mt_logo

ఇదేనా మోదీ భారతం?

By: కట్టా శేఖర్‌రెడ్డి

అభివృద్ధికి మోదీ చూపెడుతున్న ప్రమాణాలేవీ ప్రజలను కలుపుకునేవిగా లేవు. ప్రజలు ఏమైనా కానీ ఉత్పత్తి పెరగాలి, లాభాలు రావాలి, ఆర్థిక సూచీలు ఊర్ధముఖ ప్రయాణం సాగించాలి అన్ని ధోరణి మోదీ మోడల్‌గా కనిపిస్తున్నది. ఈ తరహా అభివృద్ధి మనజాలదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడవు. సమాజంలో పైవర్గాలు పైపైకి ఎదుగుతాయి. పేదలు ఇంకా ఇంకా కిందికి జారిపోతారు. మధ్యతరగతి, కార్మిక ప్రజానీకం మరింత కునారిల్లే ప్రమాదం ఉంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం గత వారం రోజుల వ్యవధిలో పలు మౌలికమైన అంశాలపై తన వైఖరిని బట్టబయలు చేసింది. నల్లధనం సంపాదించి విదేశాల్లో దాచుకున్న కుబేరుల పేర్లు వెల్లడించలేమని కేంద్ర రక్షణశాఖ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జాబితా బయటపెట్టడానికి ద్వంద్వపన్నుల నివారణ ఒప్పందాలు (డీటీఎఎ) అడ్డం వస్తున్నాయని జైట్లీ చెబుతున్నారు. ఈ కారణం పాతదే. ఇంతకుముందు యూపీఏ కూడా ఇదే కారణం చెప్పింది. ఈ విషయం ఎన్నికలకు ముందు కూడా బీజేపీ నాయకత్వానికి తెలుసు. అయినా అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో జాబితా బయటపెడతామని, విదేశాల్లో మగ్గుతున్న ధనాన్ని జాతికి అంకితం చేస్తామని సెలవిచ్చారు. మోదీ మొండి వారని, ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని అందరూ ఆశించారు. ఇంత తొందరగా ఆ భ్రమలు తొలగిస్తారని ఎవరూ అనుకోలేదు.

శ్రమేవ జయతే పథకం ప్రారంభించిన రోజు కార్మికులకు ఏదో చేస్తున్నారని అందరూ భావించారు. ఆయన చేసిన ప్రసంగం విన్న తర్వాత అసలు విషయం బోధపడింది. ఇది యాజమాన్యాలను కార్మిక చట్టాల నుంచి విముక్తి చేసే పథకం అని ఆయన స్పష్టంగానే చెప్పారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించి యాజమాన్యాలు ఇప్పటిదాకా మోస్తున్న బాధ్యతలనుంచి మినహాయింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. పరిశ్రమల అధికారులు, కార్మిక శాఖ అధికారులు ఇక నుంచి పరిశ్రమలు సందర్శించాల్సిన పనిలేదట. తనిఖీ చేయాల్సిన పనిలేదట. యాజమాన్యాలు స్వయం ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే చాలని చెబుతున్నారు. కార్మికలోకం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను, భద్రతలను అన్నింటినీ తొలగించే పనిని మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని అర్థమవుతున్నది.

ఇది శ్రమేవ జయతే కాదు, శ్రమదోపిడీ జయతేగా చెబితే బాగుండేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం మరో విధాన నిర్ణయమూ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు త్వరలో షెడ్యూలు ప్రకటిస్తామని, మరో 42,000 కోట్లు సేకరిస్తామని జైట్లీ చెప్పారు. ఇప్పటిదాకా వదిలేసిన మరికొన్ని సంస్థలను కూడా ఉపసంహరణ విధానంలోకి తీసుకువస్తామని కూడా జైట్లీ చెప్పారు. ఇంకా దారుణమైన అంశం మరొకటి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్య సేకరణ సందర్భంగా రైతులకు మద్దతు ధరపై ఎటువంటి బోనస్‌లు ప్రకటించరాదని కూడా కేంద్రం రాష్ట్రాలకు తాఖీదు పంపింది. ఈ పరిణామాలన్నీ ఒక సందేశాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అదేమంటే కేంద్రంలో పార్టీలు మారాయి. ఫ్రంటులు మారాయి. ప్రధాని మారారు. మంత్రులు మారారు. కానీ విధానాలు మారలేదు. ప్రభుత్వం స్వభావం మారలేదు. రూపం మారింది, సారం ఒక్కటే.

యూపీఏ గత దశాబ్దకాలంలో అమలు చేసిన విధానాలను మోదీ కొనసాగిస్తున్నారు. ఆర్థిక సంస్కరణలు మలి దశను మరింత వేగవంతం చేసేందుకు ఆయన ద్వారాలు బార్లా తెరుస్తున్నారు. అందుకు అందమైన నినాదాలు ఇస్తున్నారు. ఆకర్షణీయమైన పేర్లు పెడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదం అంటే పరిశ్రమలకు స్వేచ్ఛనివ్వడం, కార్మికులను గాలికి వదిలేయడం కాకూడదు. దేశంలో ఇప్పటికే కార్మికుల పరిస్థితి గాలిలో దీపంలాగా ఉంది. సంఘటిత రంగం బలహీనపడి, అసంఘటిత రంగం పెరుగుతున్నది. కార్మికులకు భద్రత లేదు. పనిగంటలపై అదుపు లేదు. పరిశ్రమలను తనిఖీ చేసే అధికారం ఉన్నా, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖలు ఎప్పుడూ వాటి ఛాయల్లోకి వెళిన్ల దాఖలాలు ఉండవు. కొన్ని పరిశ్రమలు కోటగోడల్లాంటి దుర్భేద్యమైన ప్రాకారాల్లో ఉంటాయి.

అక్కడికి వెళ్లడం, తిరిగి రావడం అంతతేలికగా అయ్యేపనికాదు. కోట్లాది మంది కార్మికులు ఇప్పటికీ భవిష్యనిధి, ఉద్యోగ బీమాలకు దూరంగానే ఉన్నారు. చాలా పేరు పొందిన కంపెనీలు కూడా కార్మికులకు భవిష్యనిధి, ఉద్యోగ బీమాలు చెల్లించడం లేదు. ప్రత్యేక ఎగుమతి జోన్ల(ఎస్‌ఈజడ్)లోనయితే ప్రభుత్వమే లేదు. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఎస్‌ఈజడ్‌గా మార్చే కుట్రకు మోదీ తెరలేపారు. మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావాలంటే పరిశ్రమలకు స్వేచ్ఛ ఉండాలట. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. దేశం సుసంపన్నంగా ఎదగడమంటే మనుషులతో ఎదగాలి. కేవలం పరిశ్రమలతో, ఉత్పత్తులతో కాదు. అందులో పనిచేసే కార్మికులు కూడా సుసంపన్నంగా ఎదిగితేనే అభివృద్ధికి సార్థకత. సరైన జీతాలు లేక, ఉద్యోగ భద్రత లేక, కునారిల్లే కార్మికలోకం ఉంటే దేశంలో శాంతి ఉంటుందా? దేశం సుభిక్షంగా ఉంటుందా?

నల్లధనం విషయంలో మోదీ ప్రభుత్వం పాత పాట పాడడంలో వింతేమీ లేదు. నల్ల కుబేరులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలలో ఉన్నారు. నల్ల కుబేరుల జాబితాలో ఈ ప్రభుత్వాలను వెనుక ఉండి నడిపించే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారని చెబుతారు. కాంగ్రెస్ అందుకే సాహసం చేయలేదు. డీటీఏఏ ఒప్పందం అన్నది సాకు మాత్రమే. జర్మనీతో డీటీఏఏ ఉంటే స్విస్ ఖాతాలకు ఏమి అడ్డమో అర్థం కాదు. యూపీఏ ఇదే కారణం చెప్పి తప్పించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎన్డీయే కూడా ఇదే కారణం చెబుతున్నది. కాంగ్రెస్ పాప పంకిలమైపోయిందని, తాము దేశాన్ని ప్రక్షాళన చేస్తామని గంభీర ప్రకటనలు చేసిన ఎన్డీయే ఓడదాటి తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా ఇచ్చినమాటను చెత్తబుట్టలో పడేసింది. ఓట్లకోసం చెప్పేవన్నీ నిజాలు కావని మరోసారి రుజువు చేసింది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ గత రెండున్నర దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల విధానమే. ఎన్డీయే దానిని ద్విగుణీకృతం, త్రిగుణీకృతం చేయాలనుకోవడమే కొత్త. ఇది ఆర్థిక సంస్కరణలకు కొనసాగింపు మాత్రమే. ఎన్డీయేకు ప్రత్యేకించి దేశీయ ఎజెండా ఏదీ లేదని ప్రపంచ బ్యాంకు నిర్దేశాల ప్రకారమే ఎన్డీయే కూడా నడుచుకుంటుందని 1999-2004లో రుజవయింది. ఇప్పుడు మోదీ కూడా అదే రుజువు చేస్తున్నారు. ఆయన మరో అడుగు ముందుకు వేస్తున్నారు. వ్యవసాయ సబ్సిడీలపై కత్తెర వేసేందుకు ఆయన పూనుకుంటున్నారు. ధాన్యానికి కేంద్రం ప్రకటించే మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత బోనస్ ప్రకటించి కొనుగోలు చేయడం ఇప్పటిదాకా అమలవుతున్న విధానం.

ధాన్యం ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, వ్యవసాయాన్ని ఎంతోకొంత లాభసాటిగా మార్చడానికి ఉద్దేశించి ఈ బోనస్ ప్రకటిస్తున్నారు. ఇక నుంచి ఈ బోనస్‌లు ప్రకటించవద్దంటూ కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి రాష్ట్రాలకు లేఖ వచ్చింది. ఈ లేఖ బీజేపీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కే నచ్చలేదు. ఇలా అయితే వ్యవసాయోత్పత్తి పడిపోతుందని, రైతులు నిరుత్సాహపడతారని, ఆహారభద్రతకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయని ఆయన తిరుగుటపాలో లేఖ రాశారు. కానీ ఇది మోదీ సొంత ఆలోచన కాదు. ప్రపంచబ్యాంకు, అమెరికా భారత్‌కు అదేపనిగా నిర్దేశిస్తున్న ప్రిస్క్రిప్షన్. భారత్‌లో వ్యవసాయానికి సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై కోతపెట్టాలని వారు చాలాకాలంగా రొదపెడుతున్నారు.

ఆ సబ్సిడీల ఉపసంహరణలో భాగంగానే ఇప్పటికే ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. పారిశ్రామిక రుణాల వడ్డీ కంటే కొన్ని సందర్భాల్లో వ్యవసాయ రుణాల వడ్డీయే అధికంగా ఉంటున్నది. పెట్టుబడులు పెరిగి, తగినంత దిగుబడి రాక, కాలం కలసిరాక రైతులు వీధినపడుతున్నారు. వ్యవసాయ రంగానికి ఇప్పుడున్న సబ్సిడీలను ఉపసంహరిస్తే సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.

రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయి. అభివృద్ధికి మోదీ చూపెడుతున్న ప్రమాణాలేవీ ప్రజలను కలుపుకునేవిగా లేవు. ప్రజలు ఏమైనా కానీ ఉత్పత్తి పెరగాలి, లాభాలు రావాలి, ఆర్థిక సూచీలు ఊర్ధముఖ ప్రయాణం సాగించాలి అన్ని ధోరణి మోదీ మోడల్‌గా కనిపిస్తున్నది. ఈ తరహా అభివృద్ధి మనజాలదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడవు. సమాజంలో పైవర్గాలు పైపైకి ఎదుగుతాయి. పేదలు ఇంకా ఇంకా కిందికి జారిపోతారు. మధ్యతరగతి, కార్మిక ప్రజానీకం మరింత కునారిల్లే ప్రమాదం ఉంది.

Source: నమస్తే తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *