mt_logo

యిగనైనా.. ప్రతిపక్షాలు తెలంగాణ ప్రజల రాజకీయ గతితర్కాన్ని అర్ధం చేసుకోవాలె.

By: రమేశ్ హజారి

ప్రతిపక్షమంటే.. అధికార పక్షాన్ని యెత్తికుదేయడమేననే సీమాంధ్ర పాలకులు స్థిరీకరించిన ఆధిపత్య రాజకీయ విలువలనుంచి తెలంగాణ ప్రతిపక్షాలు బయటపడాలె. కమ్మ రెడ్ల కులాధిపత్య రాజకీయ ఎత్తుగడల నేపధ్యంలో యేర్పడ్డ ‘సీమాంద్ర అసెంబ్లీ విలువలు’ తెలంగాణకు పడేటియి కావు. తెలంగాణ అసెంబ్లీకి పూర్తి వ్యతిరేక విలువలయి. ఈ సోయి రానంతవరకు తెలంగాణల ప్రతిపక్షాలు ప్రజలముందల పాస్ మార్కులు తెచ్చుకోలేవు.

టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో వున్న తెలంగాణ నేతలు తమను ఎన్నుకున్న ప్రజల ‘రాజకీయఆత్మ’ను పట్టడంలో యెన్నడో యెనకబడ్డరు. ఈ విషయంలో మొదటినించి అయి యెనకపట్టే పడుతున్నయి. ‘ఆత్మ’శుద్ది వీరికి లేకపోవడమే అందుకు కారణం. తెలంగాణ ఆత్మను పట్టడమంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఏకాత్మగా మారి ఆత్మల్లోకి పరకాయ ప్రవేశం చెయ్యడమే. యిప్పటివరకు కేసీఆర్ తప్ప మరో పార్లమెంటరీ పంథాను అనుసరించే నాయకుడు అటువంటి ప్రయత్నాన్ని చేయెలే. ఆయన తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టిండు కాబట్టే ఉద్యమనేత అయిండు.. రాష్ట్రాన్ని తెచ్చిండు.. ముఖ్యమంత్రి అయిండు.

ప్రజల ఆత్మను పట్టడం ఓ కవి, ఓ మేధావి, ఓ రచయిత, ఓ కళాకారుడు తదితర ఆత్మగల్ల బుద్దిజీవులు చేస్తుండడం మనం చూస్తూ వచ్చినం. కానీ ఓ పాలకుడు తన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ కార్యాచరణ చేపట్టాలని నడుం కట్టడం.. పెద్ద పెద్ద కలలు కనడం.. పలవరించడం.. తెల్లారి వాటిని కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్దిని మనసావాచా కర్మణా చేయడం, నిజంగా విప్లవాత్మకం. చరిత్రలో మనం చాలా చదువుకున్నం. రాజరిక వ్యవస్థనుంచి సమాజం ప్రజాస్వామిక పాలన వరకు జరిగిన పరిణామాలన్నీ మనకు చరిత్ర చెప్పిందికూడా. ప్రజలను కన్నబిడ్డలకంటే గొప్పగా చూసుకున్న రాజుల పేర్లను విన్నం. మారువేశంల జనంల తిరిగి వాల్లేమనుకుంటున్నరో తెలుసుకోని అట్లా పాలనసాగించినరని విన్నం. అంతమంచి రాజులున్నరా? అంతగొప్పపాలన చేస్తరా? సమ సమాజ జీవన విధానాన్ని కోరుకుంటూ ఆ విధమైన కార్యాచరణను పాటించే ఫ్యూడల్ వ్యవస్థను రాజరిక పాలనను మనం కోరుకోవడం మంచిదేనా? అని అనిపిస్తుంటది కూడా. తన ప్రజలకోసం ప్రాణాలర్పించేందుకు యేమాత్రం వెనకకు పోని రాచరికపాలకుడయినా ఫరవాలేదు అటువంటోడుంటే బాగుండును కదా అని మనసు తొలుస్తది. అది కమ్యూనిజమైనా.. కేసీఆరిజమైనా.. యింకే విధానమైనా కానీ తమకు అటువంటి పాలన కావాలని ప్రజలు కోరుకుంటరు కూడా. ప్రజాస్వామ్యంలో వున్నామని నమ్మకంతో ఉన్న ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా.. నిరంతరం వారి స్వప్నాలు ధ్వంసమైతున్నవి. వారట్ల ఉలిక్కిపడ్డప్పుడల్లా.. ప్రజలట్లా ఆశపడడం అర్ధం చేసుకోవచ్చు.

తెలంగాణ వస్తే తమకేమో వస్తదని ఆశపడి త్యాగాలకు మొగ్గిన ప్రజలు కూడా గత ఆరునెల్లుగా తెలంగాణ ప్రతిపక్షాల తీరు చూసి అట్లనే ఉలికిపాటుకు గురయితున్నరు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీల తీరు చూస్తుంటే యెందుకో ఈ ప్రజాస్వామ్యమనే ముసుగు తొలగించి కొన్నాళ్ళు మంచో చెడో కేసీఆర్ కు తెలంగాణ పాలనను బేషరతుగా అప్పజెప్పితేనే బాగుండు అని అనిపించే అవకాశాలున్నయి. పొరపాట్లు జరుగుతయి. ప్రభుత్వం అన్నంక తప్పులు చేస్తరు. తెలవక చేస్తరు, కావలసి గూడ చేస్తరు. దీన్ని యెవరూ కాదనరు. అరవై యేండ్లకు పైగా భారత స్వాతంత్ర్యానంతరకాల పాలనను పరిశీలిస్తే ప్రతి రాష్ట్ర రాజకీయాలల్ల దేశ రాజకీయాలల్ల యిదే విషయం మనకు స్పష్టమైతది.

నేటి పాలకపక్షమే రేపటి ప్రతిపక్షంగా మారడం అనేది భారత దేశంతో పాటు యితర పార్లమెంటరీ పంధాలో నెలకొన్నది. ఇటువంటి పరిస్థితిలో దేశ రాజకీయాల్లో పాలకపక్షం, ప్రతిపక్షం అని విడదీసి వాటినడుమ మంచి చెడులను బేరీజుకూడా వేయలేం. అధికార, ప్రతిపక్షాలు రెండూ పాలక పక్షాలే.‘ఇటోడు అటు గూసుండు.. అటోడు ఇటు గూసుండని’ పాటలు కూడ పాడుకున్నం.

అసెంబ్లీలో యెవలెవలు యేం మాట్లాడాలె.. యెవరెవరు యేం ప్రశ్నలు వేస్తరు.. అన్నీ ముందస్తుగనే ప్రిపేరయిపోతయి. టీవీల ముందల నడిచేదంతా ఓ ప్రహసనం. నువ్విట్టంటే నేనిట్టంట అనే పద్దతిల నడుస్తయి చట్ట సభలు. ఆమేరకు బిజినెస్(యిక్కడ వ్యాపారం అని అర్ధం కాదు.. అసెంబ్లీ నడిచే విధానం అని అర్ధం చేసుకోవాలె.) మీటింగులో పాలక ప్రతి పక్షాలు కలిసి నిర్ణయిస్తరు. ఇదే విధానం తెలంగాణలో కూడా కొనసాగుతది. తప్పదు మరి. ప్రతిపక్షం అనంగనే అదేదో పత్తిత్తు అని గానీ ప్రజలకు మేలు చేసేందుకు అహర్నిశలు పోరాటం చేస్తదనే భ్రమలుండాల్సిన అవసరం లేదు.అట్లనే ఇదే భ్రమ ప్రభుత్వ పక్షం మీద కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే పంచాతేలేదుగదా, మరి చర్చ యెందుకు అంటరా? అదే నేను చెప్పదలుచుకున్నది. ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇన్నాళ్లూ పాలనసాగించిన ప్రభుత్వాలు పైన చెప్పిన విలువలను మనమీద రుద్దినయి. అదే విధానం దాదాపు ఇతర రాష్ట్రాల్లో కూడ కొద్దిల అటు యిటుగా కొనసాగుతున్నది. వీటిని మన రాష్ట్రంల రద్దు పరచాలె. కొద్దికాలం తరకవాత కేసీఆర్ ఆధ్వర్యంల టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవిష్యత్తులో దేశంలోని యితర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తయనడంలో సందేహం లేదు.

దేశంలో ఓ నూతన పాలన నడుస్తున్నదంటే అది తెలంగాణలనే. అది సరికొత్త పంథాలో కొనసాగాలంటే పాలక వర్గంలో వున్న ప్రతిపక్షం ముఖ్యంగా తన పంథాను సవరించుకోవాల్సివున్నది. తెలంగాణ సాధన క్రమంలో త్యాగాలతో తెలంగాణ బిడ్డల బలిదానాలు ప్రపంచాన్ని కదిలించినయి. ఈ నేపధ్యంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం ‘సుపరిపాలన’ అనే విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నది. స్థిరీకరించిన పాత విలువలను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఆ విషయంల యిప్పటికే 70 నుంచి 80 శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నది గూడా. యిది ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటున్న సంగతి. పొరపాట్లు కావచ్చు, తప్పిదాలు కావచ్చు, మరింకేదైనా వుద్దేశ పూర్వకమైన విధానాలు గావచ్చు.. కేసీఆర్ యెదుర్కుంటున్న ‘నియంతృత్వ ధోరణి’ అనే విమర్శ కావచ్చు.. యివి 20 నుంచి 30 శాతం వరకు ప్రభుత్వ పాలనలో జరుగుతున్నలోపాలుగా గుర్తించబడ్డాయి.

అయితే దశాబ్దాలుగా పాలన కొనసాగిస్తున్న వివిధ రాష్ట్రాలలో గుడ్ గవర్నెన్స్ రేటింగు శాతం యాభైశాతానికి లోపే అని సర్వేలు తేలుస్తున్నయి. కాగా ఆరునెల్లుగూడా గడవని తెలంగాణ పాలన యాభైశాతానికి మించి సుపరిపాలన అందించేందుకు ప్రయత్నాలు ప్రారంబించి సఫలమయింది. ఆ దిశగా ప్రజలు మెచ్చిన పాలనకు శ్రీకారం కట్టింది అందుకు మనందరం గర్వించాల్సిందే.

అయితే యీ కాస్త పొరపాట్లు ముఖ్యంగా ప్రభుత్వం మీద ‘నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నద’నే విమర్శ యెందుకు జరుగుతున్నయో వస్తున్నయో ఓ పాలి పరిశీలిద్దాం.

కంట్లో నలుసోలె..చెవిల జోరీగోలె..గుంటకాడి నక్కోలె తెలంగాణ ప్రజలను పీక్కతిందానికి తయారుగుంటున్న సీమాంధ్ర పాలక వర్గాలను యెప్పటికప్పుడు తిప్పికొట్టాల్నంటే..తప్పదు మరి.అట్ల వుండాల్సిందే.అట్ల వుండకపోతెనే కేసీఆర్ ది తప్పు. అట్ల నియంతృత్వంతో వ్యవహరించి వుండకపోతె యిప్పటికల్ల తెలంగాణ కలలు కల్లలయి పోయేటివి. యీ జాగల యింకో కాంగ్రెస్సో, టీడీపో వుంటే యాపాటికి ఆంధ్రబాబుల చేతిలో తెలంగాణ ఆయింత ఆగమయ్యేదని ప్రజలు రచ్చబండలమీద చర్చించుకుంటన్నరు. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం అట్ల వుండకపోతే.. కేసీఆర్ ఆంధ్రోల్లతోని లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు లెక్క. కేసీఆర్ నిర్ణయాలు చంద్రబాబు తొత్తులకు కోపం తెప్పిస్తున్నయి అంటెనే కండ్లు మూసుకోని చెప్పొచ్చు అది తెలంగాణకు ఉపయోగం అని. ఒకవేళ సీమాంధ్ర మీడియాగానీ, చంద్రబాబు తొత్తులుగానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకునుడు మొదలయిందంటే యిగ ఆయన మీద తెలంగాణ ప్రజలు అనుమానాలు పెంచుకోని ఎదురుతిరుగుడు మొదలు పెడుతరు అని ప్రజా స్రవంతిలో చర్చ యిప్పటికే మొదలయింది.

దిస్ ఈజ్ ద డైయెలక్టిక్స్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. ఇప్పుడు ప్రతిపక్షాలను ప్రజలు యెందుకు చీకొడుతున్నరంటే గందుకే. సీమాంధ్ర వర్గాలు వాల్లను మెచ్చుకుంటున్నయంటే సీమాంధ్ర వర్గాల ప్రయోజనాలను కాపాడుతున్నరనే అర్ధం.

దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ముఖ్యంగా తెలంగాణ ప్రతిపక్షాలు గుర్తించాల్సిన విషయం. మీకు తెలంగాణ మా మద్దతుకావాలంటే ముందు మీ మైండుసెట్టు మార్సుకోండ్రి. ఆంధ్రపాలకులు మీ బుర్రల్లో ఫిట్ చేసిన ‘పొలిటికల్ చిప్’ లను ఫార్మాట్ చేయున్రి. వాల్లు చేతిల పెట్టిన పదువులు అనే చిప్పలను యిసిరి అవతలికి కొట్టురి. మా మనసులను పట్టుకోని శత్రువుకు సందివ్వకుంటా మీరు స్వతహాగా ప్రతిపక్ష నేతలుగా నిలదొక్కుకోండ్రి అంటున్నరు జనం. విమర్శిస్తెనే ప్రతిపక్షం అని అనుకుంటలేరు జనం. వాల్లమేలుకోసం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలకు పోవాలని కోరుకుంటున్నరు. ఏ అసెంబ్లీల మొత్తుకుంటున్నరని ఉద్యమ సంస్థలను ప్రజలు ఆదరిస్తున్నరు? మిమ్ములగూడ అట్లనే ఆదరిస్తరు వాల్లకోసం పనిచేస్తే. అసెంబ్లీల మాట్లాడే అవకాశం రావడం మీకు వున్న అధనపు అవకాశం. కాకపోతే మీరు సీమాంధ్ర పాలకుల నీడనించి బయటపడాలె.. దాంతోటిపాటు మీకు తెలంగాణ రాజకీయాల గతితర్కం అర్ధం కావాలె గంతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *