంతో వారి సామంతులైన కాకతీయులు స్వాతంత్య్రం పొంది వరంగల్ రాజధానిగా ఒక విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. కాకతీయుల కాలంలో హైదరాబాద్ ప్రాంతంలోని గోల్కొండ మీద మొదటి మట్టి కోట నిర్మాణం జరిగింది. క్రీ.శ. 1463లో సుల్తాన్ మహమ్మద్ షాబహమన్ తెలంగాణలో తిరుగుబాటులను అణచివేయడానికి ఖులీకుతుబ్ ఉల్ ముల్కును సుబేదారుగా నియమించాడు.

ఆ తర్వాత సుల్తాన్ ఖులీకుతుబ్‌షా అన్న పేరుతో సింహాసనం అధిష్ఠించాడు. కుతుబ్‌షాహీల అధీనంలో గోల్కొండ ప్రఖ్యాతిగాంచింది. పెరుగుతోన్న జనాభా కోసం 1589లో 5వ సుల్తాన్ మహమ్మద్ కులీకుతుబ్‌షా ఒక కొత్త నగరాన్ని నిర్మించారు. ఈ నగరాన్ని మూసీ నది దక్షిణ ఒడ్డున, గోల్కొండకు తూర్పుదిశలో నిర్మించారు. గోల్కొండ రాజ్యంలో ప్లేగువ్యాధి తగ్గినందుకు సంతోషంతో ప్రసిద్ధి చెందిన చార్మినార్‌ను 1592లో నిర్మించారు.

హైదరాబాద్ నగరాన్ని కృష్ణాకు ఉపనదిగా ఉన్న మూసీ రెండు నగరాలను(హైదరాబాద్, సికింద్రాబాద్) వేరు చేస్తుంది. జనవరి నుంచి మే కాలంలో 22 నుంచి 43 డిగ్రీ సెల్సియస్, ఆగస్టు నుంచి నవంబరు వరకు 27.5 నుంచి 33 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ అనేక పరిపాలన కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు కూడా విస్తృతంగా ఉన్నాయి.

భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, హిందూస్తాన్ ఎరోనాటిక్స్, హిందూస్తాన్ మిషన్ టూల్స్, భారత్ డైనమిక్స్, న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్, సూపర్ అల్లాయ్ ఫ్యాక్టరీ, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇక్రిశాట్, ఇమరాత్ ఇలా అనేక మేజర్, మైనర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.

అలాగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. ఉస్మానియా, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ, అగ్రికల్చర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలు, హైదరాబాద్ యూనివర్సిటీ, నేషనల్ పోలీస్ అకాడమీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్కు, బయోటెక్ పార్కు, హార్డ్‌వేర్ పార్కు వంటివి కనిపిస్తాయి.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా ప్లానెటోరియం, చార్మినార్, గోల్కొండకోట, కుతుబ్‌షాహీ టూంబ్స్, దుర్గం చెరువు రీసార్ట్ వంటి అనేక సందర్శనీయ స్థలాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. హుస్సేన్‌సాగర్‌లో 58 అడుగుల రాతి బుద్ధ విగ్రహం చూడముచ్చటగా ఉంటుందని బ్రౌచర్ల ద్వారా సెమినార్‌కు హాజరయ్యే వారికి వివరించే ప్రయత్నం చేశారు..

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *