mt_logo

తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ఇంటికి వెళ్తా-నాగం

బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ జన్మదినం సందర్భంగా శుక్రవారం పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా తాను ఇంటికి వెళ్లనని, ఢిల్లీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీపై సీమాంధ్ర మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, రెండు రోజుల్లో తెలంగాణ బిల్లును ఎలా పాస్ చేయిస్తుందో తేలిపోతుందని అన్నారు. తాను తెలంగాణ కోసమే బీజేపీలో చేరానని, బీజేపీది ఒకటే మాట, ఒకటే బాట అని చెప్పారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో వ్యవహరించిన తీరు వల్ల దేశం పరువు పోయిందని, పార్లమెంటుకే చెడ్డపేరు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇచ్చిన విందు సమావేశంలో తమ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి బిల్లు పాస్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. బిల్లును పాస్ చేసే ప్రజల్లోకి వెళ్తామని, బీజేపీ మద్దతు లేకుండా బిల్లు పాస్ చేయలేరని చెప్పుకొచ్చారు. తమ పార్టీపై టీఆర్ఎస్ నాయకులకు ఏమైనా సందేహాలుంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌, సుష్మా స్వరాజ్ తో మాట్లాడి తెలుసుకోవాలన్నారు. బీజేపీ నేత అరుణ్ జైట్లీ కూడా ఇప్పటికిప్పుడే తెలంగాణ బిల్లును ఆమోదించాలని ట్విట్టర్ లో రాసినా మీడియా దానిని పట్టించుకోలేదన్నారు. కేంద్రం తాము సూచించిన సవరణలు చేసినా, చేయకపోయినా బిల్లును ఆమోదిస్తామని వ్యాఖ్యానించారు. తన పుట్టినరోజు కానుకగా తెలంగాణ బిల్లుకు మొత్తం ఓట్లు వేసి తెలంగాణను గెలిపిస్తామని తనను కలిసిన తెలంగాణ నేతలకు సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు. సుష్మాస్వరాజ్ ను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *