mt_logo

మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా-కేసీఆర్

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి తాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరి వెళుతున్నామని, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అడుగుపెడతామని టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చితీరుతుందని, సీమాంధ్ర నేతలు పిచ్చిపిచ్చి వ్యాఖ్యానాలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఫిబ్రవరి 5నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశబెట్టనున్నట్లు ఢిల్లీ నుండి తనకు స్పష్టమైన సమాచారం అందిందని, బిల్లు ఆమోదం పొందే తేదీలు కూడా తనకు తెలుసని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందగానే పెద్దఎత్తున సంబురాలు చేసుకుందామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. వేయిమందికిపైగా తెలంగాణ బిడ్డల త్యాగఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పారు. సీమాంధ్ర నేతలంతా తెలంగాణ ద్రోహులే అని అసెంబ్లీలో నిరూపితమైందని, ప్రజలు వారిపట్ల ఏహ్యభావం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. సీఎం, చంద్రబాబు వారి స్థాయికి తగ్గట్లు ప్రవర్తించట్లేదని, రాష్ట్రపతి అధికారాలనే ప్రశ్నిస్తున్నారని ఎండగట్టారు. బిల్లు తిరస్కరించబడలేదని, అభిప్రాయాలు, సవరణలతో పాటు సీఎం తీర్మానాన్ని కూడా పంపిస్తున్నట్లు స్పీకర్ చెప్పినా, సీమాంధ్ర చానళ్ళు పనిగట్టుకొని విషప్రచారం చేయడం జుగుప్సాకరంగా ఉందన్నారు. రాష్ట్రాల ఏర్పాటులో కేంద్రానికే ఉన్నతాధికారాలు ఉన్నాయని తెలిసికూడా సీమాంధ్ర నేతలు ఇరుప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావట్లేదన్నారు. మెజారిటీ అభిప్రాయంతోనే రాష్ట్రం విడిపోవాలి అంటే ఇక జన్మలో రాష్ట్రం ఏర్పడదు. ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని, సుప్రీంకోర్టుకు కూడా ఈ విషయంలో అధికారం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆంగ్ల అక్షరక్రమం ప్రకారం తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంటుందని, వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాలలో జరుగుతాయని ఆయన వివరించారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని, ఢిల్లీ వెళ్లి ఆమెను కలిసి కృతజ్ఞతలు చెబుతామని, అన్ని పార్టీల అగ్రనేతలను కూడా కలిసి తెలంగాణకు మద్దతు కోరుతామని చెప్పారు. ఇప్పటికే బీజేపీ సహా అన్ని జాతీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని, తప్పకుండా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో తాను తప్పక ఉంటానని, అమరుల కుటుంబానికి 10 లక్షల రూపాయలు, ఒకరికి ఉద్యోగం ఇస్తామని, వ్యవసాయదారులకు భూమిని ఇస్తామని వాగ్ధానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *