mt_logo

టీఎస్పీఎస్సీలో ఏపీపీఎస్సీ ఉద్యోగుల అరాచకం!!

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పాలిట కల్పతరువైన టీఎస్పీఎస్సీ లో ఏపీపీఎస్సీ సిబ్బంది అరాచకానికి ఒడిగట్టారు. టీఎస్పీఎస్సీ లోని అత్యంత కీలకమైన కాన్ఫిడెన్షియల్ రూమ్ తలుపులను డూప్లికేట్ తాళంతో తెరిచి చొరబడి ఏపీపీఎస్సీ ఉద్యోగులు అక్కడి ఫైళ్ళు గందరగోళంగా పడేశారు. కుర్చీలు లాగిపారేశారు. అంతేకాకుండా కొన్ని కీలకమైన ఫైళ్ళు కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. కమిషన్ అసిస్టెంట్ సెక్రెటరీ సీతాదేవి చాంబర్ ను నకిలీ తాళం చెవితో తెరిచి గదిని స్వాధీనం చేసుకున్నారని, ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ఫైల్స్ తో పాటు కార్యాలయానికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ శుక్రవారం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం, టీఎస్పీఎస్సీ రెండు రోజుల క్రితం తొలి నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా, గ్రూప్స్ సిలబస్ ను సిద్ధం చేస్తూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రానున్న రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయనుండటంతో కసితోనే ఇదంతా చేశారని తెలుస్తుంది. ఏపీ ఉద్యోగులు అక్కడినుండి కదిలేందుకు సిద్ధంగా లేకపోవడంతో చైర్మన్ ఘంటా చక్రపాణికి ఈ విషయాలన్నీ వివరించారు. చైర్మన్ సూచన మేరకు కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ సభ్యుడు సీ విఠల్ మాట్లాడుతూ కాన్ఫిడెన్షియల్ రూమ్ లో ఏపీ ఉద్యోగులు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు చైర్మన్ ఘంటా చక్రపాణి నివేదిక పంపారని, త్వరలో కమిషన్ ఉన్నత వర్గాలు గవర్నర్ నరసింహన్ ను కలువనున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *