– కాంటేకార్ శ్రీకాంత్
—
– డిసెంబర్ తొమ్మిది ప్రకటన అనగానే గుర్తుకువచ్చే మాట ఇది.
ఎవరైనా విజయం సాధించేవరకు పోరాడతరు. కానీ చేతికందిన విజయం చేజారిపోతుంటే.. దానిని నిలబెట్టుకునేందుకు, డిసెంబర్ తొమ్మిది ప్రకటనను నిలబెట్టుకునేందుకు తెలంగాణ తండ్లాడుతున్నది.
అప్పుడే ప్రకటనొచ్చి మూడేళ్లు అయిపాయే.
ఒక్కసారి వెనక్కితిరిగి చూసుకుంటే..
ఒక విజయం.. ఒక మహా ద్రోహం..
వేయిమంది పానాలు.. అనేక పోరాటాలు..
లెక్కకు మిక్కిలి రాజకీయాలు…
ఈ మూడేళ్లకాలంలో తెలంగాణ డైరీలో పేజీలన్నీ కన్నీళ్లతోనే నిండివుంటాయి.
ఆగని బలిదానాలు, లాఠీ, తూటా, బాయినెట్, టియర్ గ్యాస్ దెబ్బలు, సలసలా మసలుతున్న తెలంగాణవాదుల గుండెలు.. కుట్రలతో రెచ్చిపోతున్న సీమాంధ్ర చంద్రబాబు, జగన్, లగడపాటి, కావూరిలు..
ద్రోహలు, ద్రోహలు, ద్రోహలు..
సీమాంధ్ర నేతలే కాదు, నీ సొంత ప్రాంతమోడు నిన్ను కత్తిపీటకు బలిచేశాడు.
ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో
ఓయూలో విద్యార్థుల మహాగర్జన, వరంగల్ లో టీఆర్ఎస్ మహాగర్జన
సార్వత్రిక సమ్మె, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, తెలంగాణ మార్చ్..
నెత్తురోడిన ఉస్మానియా, కాకతీయ..
చరిత్రలో మహత్తరంగా, మహోజ్వలంగా, మహోన్నతంగా నిలిచిపోయిన పోరాటాలు.
అయినా ఎందుకు
ఇంకా తెలంగాణ తండ్లాట తీరలేదు
గిరగిరా తిరిగిన తెలంగాణ ఇంకా అదే తావులో నిల్చుంది.
అన్నీ పోరాటాలు ముగిసినట్టూ
మళ్లీ రాజకీయ అస్తత్వమనే ఆఖరి అస్త్రాన్ని చేబూనింది.
అవును, సీమాంధ్ర నేతల బూటకపు రాజీనామాలు, దొంగ ఉద్యమాలకు జడిసి డిసెంబర్ 23న ఢిల్లీ దిగివచ్చి.. నయవంచనకు పాల్పడింది. మరో ప్రకటన చేసింది. ఆ తర్వాత మనం ఎన్ని ఉద్యమాలు చేసినా.. ఎంత తీవ్రంగా కొట్లాడినా…
ఢిల్లీ పెద్దల దిమ్మ ఎందుకు తిరగలేదు.
కారణం తెలియనిదా.. ఇంటి నిండా దొంగలు
నీ ప్రాంతం నిండా పచ్చి రాజకీయ ద్రోహలున్నారు.
తెలంగాణ కోసమంటూ రాజీనామా చేసి.. ఇంటికాడ ఫైల్లు చూసే మంత్రులున్నారు.
రాజీనామా పేరిట డ్రామాలాడే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. సీఎం పదవిని నిలబెట్టేందుకు ఢిల్లీకెళ్లి భజనచేసే రాజకీయ బేహారులున్నారు.ఇంకా కులగజ్జీతో, అవినీతి డబ్బు యావతో పార్టీలు మారే జప్ఫాగాళ్లున్నారు. రెండుకండ్ల అధినేత చెప్పులు మోసే బానిసలున్నారు.
సంతోషన్న కొలువులొస్తలేవని ఉస్మానియాలో ఉరితాడుకు వేలాడితే..
ఎవడి గుండెలు కరుగుతాయి. ఏ రాజకీయ నాయకుడు అయ్యోపాపం అంటాడు. భరోసా ఇవ్వడానికి ముందుకు వస్తాడు.
గతాన్ని తలుచుకుంటే రంధి తప్ప.. ఎలాంటి సాంత్వన, ఊరట లేని చరిత్ర తెలంగాణది. ప్రత్యేక రాష్ట్ర పోరాటాలన్నీ విఫలమే కదా!
ఇప్పుడు మళ్లీ వర్తమానానికి వస్తే
ఆగమైన, ఆగమాగమైన తెలంగాణ కనిపిస్తున్నది.
నాడు కుట్రలకు, ద్రోహలకు మూలపురుషులు..
నేడు తెలంగాణల యథేచ్ఛగా పాదముద్రలు మోపుతున్నారు.
నోటికొచ్చినట్టు కూస్తున్నారు.
డిసెంబర్ 9 అర్ధరాత్రి కుట్రలకు సూత్రధారి అయిన జడలబర్రె
వెయ్యి ద్రోహాలు విరబూసుకొని..
ఇప్పుడు తెలంగాణను హేళన చేస్తోంది.
తిప్పికొడదాం ద్రోహాలను
తిరిగి చాటుదాం డిసెంబర్ 9కి ముందు ఉద్యమస్ఫూర్తిని చాటుదాం
రాజకీయ అస్తిత్వమే పరిష్కారమైతే
అందుకు తెలంగాణ వెనుదీయదని చాటుదాం
సంఘటితశక్తిగా, సబ్బండ వర్ణాల సమరోద్యమ నినాదంగా ముందుకు సాగుదాం.
జై తెలంగాణ, జైజై తెలంగాణ.