రాష్ట్రంలో ఆదాయం, ఖర్చు రెండూ సమానంగా ఉన్నాయని, సంక్షేమ పథకాలకు నిధులు లేవనేది పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్ధికశాఖపై ఇవాళ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ లో చెప్పిన రీతిలోనే ఆదాయ, వ్యయాలు సమానంగానే ఉన్నాయని అన్నారు. భూముల అమ్మకాల నుండి అనుకున్న విధంగా ఆదాయం లభించడం లేదని, పన్ను వసూళ్లు లక్ష్యానికి చేరేవిధంగా ఉన్నాయన్నారు.
సంక్షేమానికి, ప్రభుత్వ పథకాల అమలుకోసం నిధులకు కొరత లేదని మంత్రి పేర్కొన్నారు. నిధుల మళ్లింపు, అక్రమాలు జరగకుండా ఆడిట్ నిర్వహణ కొనసాగుతుందని, జిల్లాల్లో పది శాతం వరకు ఆడిట్ నిర్వహించి తప్పులు గుర్తించామని, ట్రెజరీ నుండి అక్రమంగా నిధులు తరలించిన అంశాలను గుర్తించామని మంత్రి ఈటెల తెలిపారు.