mt_logo

ఇది నగరాల శకం

-మెట్రోపొలిస్ సదస్సులో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ..
-సదస్సు విజయవంతంపై సీఎం కేసీఆర్‌కు అభినందనలు
-ఆర్థికాభివృద్ధి వ్యవస్థకు నగరాలే ఇంజిన్
-పట్టణీకరణను అల్లుకుంటున్న సవాళ్లు
-పటిష్ఠమైన సుపరిపాలనతోనే పరిష్కారం
-పరిశుభ్ర నగరం సమానత్వానికి ప్రతీక
-ప్రజారవాణాకు హైదరాబాద్ మెట్రో ఉదాహరణ
-ప్రజల ఉత్పాదక సమయం వృథాకాకూడదు
-2019 నాటికి క్లీన్ ఇండియా : ప్రణబ్
పందొమ్మిదో శతాబ్దం రాజ్యాలదైతే.. ఇరవయ్యో శతాబ్దం దేశాలది. తాజాగా ఇరవై ఒకటో శతాబ్దం నగరాలది అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్వచించారు. ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా పట్టణీకరణ జరగడంతోపాటు అదే తరుణంలో అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో యంత్రాంగం వైవిధ్య మార్గాల్లో వాటిని అధిగమించాల్సిన అవసరముందని సూచించారు.

ప్రధానంగా మెట్రోపొలిస్ సదస్సులవంటి వేదికలద్వారా అలాంటి పరిష్కారాలు వచ్చి.. సమీప భవిష్యత్తులోనే మెరుగైన నగరాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న పదకొండో మెట్రోపొలిస్ సదస్సు ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తూ మూడురోజులపాటు సదస్సులో ఫలవంతమైన చర్చల ద్వారా కొత్త కోణాలు ఆవిష్కృతమై, సదస్సు ముఖ్యోద్దేశమైన సిటీస్ ఫర్ ఆల్.. అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.

దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం మెట్రోపొలిస్-2014ను విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. నగరాలకు సంబంధించిన ప్రస్తుత అంశాలు, ప్రపంచవ్యాప్తంగా నగరాల అనుభవాలు, నిపుణుల విజ్ఞానాన్ని పంచుకునేందుకు దేశంలో మొదటిసారిగా జరిగిన ఈ సదస్సు మంచి వేదిక అన్నారు.

ఆనో భద్ర క్రతావొ విశ్వతః అని రుగ్వేదంలో చెప్పినట్లు అన్ని దిశల నుంచి సృజనాత్మక ఆలోచనలు వచ్చేందుకు ఈ సదస్సు మంచి వేదిక. వాటి ద్వారా వచ్చిన ఫలితాలతో వేగవంతమైన కార్యాచరణ అమలై సమీప భవిష్యత్తులోనే మంచి నగరాలు సాక్షాత్కరిస్తాయని ఆశిస్తున్నాను అని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 377 మిలియన్ జనాభా అంటే 31 శాతం మంది పట్టణాల్లో నివసిస్తుండగా.. చైనాలో 46%, ఇండోనేషియాలో 54%, మెక్సికోలో 78%, బ్రెజిల్‌లో 80% మంది పట్టణాల్లో ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పట్టణీకరణ జనాభా ఏడాదికి సరాసరిన 2.76% పెరుగుతుంది. 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో అనూహ్యంగా మిలియన్ల జనాభా ఉన్న నగరాలు 35 నుంచి 52కు పెరిగాయి అన్నారు. ప్రస్తుతం నగరాలు ఆర్థికాభివృద్ధికి వ్యవస్థకు ఒక ఇంజిన్‌లా పనిచేస్తున్నాయని ప్రణబ్ చెప్పారు. 60%కంటే ఎక్కువ దేశ స్థూల జాతీయోత్పత్తి కేవలం 16 శాతం జనాభా, 0.24 శాతం విస్తీర్ణం నుంచి వస్తున్నదని గుర్తు చేశారు. ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరిగితే అది భారతదేశ అభ్యున్నతికి దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు.

ప్రతి నగరం వైఫై కావాలి: ప్రపంచంలో 50%కంటే ఎక్కువ జనాభా పట్టణాల్లో జీవిస్తున్నందున పాలకులు ఎప్పటికప్పుడు సవాళ్లను ఎదుర్కొనడం చాలా ముఖ్యమని రాష్ట్రపతి చెప్పారు. ఈ నేపథ్యంలో వైవిధ్య విధానాల ద్వారా ప్రధానంగా పారిశుద్ధ్యం, కాలుష్యం, కనీస వసతుల కల్పన, ప్రజలకు భద్రత రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ప్రపంచ దేశాలు అనేకం పట్టణీకరణతో ఆయా నగరాల్లో ప్రజలందరికీ సమానస్థాయిలో కనీస వసతులు కల్పించలేకపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు తక్షణంగా సుపరిపాలనను బలోపేతం చేసి, స్థానిక సంస్థలకు ఆర్థిక చేయూత కల్పించాల్సిన అవసరముంది అని ప్రణబ్ అభిప్రాయపడ్డారు.

తొమ్మిది శాతం పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ లేదని, 12.6 శాతం ప్రాంతాల్లో మరుగుదొడ్ల సదుపాయం లేదని అన్నారు. పట్టణీకరణ ఎదుర్కొంటున్న మొదటి సమస్య పారిశుద్ధ్యమని ఆయన చెప్పారు. పరిశుభ్రమైన నగరమనేది సమానత్వానికి మొదటి ప్రామాణికం. వ్యర్థాలను వనరులుగా వినియోగించుకోవాలి. లేనట్లయితే అది స్మార్ట్ సిటీ కాబోదు. ఈ అంశంలో హైదరాబాద్ సరైన దిశగా వెళుతుందని నేను నమ్ముతున్నాను. నగర ప్రణాళికలో గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ జోన్ల ఏర్పాటు ద్వారా నగరాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన కాలుష్యాన్ని తగ్గించాలి.

ప్రణాళికా సమయంలోనే పచ్చదనాన్ని కాపాడేందుకు విధానపరమైన నిర్ణయాలు చేయాలి అని సూచించారు. స్మార్ట్ సిటీల్లో ప్రభావవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రవాణా అనేది సాధారణ విషయం కాదు. ఇది అభివృద్ధిలో ఒక భాగం. నగరాల్లో ప్రజలు ప్రయాణానికి ప్రజా రవాణాను ఆశ్రయించడమనేది మొదటి ప్రాధమ్యంగా చేయాలి. భారతదేశంలోని ప్రజా రవాణా వ్యవస్థలో హైదరాబాద్ మెట్రో రైలు ఉత్తమమైనది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దీనిని ఉదాహరణగా తీసుకొని, అలాంటి చర్యలు చేపడతారని ఆశిస్తున్నాను అన్నారు. ప్రజల ఉత్పాదక సమయాన్ని వృథా చేయకుండా ఆన్‌లైన్‌లో పౌరసేవలు అందించాలని ప్రణబ్ సూచించారు.

గత దశాబ్దకాలంగా భారత్‌లో ఇందుకు సంబంధించి అనేక ఉత్తమ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు ఇంటర్నెట్ ద్వారా సేవలు పొందుతున్నారు. ప్రతి నగరం వైఫై నగరం కావాలి. వలసలు పెరుగుతున్న దరిమిలా మురికివాడలు పెరగకుండా సుస్థిరమైన గృహ విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. శాటిలైట్ నగరాల ఏర్పాటు మురికివాడలు పెరగడకుండా ఉండేందుకు మరో ప్రత్యామ్నాయం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇండ్లను నిర్మించేందుకు వివిధ రకాల వైవిధ్యమైన విధానాలను అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి నుంచి ఒకరు మంచి విధానాలను నేర్చుకోవాల్సిన అవసరముంది అని ప్రణబ్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నగరంలో భద్రత అనేది కీలకాంశంగా మారిందని ఆయన చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే రక్షణ ఉంటుందో ప్రజలు ఆ నగరాన్ని కోరుకుంటారు అన్నారు.

500 నగరాల్లో నూతన పథకం: మహాత్మాగాంధీ 150వ జయంతి జరిగే 2019నాటికి దేశంలోని 4041 నగరాల్లో అందరికీ పారిశుద్ధ్య వసతులు కల్పించి, దేశాన్ని క్లీన్ ఇండియా మార్చేందుకు కేంద్రం స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట ఒక భారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. భవన మౌలిక వసతులను కల్పించేందుకు నూతన పట్టణాభివృద్ధి పథకాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు డిజైన్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ విధానంద్వారా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు.

అదేవిధంగా దేశంలో వంద స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. పట్టణాల్లో నాణ్యమైన జీవనాన్ని సాగించడంతోపాటు సాంకేతిక ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేందుకు చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటు వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేసి, వాటిని పట్టణ ప్రణాళిక, ఆర్థికాభివృద్ధిలో మిళితం చేసేందుకు హృదయ్ (హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్, ఆగ్యుమెంటేషన్ యోజన) అమలుకు కూడా ప్రతిపాదిస్తున్నారు అని రాష్ట్రపతి వెల్లడించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *