mt_logo

సీమాంధ్రుల కుట్రలకు చెక్ పెట్టండి-ప్రొ.కోదండరాం

తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి సమైక్యవాదులు ఈ నెల 17 న ఢిల్లీ యాత్ర చేపట్టారని, వారివల్ల హింసాత్మక చర్యలు పెల్లుబికే అవకాశమున్నందున కట్టడి చేయాలని జాతీయ నేతలను ప్రొఫెసర్ కోదండరాం కోరారు. శుక్రవారం ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తో పాటు పలువురు తెలంగాణ జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు సమైక్యవాదం పేరుతో చేస్తున్న మోసపూరిత ప్రచారాన్ని తిప్పికొడుతూ తెలంగాణ చరిత్రకు సంబంధించి ఉన్న అన్ని వివరాలనూ పుస్తకాల రూపంలో మీడియాకు, జాతీయ పార్టీలకు అందజేయాలని అన్నారు. పార్లమెంటుపై దాడి చేసిన లగడపాటిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పీకర్ మీరాకుమార్ ను కోరారు. తోటి సభ్యులపై పెప్పర్ స్ప్రే చల్లిన లగడపాటిని అభినవ భగత్‌సింగ్ అని మీడియా ప్రచారం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తుందని తమకు విశ్వాసముందని ఈ సందర్భంగా కోదండరాం పేర్కొన్నారు. లగడపాటిని ఉపేక్షిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆత్మరక్షణ కొరకే పెప్పర్ స్ప్రే వాడానని చెబుతున్న అతడికి పిస్టల్ కు కూడా అనుమతి ఇస్తారా? అని తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రశ్నించారు. ఈ సమావేశానికి ముందు తెలంగాణ జేఏసీ నేతలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విందులో పాల్గొన్నారు. వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడనున్న సందర్భంగా ఎటువంటి ప్రతిచర్యలకు పాల్పడకుండా సంయమనంతో ఉండాలని కేసీఆర్ వారికి సూచించినట్లు తెలిసింది. బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ జన్మదినం సందర్భంగా ఆమెను కలిసి తెలంగాణ జేఏసీ నేతలు శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని, ఇందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని సుష్మాస్వరాజ్ వారికి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *