mt_logo

పారని చంద్రబాబు కుతంత్రాలు..

BY: ఇలపావులూరి మురళీ మోహనరావు

చంద్రబాబు, పవన్ ఎంత రెచ్చగొట్టినా కేసీఆర్ మాత్రం అంతులేని సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబును తిరిగి విమర్శించడం లేదు. వారి విమర్శలకు జవాబు చెప్పడం లేదు. కేసీఆర్ పాటిస్తున్న మౌనమే చంద్రబాబును మరింతగా దహించివేస్తున్నది. కేసీఆర్ తిరిగి విమర్శిస్తే ప్రజలను మరింత రెచ్చగొట్టవచ్చని ఆయన వేసుకున్న పన్నాగాలను కేసీఆర్ తన మౌనంతో తుత్తునియలు చేస్తున్నారు. ఇక్కడే కేసీఆర్ ఆంధ్రుల మనసును గెలిచారు. మొన్నటి తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రచారం తీరు ఎలా ఉన్నది? నాలుగున్నరేండ్ల పాలనలో తానేం చేశారో చెప్పుకున్నారు. ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సాధించిన అభివృద్ధిని గురించి చెప్పుకున్నారు. మళ్లీ గెలిపిస్తే మరింత మేలు చేస్తానని, బంగారు తెలంగాణను సాధిస్తానని అర్థించారు.

మరి నలభై ఏండ్ల అనుభవం ఉన్నదని స్వోత్కర్షలు చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార తీరు ఎలా ఉన్నది? ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తానని నాలుగేండ్లుగా ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. ఇదిగో.. నేను ఈ అభివృద్ధిని సాధించాను. ఈ సంక్షేమ పథకాలను అమలు చేశాను మళ్లీ నన్ను గెలిపించండని ఎక్కడైనా చెప్పడం ఎవరైనా చూసారా? ఎవరైనా విన్నారా? మోదీ, కేసీఆర్, జగన్‌లను కుట్రదారులుగా, ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా, ద్వేషులుగా చిత్రించడంతోనే ఆయన ప్రచార సమయమంతా గడిచిపోతున్నది. 24 గంటలూ కేసీఆర్ జపంతో తరించిపోతున్నారు. అసలు ఎన్నికల క్షేత్రంలోనే లేని కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ తన భయాన్ని ప్రకటిస్తున్నారు. కేసీఆర్ ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెడుతున్నారని మొదట ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో ఇరువై లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారు. వారెలాగూ నమ్మరు. కనీసం ఏపీలోనైనా నమ్మించాలని చూస్తున్నారు. అయితే 2014 నాటి ద్వేషం, కోపం నేడు కేసీఆర్ పట్ల లేవని అందరికీ తెలుసు. ఎవరో కొంతమంది పచ్చ అభిమానులు బాబు కోసం కేసీఆర్‌ను ద్వేషించవచ్చు. కానీ, 99 శాతం మందికి కేసీఆర్ వ్యక్తిత్వం, ఆయన పాలన గురించి తెలిసిందే. టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా కేసీఆర్ ప్రభుత్వం గురించి, కేసీఆర్ సాధిస్తున్న అభివృద్ధి గురించి అందరికీ తెలుసు. తెలంగాణ అనేది ఏ కశ్మీర్ పక్కనో లేదు. ఆంధ్రకు కూతవేటు దూరంలోనే ఉన్నది. ఆంధ్రా నుంచి ప్రతిరోజూ వేలాది మంది హైదరాబాద్ వెళ్తూనే ఉంటారు. అందువల్ల తెలంగాణలో సంభవించే ప్రతి పరిణామం ఆంధ్రులకు తెలుసు. అందుకనే వారు చంద్రబాబు ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మడం లేదు.

కేవలం తానొక్కడినే చెపితే ప్రజలు నమ్మరేమో అని తన పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్‌తో కూడా కేసీఆర్ మీద విమర్శలు చేయిస్తున్నారు. తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారంటూ పవన్ ఆరోపణలు చేశారు. అయితే దానికి ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకపోయారు. ఆంధ్రాలో నివసించే ప్రతి ఒక్క కుటుంబానికి హైదరాబాద్‌లో బంధువులున్నారు. రాకపోకలు జరుగుతున్నాయి. అలాంటి పేలవమైన విమర్శలు చేస్తే ఎవరూ నమ్మరనే ఇంగితం కూడా పవన్‌కు లేకపోవడం ఆశ్చర్యకరం! దాంతో చేసేదేం లేక కేసీఆర్ రూ.వెయ్యి కోట్లను జగన్‌కు ఎన్నికల ఫండ్ కోసం ఇచ్చారని ఆరోపణలకు దిగారు. అరె.. జగన్ లక్ష కోట్లు తిన్నాడని కేసులు కూడా పెట్టి ఇప్పుడు వెయ్యి కోట్లు కేసీఆర్ నుంచి ఎందుకు తీసుకుంటారని నెటిజన్లు దులిపెయ్యగానే ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఇలా ఎన్నిరకాలుగా రెచ్చగొట్టినా ప్రజల నుంచి మాత్రం స్పందన రావడం లేదు. ఇదిలా ఉంటే పవన్, చంద్రబాబు కలిసే ఉన్నారని, అవగాహనతోనే పని చేస్తున్నారంటూ ఒక టీడీపీ నాయకుడు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. తమ రహస్య ఒప్పందం ఇలా బయటపడగానే, తెలుగుదేశం, జనసేన బిక్కచచ్చిపోయాయి. జనసేన, టీడీపీ ఇద్దరు భాగస్వాములుగానే ఉన్నారని వైసీపీ అధినేత చేస్తున్న ఆరోపణలకు ఈ వీడియో బలాన్ని చేకూర్చింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆంధ్రాలో ఒకరోజు ప్రచారం చేస్తేనే అదేదో మహా కుట్ర అంటూ గగ్గోలెత్తించిన చంద్రబాబు ఎక్కడో కశ్మీర్ నుంచి, కర్ణాటక నుంచి, ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చి ప్రచారం చేయిస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడెక్కడి ముస్లిం నేతలు పనికొస్తారు కానీ, పొరుగునే ఉన్న తెలుగువారు పనికిరారా అంటూ ఏకిపారేస్తున్నారు.

దీనికితోడు ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించడం చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో ఇలాంటి బదిలీలు సహజాతి సహజం. తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా అలా జరిగింది. అయినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్ల్లెక్కి అరిచి గోల చెయ్యలేదు. కోర్టులకు వెళ్లలేదు. ఎన్నికల సంఘం అధికారాన్ని ప్రశ్నించలేదు. మరి చంద్రబాబు ఇంత రాద్ధాంతాన్ని ఎందుకు చేస్తున్నారు? ఒకటే జవాబు. అసహనం! తనకు ఎదురుదెబ్బ తప్పదే మోనన్న భయం! అధికారం చేజారిపోతున్నదన్న శంక. అందుకే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. వీరు ఎన్నివిధాలా ప్రయత్నించినా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. ఐదేండ్ల చంద్రబాబు పాలన వారికి వెగటు కలిగించింది. వారు మార్పు కోరుకుంటున్నారనేది యదార్థం. అది రేపు ఎన్నికల్లో తేలుతుంది.

అయితే చంద్రబాబు, పవన్ ఎంత రెచ్చగొట్టినా కేసీఆర్ మాత్రం అంతులేని సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబును తిరిగి విమర్శించడం లేదు. వారి విమర్శలకు జవాబు చెప్పడం లేదు. కేసీఆర్ పాటిస్తున్న మౌనమే చంద్రబాబును మరింతగా దహించివేస్తున్నది. కేసీఆర్ తిరిగి విమర్శిస్తే ప్రజలను మరింత రెచ్చగొట్టవచ్చని ఆయన వేసుకున్న పన్నాగాలను కేసీఆర్ తన మౌనంతో తుత్తునియలు చేస్తున్నారు. ఇక్కడే కేసీఆర్ ఆంధ్రుల మనసును గెలిచారు. కేసీఆర్ పాటిస్తున్న సంయమనాన్ని రాజకీయ పరిశీలకులు కూడా ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్లు చంద్రబాబు కుతంత్ర రాజకీయాల గురించి కేసీఆర్‌కు చెప్పాలా?

గంగ పారుచుండు కదలని గతి తోడ
మురికి పారుచుండు మోత తోడ
దాత యోర్చినట్లు అధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినుర వేమ.. అన్నాడు కదా ప్రజాకవి వేమన!
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *